పొలంలో బయటపడ్డ 6 బీరువాలు, మోటారు సైకిల్‌

ABN , First Publish Date - 2022-01-28T05:14:03+05:30 IST

మండలంలోని ముదివర్తిపాళెంలో ఓ రైతు తన పొలాన్ని సాగులోకి తెచ్చుకొనే ప్రయత్నం చేసుకుంటుండగా.. 6 బీరువాలు, ఒక మోటారుసైకిల్‌ భూమిలో నుంచి బయటపడడంతో భూ యజమానితో పాటు పనిచేస్తున్న కూలీలు నివ్వెరపోయారు.

పొలంలో బయటపడ్డ 6 బీరువాలు, మోటారు సైకిల్‌
పోలీసులకు మోటారు సైకిల్‌ అప్పజెబుతున్న రైతు నాగరాజు

ఇందుకూరుపేట, జనవరి 27 : మండలంలోని ముదివర్తిపాళెంలో ఓ రైతు తన పొలాన్ని సాగులోకి తెచ్చుకొనే ప్రయత్నం చేసుకుంటుండగా.. 6 బీరువాలు, ఒక మోటారుసైకిల్‌ భూమిలో నుంచి బయటపడడంతో భూ యజమానితో పాటు పనిచేస్తున్న కూలీలు నివ్వెరపోయారు. గురువారం ముదివర్తిపాళెంలో జరిగిన ఈ సంఘటన మండలం అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇటీవల పెన్నానదికి వరదలు రావడంతో ముదివర్తిపాళెంలో సరిగ్గా అదే గ్రామానికి  చెందిన ఎస్‌.నాగరాజు పొలం వద్ద కట్ట తెంచుకుంది. దీంతో గ్రామమంతా మునిగిపోయిన విషయం విదితమే. మూడు నెలలుగా నీళ్లు ఉండడం వలన వ్యవసాయ పనులు చేపట్టలేని నాగరాజు తన పొలంలో నీళ్లు మళ్లించి, ఇసుక తొలగించే పనులను గురువారం ప్రారంభించగా.. అందులో నుంచి 6స్టీలు బీరువాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఇవి రాజుకాలనీకి చెందిన వారివని ఆ కాలనీవాసులు వాటిని తీసుకెళ్లారు. ఆ తర్వాత మోటార్‌ సైకిల్‌ రావడంతో వెంటనే నాగరాజు ఈ విషయమై తహసీల్దారు, ఎస్‌ఐకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ వెంటనే స్పందించి ఏఎస్‌ఐను పంపించారు. దీంతో బైక్‌ను తీసి పోలీసులకు అప్పజెప్పారు.  



Updated Date - 2022-01-28T05:14:03+05:30 IST