Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలవరం... అదనపు వ్యయాన్ని రాష్ట్రమే భరించాలి: కేంద్రం

ఢిల్లీ: పోలవరం హెడ్‌ వర్క్స్‌ డిజైన్ల మార్పు కారణంగా పెరిగిన అదనపు వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. డిజైన్ల మార్పుల వల్ల హెడ్‌ వర్క్స్‌ వ్యయం 5,535 కోట్ల రూపాయల నుంచి 7,192 కోట్ల రూపాయలకు పెరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని కేంద్ర జల శక్తి శాఖ వెల్లడించింది. 2014 ఏప్రిల్‌ 1 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ ఇరిగేషన్‌ పనులకు వేసిన అంచనా వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 


పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే అని కేంద్ర మంత్రి అన్నారు. నిర్మాణ ప్రణాళికతోపాటు ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌ డిజైన్లు గోదావరి జలాల ట్రైబ్యునల్‌ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవో లేదో కేంద్ర జల సంఘం - సీడబ్ల్యూసీ పరిశీలించి ఆమోదించిన మీదటే వాటిని ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ప్రాజెక్ట్‌లోని కొన్ని అంశాలకు సంబంధించిన డిజైన్లను సీడబ్ల్యూసీ మార్పులు జరిగాయన్నారు. 


ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఎత్తు పెంచడం, పునాదుల లోతు పెంచడం, స్పిల్‌వేలోని అత్యంత లోతైన బ్లాకులలో కాంక్రీట్‌ గ్రేడ్‌ల పెంపు, ఎగువ కాఫర్‌ డామ్‌లో ఎడమ వైపు డయాఫ్రం వాల్‌తో కటాఫ్‌ నిర్మాణం, గేట్‌ గ్రూవ్స్‌లో చిప్పింగ్‌ పనులు, స్పిల్‌వేలో రెండో దశ కాంక్రీట్‌ పనుల నిర్వహణ పనులను అదనంగా చేపట్టవలసి వచ్చిందని ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి వివరించారు.

Advertisement
Advertisement