పునరావాసానికి పైసా రాదు!

ABN , First Publish Date - 2021-07-25T07:15:28+05:30 IST

పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాసానికి కేంద్రం నిధులిస్తుందో లేదోనన్న అనుమానాలు తీవ్రమవుతున్నాయి. తుదిఅంచనా వ్యయం రూ.55,656.87 కోట్ల విషయంలో ఎటూ తేల్చడం లేదు

పునరావాసానికి పైసా రాదు!

పోలవరంపై తేల్చేసిన కేంద్రం?.. హెడ్‌ వర్క్స్‌ పనులకే నిధులిచ్చామన్న షెకావత్‌

భూసేకరణ, పునరావాసానికి ఇవ్వలేదని స్పష్టీకరణ

2013-14 ధరల ప్రకారం 20,398 కోట్లకే కట్టుబాటు

ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికి ఇచ్చింది 11,182 కోట్లు

ఇవ్వాల్సిన దానిపై మౌనం... తుది అంచనా ఊసేలేదు

రాష్ట్రానికి రీయింబర్స్‌ చేయాల్సింది రూ.1,900 కోట్లు

ఇందులో రూ.919 కోట్లపై పీపీఏ అభ్యంతరాలు?

45.72 మీటర్ల కాంటూరుకు పునరావాసం కష్టమే

41.15 మీటర్లకే పరిమితం చేయాలని రాష్ట్రం  యోచన

ఇదే జరిగితే పోలవరం ప్రాజెక్టు మరో ఎత్తిపోతలే!

బహుళార్థ సాధకం కాబోదు.. నిపుణుల ఆందోళన


పోలవరం ప్రాజెక్టు ‘బహుళార్థ’ కలలు చెదిరిపోతున్నాయి. అత్యంత కీలకమైన పునరావాసానికి నిధులు ఇచ్చేది లేదని కేంద్రం కాస్త సూటిగానే చెబుతోంది. దీంతో... నీటి నిల్వ ‘ఎత్తు’ తగ్గించడం ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే... పోలవరం మరో ఎత్తిపోతలగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాసానికి కేంద్రం నిధులిస్తుందో లేదోనన్న అనుమానాలు తీవ్రమవుతున్నాయి. తుదిఅంచనా వ్యయం రూ.55,656.87 కోట్ల విషయంలో ఎటూ తేల్చడం లేదు. రాష్ట్రప్రభుత్వం ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా మౌనమే సమాధానం. 2013-14 అంచనావ్యయం రూ.20,398.61 కోట్ల ప్రస్తావన తప్ప.. మరే లెక్కా చెప్పడం లేదు. నిర్మాణ పనుల వరకే నిధులిస్తామని.. భూసేకరణ, పరిహారం.. నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాల బాధ్యత రాష్ట్రానిదేనని కేంద్రం గతంలోనే తేల్చేసింది. తాజాగా రాజ్యసభలో మరోసారి తన వైఖరిని తేటతెల్లం చేసింది. 2014నుంచి ఇప్పటిదాకా ప్రాజెక్టు నిర్మాణ పనులకుగాను కేంద్రం రూ.11,182 కోట్లు విడుదల చేసిందని.. భూసేకరణ, సహాయ పునరావాసానికి మంజూరు చేయలేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ గురువారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎక్కడా సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను గానీ, కేంద్రమే సవరించిన రెండో అంచనా వ్యయం రూ.47,725.74 కోట్ల గురించి గానీ ప్రస్తావించలేదు. ఇప్పటివరకూ ఇచ్చిందెంతో చెప్పారు తప్ప.. ఇంకా ఇవ్వాల్సిందెంతో చెప్పలేదు. కేంద్రం వరుస చూస్తుంటే రూ.20,398.61 కోట్ల అంచనా వ్యయానికే కట్టుబడి ఉన్నట్లు కనబడుతోందని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. ఇందులో విద్యుత్‌ ప్రాజెక్టు వ్యయాన్ని.. 2014కిముందు.. అంటే దీనిని జాతీయ హోదా ప్రాజెక్టుగా ప్రకటించకముందు రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.4,730.71 కోట్లను తీసివేస్తే రూ.12,641 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం ఇదివరకే లెక్కలేసింది. రాష్ట్రానికి రూ.1,900 కోట్లు రీయింబర్స్‌ చేయాల్సి ఉండగా.. దరిదాపుగా రూ.919 కోట్ల చెల్లింపుపై పీపీఏ స్ర్కుటినీ చేస్తోంది. ఇందులో రూ.500 కోట్ల బిల్లులను తిప్పి పంపినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో 45.72 మీటర్ల కాంటూరు మేరకు భూసేకరణ, సహాయ పునరావాసం చేపట్టడం రాష్ట్రానికి సాధ్యమేనా అనే సందేహాలు నెలకొంటున్నాయి. 


నెల రోజులే గడువు...

ప్రాజెక్టు పరిధలో 20,870 నిర్వాసిత కుటుంబాలకు సహాయ పునరావాస కార్యక్రమాలను అందజేయాల్సి ఉంది. వీరిలో 3,601 కుటుంబాలకు ఇదివరకే అమలు చేసేశారు. మిగిలిన 17,269 కుటుంబాలకు ఎప్పుడు అమలుచేస్తారో అంతుపట్టడం లేదు. భూసేకరణకు రూ.155.98 కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌ నగదు చెల్లింపులకు రూ.1,094.60 కోట్లు, శాశ్వత గృహాలు, మౌలిక సదుపాయాల కోసం రూ.1,497కోట్లు.. మొత్తంగా రూ.2,748 కోట్లు అవసరమవుతాయి. ఈ మొత్తాన్ని కేంద్రం ఇవ్వకున్నా రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుందని తాజాగా పోలవరం సందర్శన సమయంలో సీఎం జగన్‌ తెలిపారు. నిరుడు డిసెంబరులో కూడా ఇదే చెప్పారు. కానీ ఇంతవరకు పైసా విడుదల చేయలేదు. ఈ ఏడాది జూన్‌లో ఉభయ గోదావరి జిల్లాల పనులకు రూ.93.58కోట్లు అవసరమవుతాయని జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెలలో రూ.313.63 కోట్లు, ఆగస్టులో రూ.600.50కోట్లు.. మొత్తం 1,007.71 కోట్లు నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమని చెప్పారు. వచ్చే నెలనాటికి 1,007 కోట్లు విడుదల చేసినా.. గృహనిర్మాణాలు పూర్తి కావు. ఇవి పూర్తయితే తప్ప 17,269 కుటుంబాలను తరలించడం సాధ్యపడదు. తమకు పరిహారం చెల్లించకుండానే బలవంతంగా ముంపు ప్రాంతాల నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ జాతీయ ఎస్టీ కమిషన్‌కు గిరిజనులు ఫిర్యాదుచేశారు. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలని సీఎస్‌ను కమిషన్‌ ఆదేశించింది. వరద తీవ్రంగా ఉండడం.. వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో పునరావాస కాలనీలను నిర్మించడం సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


అసలు కథ ముందుంది!

ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యంతో 196టీఎంసీలు నిల్వ చేయాలంటే.. 45.72 మీటర్ల కాంటూరు మేరకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం 85,136 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 53,192 ఎకరాల భూమి సేకరించి 2013 పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం రూ.6,245.62 కోట్లు వ్యయమవుతాయని అంచనా. ఈ మొత్తం మున్ముందు మరింత పెరిగే అవకాశాలూ ఉన్నాయి. నిర్వాసితులు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరితే.. భూముల విలువ అమాంతం పెరిగిపోతోంది. అదే జరిగితే.. కేంద్ర సాయం లేకుండా రాష్ట్రమే ఆ బరువును మోయడం అసాధ్యం. సహాయ పునరావాసం కింద రూ7,655.50 కోట్లను నగదు చెల్లింపుల కింద ఇవ్వాల్సి ఉంటుంది. పునరావాస గృహాల నిర్మాణానికి రూ.12,882.30 కోట్లు ఖర్చుచేయాలి. అంటే రాష్ట్రప్రభుత్వం రూ.26,783.42 కోట్లు ఖర్చు చేయాలన్న మాట. ఉద్యోగుల వేతనాలకే అప్పులు దొరక్క కిందమీదలవుతున్న పరిస్థితుల్లో ఇంత ఇవ్వాలంటే అసాధ్యమే. అందుకే కేవలం రూ.1,007కోట్లు ఖర్చుచేసి 41.15 మీటర్ల కాంటూరులో 115టీఎంసీల నిల్వకే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా బహుళార్థ సాధక ప్రాజెక్టును సాధారణ ఎత్తిపోతలు గానో, రిజర్వాయరుగానో మార్చే దిశగా అడుగులు వేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-07-25T07:15:28+05:30 IST