నిర్వాసితులపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-17T06:26:28+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తరతరాలుగా నివాసముంటున్న భూములను అప్పగించిన నిర్వాసితుల గోడును ప్రభుత్వం వినిపించు కోవడం లేదు.

నిర్వాసితులపై నిర్లక్ష్యం
పోలవరంలో నిరసన దీక్షలో నిర్వాసితులు (ఫైల్‌)

సహాయ పునరావాసం లేదు.. ఇస్తామన్న రూ.10 లక్షలు లేవు

సీఎం అయిన తర్వాత పైసా ఇవ్వని జగన్‌ ప్రభుత్వం

న్యాయం కోసం నిర్వాసితుల నిరసన దీక్షలు

భూసేకరణ, పునరావాసానికి చెల్లించాల్సింది రూ.35,669 కోట్లు..

ఇప్పటి వరకూ ఖర్చు 6,654 కోట్లే.. 

ఇంకా కావలసింది 29,014 కోట్లు

ఇరిగేషన్‌కే నిధులిస్తాం.. ఆర్‌అండ్‌ఆర్‌కు 

సంబంధం లేదంటున్న కేంద్రం..

కేంద్రం ఇస్తేనే ప్రాజెక్టు    పూర్తి చేస్తామంటున్న రాష్ట్రం


(అమరావతి/పోలవరం–ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తరతరాలుగా నివాసముంటున్న భూములను అప్పగించిన నిర్వాసితుల గోడును ప్రభుత్వం వినిపించు కోవడం లేదు. వారికివ్వాల్సిన పరిహారం ఊసెత్తడం లేదు. ఈ విషయంలో జగన్‌ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని జలవనరుల శాఖ లెక్కలే చెబుతున్నాయి. నిర్వాసితులను త్యాగధనులుగా గుర్తిస్తే వారిని సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించడం లేదు ? పునరావాస కాలనీలకు తరలించిన కొద్దిమందికీ రోడ్లు, తాగునీరు, పాఠశాలలు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సదు పాయాలు ఎందుకు కల్పించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


ప్రాజెక్టు నిర్మాణమంటే.. కాంక్రీట్‌ నిర్మాణం కాదని.. ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన చివరి నిర్వాసితుడి వరకూ పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసి నప్పుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గంభీర ప్రసంగాలు చేశారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అంచనా వ్యయాన్ని ఏకబిగిన రూ.16,045 కోట్ల నుంచి రూ.55,548.87 కోట్లకు పెంచేశారని తప్పుబట్టారు. నిర్వాసితులకు తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చెల్లించిన పరిహారం మొత్తం చాలదని తాను అధికారంలోకి వచ్చాక ఈ భూములకు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున  చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీనిని నిర్వాసితులూ నమ్మారు. జగన్‌ అధికార పగ్గాలు చేపట్టిన రెండేళ్ల తర్వాత రూ.10 లక్షల చెల్లింపుపై ఉత్తర్వు జారీ అయింది. కానీ ఇప్పటి వరకు పైసా చెల్లించలేదు. 2021 జూలై 8న వైఎస్‌ జయంతి నాటికి నిర్వాసితులకు గృహాలను నిర్మించి ఇస్తామని విజయవాడ ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయంలో జలవనరుల మంత్రి అనిల్‌ కుమార్‌ అట్టహాసంగా ప్రకటించారు. అదీ అమలుకు నోచుకోలేదు. వీటిపైనే ఇప్పుడు నిర్వాసితులు ఆందోళనలకు దిగారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన దీక్షలు చేపట్టారు. అయినా వైసీపీ ప్రజా ప్రతి నిధులూ..ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు.


ఇవ్వనంటున్న కేంద్రం..

భూసేకరణ, సహాయ పునరావాసం ఖర్చు రాష్ట్ర ప్రభు త్వానిదేనని తనకు సంబంధం లేదని కేంద్రం అంటు న్నది. ఇరిగేషన్‌ కాంపొనెంట్‌కు మాత్రమే నిధులిస్తామని ఖరా కండీగా చెబుతోంది. ఈ విషయాల్లో జగన్‌ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. పైగా కేంద్రం నిధులిస్తేనే ప్రాజెక్టును పూర్తిచేసే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగానే నీటి నిల్వను 41.15 మీటర్ల కాంటూ రుకు పరిమితం చేసే దిశగా ఆలోచన చేసింది. దీనికి రూ.8,002.42 కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేసింది. ఇందులో రూ.4,805.36 కోట్లు ఇప్పటికే ఖర్చయ్యాయి. మరో రూ.3,197.06 కోట్లు ఖర్చు చేసి.. 91 టీఎంసీలను నిల్వ చేసి ప్రాజెక్టు పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకోవాలని సర్కారు చూస్తోంది.ఇదే జరిగితే పోలవరం ప్రాజెక్టు ఒక రిజ ర్వాయరుగా కాకుండా ఎత్తిపోతల పథకంగా మిగిలి పోతుం దని జలవనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


నిర్వాసితులు ఎందరు ?

పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.72 మీటర్లు. అంటే.. 194.60 టీఎంసీలు. ఈ స్థాయిలో నీటిని నిల్వ చేయా లంటే ఎనిమిది మండలాలకు చెందిన 222 రెవెన్యూ గ్రామాలు ముంపునకు గురవుతాయి. 373 హేబిటేషన్లు ప్రభా వితం అవుతాయి. ఇందులో 25 హేబిటేషన్లకు చెందిన కుటుం బాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా 348 ఆవా సాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సహాయ పునరా వాసంలో భాగంగా 213 కాలనీలను నిర్మించాలి. ఇప్పటి వరకూ 26 కాలనీలు మాత్రమే పూర్తయ్యాయి. ప్రాజెక్టు కారణంగా 1,06,006 కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. ఇప్పటి వరకూ 6,351 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా ఇంకా 99,655 కుటుంబాలను రక్షిత ప్రాంతానికి తరలించాలి. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.11,094.31 కోట్లతో 1,67,339.13 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందులో రూ.5,277.24 కోట్లతో 1,12,555.99 ఎకరాలను సేకరించారు. మరో రూ.7,533.36 కోట్లతో 54,738.14 ఎకరాలను సేకరించాల్సి ఉంది. భూసేకరణ, సహాయ పునరావాసం కోసం రూ.8,112.10 కోట్లు నగదుగా చెల్లించాలి. ఇందులో రూ.578.74 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇంకో రూ.7,533.36 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సహాయ పునరావాసంలో భాగంగా గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం రూ.13,262 కోట్లు వ్యయం చేయాలి. రూ.798.41 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. భూసేకరణ, సహాయ పునరావాస పద్దుల కింద మొత్తం రూ.35,669.08 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటే.. ఇప్పటి వరకూ 6,654.39 కోట్లే ఖర్చు చేశారు. ఇంకా రూ.29,014.69 కోట్లు ఖర్చు చేయాలి. నిర్వాసితుల కోసం చేసిన ఖర్చు చిటికెడైతే.. చేయాల్సింది బారెడని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - 2022-01-17T06:26:28+05:30 IST