కేసీఆర్‌ మాటలు పట్టించుకోవద్దు

ABN , First Publish Date - 2020-08-13T07:40:56+05:30 IST

కేసీఆర్‌ మాటలు పట్టించుకోవద్దు

కేసీఆర్‌ మాటలు పట్టించుకోవద్దు

‘అపెక్స్‌’లోనే సమాధానం చెబుదాం: సీఎం


అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ విస్తరణ ద్వారా రోజుకు మూడు టీఎంసీలను తీసుకెళ్లేందుకు తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనక్కరలేదని సీఎం జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పథకం సహా ఇతర స్కీంలపై తెలంగాణ వెలిబుచ్చుతున్న అభిప్రాయాలకు ఈ నెల 20వ తేదీ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగగ్‌ షెకావత్‌ అధ్యక్షతన జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే సమాధానాలిద్దామని చెప్పినట్లు తెలిసింది. నీటి ప్రాజెక్టులపై బుధవారమిక్కడ జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్‌  చేసిన వ్యాఖ్య లు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. రాయలసీమ పథకంపై ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. సీఎం స్పందిస్తూ.. నీటి ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపుల మేరకు చేపడుతున్నామని చెప్పారు. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే సరైన సమాధానం చెబుదామన్నారు. ‘పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందంటే అంగీకరించేది లేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర విభజనకు ముందునుంచి ఇచ్చిన ఉత్తర్వులను సిద్ధం చేయండి’ అని  ఆదేశించారు. రాష్ట్ర వాదనను బలంగా వినిపిద్దామని తెలిపారు.


పోలవరం నిధులపై ప్రత్యేక దృష్టి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రావలసిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. అలాగే పునరావాస కార్యక్రమాలకూ ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. సాగునీటి సమీక్షలో కరోనా సమయంలోనే పోలవరం పనులు కొనసాగిస్తున్నామని.. అధికారులు వివరించారు. సెప్టెంబరు 15 నాటికి పిల్లర్ల పనులు పూర్తవుతాయన్నారు. వర్షాకాలంలోనూ పనులు చేపట్టేందుకు  ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. పోలవరం పునరావాస కార్యక్రమంపై దృష్టి సారించాలని.. ప్రాజెక్టుపై చేసిన వ్యయం బిల్లులను సిద్ధం చేసి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని సీఎం తెలిపారు. ఇక, అక్టోబరు నాటికి అవుకు టన్నెల్‌ -2 పూర్తి చేస్తున్నామని అధికారులు చెప్పారు. విజయనగరం జిల్లా ప్రాజెక్టులను కూడా త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.  తోటపల్లిలో మిగిలిన పనులు సహా వివిధ ప్రాజెక్టులకు రూ.500 కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ అన్ని ప్రాజెక్టులూ పూర్తవుతాయన్నారు. వెలిగొండ మొదటి టన్నెల్‌ నుంచి డిసెంబరులో నీటి విడుదలకు సిద్ధం చేస్తున్నామని అధికారులు చెప్పారు. వెలిగొండ-2 టన్నెల్‌నూ వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు బ్యారేజీలో గేట్ల బిగింపు కార్యక్రమాన్ని చేపట్టామని అధికారులు చెప్పారు. దీనితోపాటు సంగం బ్యారేజీ పనులనూ నవంబరుకి పూర్తి చేస్తామన్నారు. వంశధార-నాగావళి అనుసంధాన పనులు డిసెంబరు చివరికి  పూర్తి చేస్తామని వెల్లడించారు. వంశధార ప్రాజెక్టు -2, స్టేజ్‌ -2 పనులు వచ్చే మార్చి నాటికి పూర్తవుతాయని తెలిపారు. గండికోటలో 26.85 టీఎంసీలు నిల్వచేద్దామని సీఎం అన్నారు. చిత్రావతిలో పది టీఎంసీల నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గండికోట - పైడిపాలెం ఎత్తిపోతల అభివృద్ధి  పనులు త్వరితగతిన ప్రారంభించాలని, గాలేరు-నగరి నుంచి హంద్రీ-నీవా లింకు పనులు కూడా వెంటనే చేపట్టాలన్నారు. 

Updated Date - 2020-08-13T07:40:56+05:30 IST