పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే బాలరాజు

ABN , First Publish Date - 2021-07-29T22:17:48+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హామీ ఇచ్చారు.

పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే బాలరాజు

పోలవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హామీ ఇచ్చారు. గురువారం వేలేరుపాడు మండలంలో పోలవరం ముంపు గ్రామాలైన కోయిదా, కాచరాం, కట్కూరు, నార్లవరంలో ఎమ్మెల్యే బాలరాజు పర్యటించి నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బరకాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 3 నెలల రేషన్ పంపిణీ చేశామని, కూరగాయలు కూడా అందజేశామని ఎమ్మెల్యే చెప్పారు. రానున్న 2 నెలల్లో 41.5 కాంటూర్ పరిధిలో మొదటి ఫేజ్ పునరావాసం పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే మెదటి ఫేజ్ ముంపు గ్రామాలను నిర్వాసిత కాలనీలకు తరలించే ఏర్పాట్లు పూర్తి చేస్తామని, పరిహారం కూడా అందజేస్తామని తెలిపారు.


సచివాలయాల ఆకస్మిక తనిఖీ

వేలేరుపాడు మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే బాలరాజు గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కట్కూరు, నార్లవారం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. గ్రామాల్లో శానిటేషన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాలు ప్రజల సమస్యల పరిష్కారానికి వేదిక కావాలని, సచివాలయాల ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పారు. ప్రజలు కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగకూడదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ది అందజేయాలని ఎమ్మెల్యే బాలరాజు ఆదేశించారు.

Updated Date - 2021-07-29T22:17:48+05:30 IST