తేల్చలేక... ముంచేస్తూ!

ABN , First Publish Date - 2021-06-14T06:39:21+05:30 IST

పోలవరం ప్రాజెక్టు కింద ముంపు ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక సర్వే, పునరావాస పనులు 2022 మధ్యంతరానికి సాధ్యమని ప్రాజెక్టు అఽథారిటీ ముందు తేల్చేసిన అధికారులు మరోపక్క నిర్వాసితులను ముంచేస్తూ ప్రభుత్వానికి అప్రదిష్ట తెస్తున్నారు.

తేల్చలేక... ముంచేస్తూ!

  • ఎన్జీటీ తీర్పునకు భిన్నంగా పోలవరం పునరావాస అధికారుల తీరు
  • 2022 మధ్యంతరానికే సాధ్యమని పీపీఏకు చెప్పిన ప్రభుత్వం
  • అదనపు గడువు కోసం ఎన్జీటీకే విన్నవించాలన్న పోలవరం అథారిటీ

(రంపచోడవరం)

పోలవరం ప్రాజెక్టు కింద ముంపు ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక సర్వే, పునరావాస పనులు 2022 మధ్యంతరానికి సాధ్యమని ప్రాజెక్టు అఽథారిటీ ముందు తేల్చేసిన అధికారులు మరోపక్క నిర్వాసితులను ముంచేస్తూ ప్రభుత్వానికి అప్రదిష్ట తెస్తున్నారు.  పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.  పోలవరం ప్రాజెక్టు, దాని పర్యవసానాలు, నిర్వాసితుల సమస్యల అంశంలో తెలంగాణకు చెందిన పొంగులేటి సుధాకరరెడ్డి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో దాఖలు చేసిన వ్యాజ్యం తీర్పు మేరకు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక సర్వే, అర్హులైన నిర్వాసితుల జాబితాతో పునరావాస చర్యలను ఆరు నెలల్లో పూర్తి  చేయకపోగా గ్రామాలు మునిగిపోయేలా చేసి నిర్వాసితులను వారి గ్రామాల నుంచి తరలించేయడం వివాదాస్పదమవుతోంది. 

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తన తీర్పులోని అంశాల అమలు బాధ్యతను పోలవరం ప్రాజెక్టు అఽథారిటీకి అప్పగించింది. ఆ మేరకు గత సంవత్సరం అక్టోబరులో తొలి ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించి ఆయా పనులకు లక్ష్యాలను నిర్దేశించింది. 2020 ఆగస్టులో వచ్చిన ఆ తీర్పు ప్రకారం చూస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసాంతానికే సామాజిక సర్వే, అర్హులైన నిర్వాసితుల జాబితా, పునరావాస చర్యలూ పూర్తి కావాల్సి ఉంది. ఇదే అంశాలను ఈ సంవత్సరం మార్చిలో సమీక్షించినపుడు ట్రిబ్యునల్‌ నిర్దేశించిన ఆరు నెలల కంటే మించిన సమయం తమకు కావాలని ప్రభుత్వం ప్రాజెక్టు అఽథారిటీకి నివేదించింది. కాగా గత నెలలో నిర్వహించిన రెండో ఉమ్మడి సమావేశానికి హాజరైన పునరావాస కమిషనరు ట్రిబ్యునల్‌ నిర్దేశించిన సామాజిక-ఆర్థిక సర్వే, పునరావాస చర్యలను 2022 మధ్యంతరానికే పూర్తి చేయగలమని తేల్చి చెప్పేశారు. దీనికి అథారిటీ స్పందిస్తూ ఈ అంశంలో కావాల్సిన గడువు కోసం ఎన్జీటీని సంప్రదించాలని ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ నిర్ణయం తీసుకుంది. సామాజిక సర్వే, నిర్వాసితుల జాబితా, పునరావాస చర్యలను పూర్తి చేయకుండా పునరావాస చట్ట నిబంధనలకు భిన్నంగా గ్రామాల్లో నీటిని నింపేస్తూ, నిర్వాసితులను గ్రామాలను ఖాళీ చేసే చర్యలను చేపట్టడం పెద్ద వివాదానికే తెరలేస్తోంది. 


Updated Date - 2021-06-14T06:39:21+05:30 IST