లాఠీకి ఏదీ క్లారిటీ?

ABN , First Publish Date - 2020-03-26T08:02:18+05:30 IST

కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్‌ విధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. అది విజయవంతం కావడానికి అవసరమైన చర్యలను...

లాఠీకి ఏదీ క్లారిటీ?

  • ఎవరిని అనుమతించాలి? ఎవరిని వద్దు?
  • అత్యవసర సేవల సిబ్బందిని గుర్తించేదెలా?
  • సరైన స్పష్టత లేకపోవడంతో అందరిపైనా
  • లాఠీలు ఝళిపిస్తున్న క్షేత్రస్థాయి పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్‌ విధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. అది విజయవంతం కావడానికి అవసరమైన చర్యలను చేపట్టలేదు! లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు నిత్యావసరాలను  అందించేవారి విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం, కిందిస్థాయి పోలీసులకు అవగాహన కల్పించకపోవడంతో.. వారు గందరగోళానికి గురై రోడ్లపైకి వస్తున్న అందరిపైనా లాఠీలు ఝళిపిస్తున్నారు!! లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్న పోలీసులే.. ఎవరిని అనుమతించాలి, ఎవరిని ఆపాలి అనే విషయాలపై స్పష్టత లేక అత్యవసర సేవలు అందించే సిబ్బందినీ ఇబ్బంది పెడుతున్నారు. లాక్‌డౌన్‌ విజయవంతం కావాలంటే అత్యవసర సేవలు అందించేవారే కీలకం. రోజూ ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు అందాలంటే షాపులు తెరిచి ఉండాలి. షాపులు నడవాలంటే.. హోల్‌సేలర్లు, రిటైలర్లు, ఆయా దుకాణాల్లోని సిబ్బంది, సరుకులు చేరవేసే రవాణా సిబ్బంది పనిచేయాలి. రోడ్లు శుభ్రంగా ఉండాలంటే జీహెచ్‌ఎంసీలోని పారిశుధ్య సిబ్బంది పనిచేయాలి.


విద్యుత్‌, జలమండలి సిబ్బంది కూడా విధులు నిర్వర్తిస్తేనే అందరికీ కరెంటు, నీళ్లు సక్రమంగా అందుతాయి. ప్రజలకు సమాచారం అందాలంటే మీడియా సంస్థలు, పాత్రికేయులు పనిచేయాలి. అనారోగ్యంతో బాధపడేవారికి.. కరోనా బాధితులకు, అనుమానిత లక్షణాలున్నవారికి చికిత్స చేయాలంటే వైద్య సిబ్బంది సేవలు అత్యంత కీలకం. ఇంతమంది కలిసి పనిచేస్తేనే లాక్‌డౌన్‌ విజయవంతమవుతుంది. లేదంటే విఫలమై ప్రజల్లో అసహనం, ఆందోళన పెరిగి శాంతి భద్రతల సమస్య ఎదురయ్యే ముప్పు కూడా ఉంది. కానీ, అత్యవసర సేవలు అందించే సిబ్బందిని ఎలా గుర్తించాలనే విషయంపై క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు స్పష్టత లేదు. దీనివల్లనే తొలి రెండు రోజులూ పాత్రికేయులపై లాఠీ ఝళిపించారు. అత్యవసర సర్వీసుల్లో భాగమైన విద్యుత్తు ఉద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులు కొట్టారు. వైద్య సిబ్బందిపట్లా పోలీసులు దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు జరుగుతున్నాయి. అత్యవసర సేవలు అందించేవారిపై పోలీసులు వైఖరి ఇలాగే కొనసాగితే.. వారు చేతులెత్తేస్తారని.. ప్రజలకు నిత్యావసరాలు అందక లాక్‌డౌన్‌ విఫలమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని ప్రజలు సూచిస్తున్నారు.


అత్యవసర సేవలు అందించే వారికి పాస్‌లు ఇస్తాం: సీపీ

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో అత్యవసర సేవలు అందించే వారికి ప్రత్యేక పాస్‌లు అందించనున్నట్టు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. అత్యవసర సర్వీసుల నిమిత్తం పాస్‌లు కావాల్సినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. వారిని అధికారులు సంప్రదించి, వివరాలు తీసుకుని పాస్‌లు ఇస్తారని చెప్పారు. ఇప్పటికే ఇలా రెండువేల పాస్‌లు ఇచ్చామని.. వారికి పాస్‌లు జారీ చేసేందుకు 24 గంటలూ మూడు షిఫ్టుల్లో అధికారులు పనిచేస్తున్నారని సీపీ చెప్పారు. అయితే, ఇలా తీసుకున్న పాస్‌లను ఎవరైనా దుర్వినియోగం చేసినట్టు తేలితే.. వాటిని రద్దు చేసి, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాస్‌లు కావాల్సినవారు కింద పేర్కొన్న ఈమెయిల్‌ చిరునామా, వాట్సాప్‌ నంబర్ల ద్వారా పోలీసులను సంప్రదించవచ్చు.

మెయిల్‌: covid19.hyd@gmail.com

వాట్సాప్‌ నంబర్‌: 9490616780


Updated Date - 2020-03-26T08:02:18+05:30 IST