మూలాల కోసం అన్వేషణ

ABN , First Publish Date - 2020-08-05T11:34:00+05:30 IST

శానిటైజర్‌ మరణాలపై పోలీసులు దర్యా ప్తు ముమ్మరం చేశారు. కురిచేడులో శానిటైజర్‌ తాగి 16 మంది మృత్యువాత పడటంపై ..

మూలాల కోసం అన్వేషణ

 తయారీపైనే అనుమానాలు

ఆల్కహాలా.. మరేదైనా కెమికల్‌తో తయారైందా?

ఆరు కంపెనీల్లో  తనిఖీలు

నాలుగు మెడికల్‌ షాపులకు అనుమతి


కురిచేడు, ఆగస్టు 4: శానిటైజర్‌ మరణాలపై పోలీసులు  దర్యా ప్తు ముమ్మరం చేశారు. కురిచేడులో శానిటైజర్‌ తాగి 16 మంది మృత్యువాత పడటంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఈ కేసు దర్యాప్తు కోసం మార్కాపురం ఓఎస్‌డీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. అలాగే, విజయవాడ నుంచి స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కూడా దర్యాప్తు చేస్తోంది. శానిటైజర్లను ఆల్క హాల్‌ లేక మరేదైనా కెమికల్‌తో తయారయిందా? అనే కోణంలో విచారిస్తున్నారు.   


ఆ కంపెనీలపైనే అనుమానం..

శానిటైజర్‌ తాగిన వారు వింత లక్షణాలతో మృతి చెందారని కు టుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ప్రత్యేకంగా రెండు మూడు కంపెనీల శానిటైజర్‌ సేవించిన వారే ప్రాణాలు కోల్పోయారు. ఆ శానిటైజర్లు దేనితో తయారయ్యాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇథైల్‌ ఆల్కహాల్‌తోనా లేక  కిక్కు ఎక్కువ ఇచ్చే మరేదైనా రసాయన పదార్థం కలిపారా అనే కోణంలో విచారిస్తున్నారు.  కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ ఐదు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐదు కంపెనీలపై దాడులు నిర్వహించి అక్కడ తయారు చేస్తున్న శానిటైజర్లతో పాటుగా రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. 


వేర్వేరుగా దర్యాప్తు..

సిట్‌ బృందం సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ఫార్మా కంపెనీలో తనిఖీలు చేపట్టింది. ఎస్‌ఈబీ బృందం గుం టూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులోని ఓ ఫార్మా కంపెనీలో సోదాలు నిర్వహించింది. అలాగే కురిచేడు పోలీస్‌స్టేషన్‌లో దర్శి డీఎస్పీ ప్రకాశరావు మెడికల్‌ షాపుల వారితో మాట్లాడారు.  గిద్దలూరు సీఐని ప్రత్యేకంగా పిలిపించి మంగళవారం తెల్లవారు జామున 4గంటల వరకు మెడికల్‌ షాపుల యజమానులను విచారించారు.  అనంతరం కురిచేడులో నాలుగు మెడికల్‌ షాపులు తెరవడానికి అనుమతి ఇచ్చారు. మంగళవారం రాత్రి అద్దంకి సీఐ ఆం జనేయరెడ్డి ఆధ్వర్యంలో కిరాణా, ఫ్యాన్సీ షాపులను తనిఖీ చేశారు. కొన్ని షాపుల్లో కొద్దిమొత్తంలో శానిటైజర్లు పట్టుబడినట్లు తెలిసింది. 


 శానిటైజర్‌ కంపెనీల్లో తనిఖీలు

శానిటైజర్‌ తాగి మృతిచెందిన వారు వినియోగించిన పది బ్రాం డ్లను గుర్తించి అయా కంపెనీలపై అధికారులు దాడులు ముమ్మ రం చేశారు. గుంటూరు జిల్లా సాతులూరు, విజయవాడ సమీపం లోని తాడేపల్లి, గుణదల, బెంగళూరు, ఒంగోలులోని కంపెనీల్లో సిట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సాతులూరులో ఒకే కంపెనీలో మూడు బ్రాండ్లు తయారుచేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్‌లో ఉన్న మరో కంపెనీలో తనిఖీలు చేయా ల్సి ఉంది. అయితే శానిటైజర్‌ తయారీలో ఆల్కహాల్‌కు బదులుగా ఒక కంపెనీలో రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. అయా కంపెనీల్లో స్వాధీనం చేసుకున్న బాటిళ్లు, అదే కంపెనీవి మార్కెట్‌లో ఉన్న శానిటైజర్లను సీజ్‌ చేసి కోల్‌కతాలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌కు పంపారు. అక్కడి నుంచి నివేదికలు నాలుగైదు రోజులలో రావచ్చు.  


కోలుకుంటున్న బాధితులు..

ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందుతుండటంతో కురిచేడులో వారి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎవరికి ప్రాణాపాయం ఉండదని భావిస్తున్నారు. మద్యం షాపులు కూడా తెరచుకోవడంతో శానిటైజరు వైపు మందు బాబులు వెళ్లడం లేదు. అధికారులు చెప్పేవరకు మెడికల్‌ షాపులలో శానిటైజర్లు అమ్మవద్దని సూచించారు. 

Updated Date - 2020-08-05T11:34:00+05:30 IST