పోలీస్‌ చౌరస్తా!

ABN , First Publish Date - 2021-01-21T07:01:22+05:30 IST

గొల్లపూడి వన్‌ సెంటర్‌, సమీపంలోని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాస ప్రాంతాలు బుధవారం కూడా పోలీసు వలయంలోనే ఉన్నాయి.

పోలీస్‌ చౌరస్తా!
పోలీసు వలయంలో గొల్లపూడి సెంటర్‌

భద్రతా వలయంలో గొల్లపూడి సెంటర్‌

అమరావతి దీక్షకు మద్దతుగా దేవినేని ఉమా దీక్ష 

సాయంత్రం వరకు ఇంట్లోనే దీక్ష చేసిన ఉమా 

పోలీసుల నిర్బంధంతో కర్ఫ్యూ వాతావరణం 

పలువురు నేతల సంఘీభావం 

నందిగామలో తంగిరాల సౌమ్య గృహ నిర్బంధం 

విజయవాడలో కేశినేని శ్వేతను అడ్డుకున్న పోలీసులు 


విజయవాడ, గొల్లపూడి, మైలవరం, జి.కొండూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : గొల్లపూడి వన్‌ సెంటర్‌, సమీపంలోని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాస ప్రాంతాలు బుధవారం కూడా పోలీసు వలయంలోనే ఉన్నాయి. మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన దీక్షకు ఉపక్రమించిన ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా బుధవారం నాటికి అమరావతి ఉద్యమం 400 రోజులకు చేరుకున్న సందర్భంగా ఆ ఉద్యమానికి సంఘీభావంగా దేవినేని ఉమా మళ్లీ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్షకు సిద్ధమయ్యారు. ఈ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఉమాను గృహ నిర్బంధంలోనే ఉంచారు. దీంతో ఉమా తన నివాసంలోనే దీక్షకు కూర్చున్నారు. ఽఉమాకు సంఘీభావం తెలిపేందుకు ఉదయమే ఆయన ఇంటికి వెళ్లిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రను కూడా పోలీసులు బయటకు రానీయకపోవడంతో ఆయన కూడా ఉమాతోపాటు అక్కడే దీక్షను కొనసాగించారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగించడంతో అటువైపు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.


దేవినేని ఇంటి వద్ద, ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నలువైపులా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో గొల్లపూడి వన్‌ సెంటర్‌లో కర్ఫ్యూ వాతావరణం చోటుచేసుకుంది. ఆ వీధుల్లో నివసించేవారిని కూడా వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మాజీమంత్రులు జవహర్‌, కొత్తపల్లి శ్యామ్యూల్‌ ఇతర టీడీపీ నాయకులు ఉమా ఇంటికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఉమా దీక్షకు సంఘీభావం తెలిపేందుకు బయల్దేరిన నందిగామ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. విజయవాడ నుంచి బయల్దేరిన ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) కుమార్తె శ్వేతను కేశినేని భవన్‌ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. 



Updated Date - 2021-01-21T07:01:22+05:30 IST