పాత బిహార్‌లా పోలీసుల తీరు

ABN , First Publish Date - 2021-03-06T06:51:39+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల్లో పోలీసుల తీరు గత బీహారులా తయారైనదని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆగ్రహం వ్య క్తం చేశారు.

పాత బిహార్‌లా పోలీసుల తీరు
పోలీసుల దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న 33వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి భర్త మురళి

టీడీపీ అభ్యర్థి భర్తపై పాత కేసు పేరుతో దాడి  

పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆగ్రహం

ాగులుప్పలపాడు (ఒంగోలు రూరల్‌) మార్చి 5: మునిసిపల్‌ ఎన్నికల్లో పోలీసుల తీరు గత బీహారులా తయారైనదని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆగ్రహం వ్య క్తం చేశారు. ఒంగోలు మున్సిపాలిటీలో 33వ డివిజన్‌కు కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జగన్నాథం శారద భర్త మురళిని బెదిరించడానికి పాత కేసు సాకుతో నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం పోలీసులు తీసుకెళ్లారు. దీంతో మురళిని విడుదల చేయాలంటూ జనార్దన్‌ ఎన్‌జీపాడు స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో అభ్యర్థి భర్తను ఎందుకు తీసుకొచ్చారంటూ పోలీసులను నిలదీశారు. దాడి చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు పక్షపాతంగా వ్యవహరించటం దారుణంగా ఉందన్నారు. అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి భయపెట్టడం ఎంతవరకు న్యాయమన్నారు. రెవెన్యూ, పోలీసులు చేసే అరాచకాలను తాము గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మంత్రి శ్రీను ఉన్నారు. 


రిమ్స్‌ ఎదుట టీడీపీ ఆందోళన

ఒంగోలు (కార్పొరేషన్‌): నగరంలోని 33వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి జగన్నాథం శారద భర్త మురళిని అక్రమంగా అరెస్టు చేసి, దాడిచేసిన ఎన్‌జీపాడు ఎస్సై శశి కుమార్‌ను సస్పెండ్‌ చేసి, కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. పోలీసుల దాడిలో గాయపడ్డ మురళి రిమ్స్‌లో చికిత్సపొందుతున్నారు. విషయం తెలిసి శుక్రవారం రాత్రి వైద్యశాలకు చేరుకున్న టీడీపీ శ్రేణులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019లోకేసు ఉన్నప్పటికీ పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకుని మురళి లోక్‌అదాలత్‌కు వెళ్లినట్లు తెలిపారు. అయినప్పటికీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో శారద గెలుస్తుందన్న భయంతో ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసి, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, నాయకులు గుర్రాల రాజ్‌విమల్‌, ఎద్దు శశికాంత్‌భూషణ్‌, నావూరికుమార్‌, పాతూరి పుల్లయ్య, ఆర్ల వెంకటరత్నం, ఎల్టీభవానీ, మేరీకుమారి తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2021-03-06T06:51:39+05:30 IST