జడ్చర్లలో అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్ల రవాణా..పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-05-10T16:18:32+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్లు పక్కదారిపట్టకుండా పకడ్బంది చర్యలు తీసుకున్నామని..

జడ్చర్లలో అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్ల రవాణా..పట్టుకున్న పోలీసులు

మహబూబ్‌నగర్ జిల్లా: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్లు పక్కదారిపట్టకుండా పకడ్బంది చర్యలు తీసుకున్నామని చెబుతున్నా.. అక్రమాలు ఆగడంలేదు. పరిశ్రమల పేరుతో దొడ్డిదారిన తరలిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ దందా జోరుగా సాగుతోంది. జడ్చర్లలోని పారిశ్రామికవాడలో గుట్టుచప్పుడు కాకుండా దొడ్డిదారిన ఆక్సిజన్ సిలిండర్లను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


రంగారెడ్డి జిల్లా, కొత్తూరు సీతారామ ఏజెన్సీకి చెందిన ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లను మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని హరిఓం గ్యాస్ అండ్ ఇండస్ట్రీ పరిశ్రమకు తమ ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తుండేవారు. అయితే గత ఏడాది నుంచి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత కారణంగా ప్రభుత్వం కేవలం ఆస్పత్రులకు మాత్రమే ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయాలని సూచించడంతో పరిశ్రమలకు సరఫరా నిలిచిపోయింది.


కొద్ది రోజులుగా బాలానగర్‌కు చెందిన హరిఓం గ్యాస్ అండ్ ఇండస్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు సిలిండర్లను తిరిగి అప్పజెప్పకుండా దొడ్డిదారిన సీతారామ ఏజెన్సీ కంపెనీ లేబుళ్లపై తెల్ల రంగు వేసి జడ్చర్లలోని పారిశ్రామిక వాడలో విజయలక్ష్మి ఏజెన్సీ నుంచి అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లను నింపుకుని బాలానగర్‌లోని తమ పరిశ్రమకు తరలిస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన సీతారామ ఏజెన్సీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సిలిండర్ల వాహనాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనంతోపాటు 40 సిలిండర్లను కంపెనీకి అప్పజెప్పారు.

Updated Date - 2021-05-10T16:18:32+05:30 IST