‘ఎర్ర’ దొంగల ఆటకట్టు!

ABN , First Publish Date - 2020-10-25T06:44:05+05:30 IST

ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చెక్‌పెట్టారు. ఐదుగురు నిందితులను పట్టుకుని, రూ.6.08 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

‘ఎర్ర’ దొంగల ఆటకట్టు!

ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు

మరో పది మంది కోసం ముమ్మర గాలింపు

106 ఎర్రచందనం దుంగల స్వాధీనం


నెల్లూరు(క్రైం), అక్టోబరు 24 : ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చెక్‌పెట్టారు. ఐదుగురు నిందితులను పట్టుకుని, రూ.6.08 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం నెల్లూరులోని ఉమే్‌షచంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ వెల్లడించారు. కలువాయి మండలం వెంకటరామరాజు పేటకు చెందిన వెరుమాళ్ల శ్రీనివాసులు, ఆత్మకూరుకు చెందిన సయ్యద్‌ ఆరీఫ్‌, చెన్నైకు చెందిన అతియామొన్‌, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన కాకులూరు ప్రశాంత్‌ కుమార్‌, పోలూరు మాలకొండరావు, మరో పది మంది కలిసి బృందంగా ఏర్పడ్డారు. కొన్ని నెలల క్రితం వీరంతా సోమశిల అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికి ఏ గ్రేడ్‌ రకానికి చెందిన దుంగలను భద్రపరిచారు. పెరుమాళ్ల శ్రీనివాసులు  సరఫరాదారుగా, సయ్యద్‌ ఆరీఫ్‌ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ దుంగలకు మంచి గిరాకీ రావడంతో శుక్రవారం వాటిని రెండు వాహనాల్లో తరలించారు. ఇదే సమయంలో నిఘా ఉంచిన గూడూరు గ్రామీణ పోలీసులు చిల్లకూరు మండలంలోని టీఎ్‌సఆర్‌ శీతల గోదాము వద్ద దాడులు నిర్వహించారు. 106 ఎర్రచందనం దుంగలు, ఒక లారీ, కారు, ఆరు సెల్‌ఫోన్లు, రూ.700 నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.6.08 లక్షలు ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.


ఈ దాడుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకోగా 10 మంది పరారయ్యారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు ఎస్పీ తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని, వారి ఆస్తులను సైతం జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, గూడూరు గ్రామీణ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు బ్రహ్మానాయుడు, పుల్లారావు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు.

Updated Date - 2020-10-25T06:44:05+05:30 IST