దొంగని పట్టి... ఫొటోషాప్ మాస్క్ పెట్టి... నవ్వులపాలైన పోలీసులు!

ABN , First Publish Date - 2021-01-12T17:56:10+05:30 IST

కరోనా ప్రోటోకాల్ పాటించడం లేదనే విమర్శల నుంచి తప్పించుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం...

దొంగని పట్టి... ఫొటోషాప్ మాస్క్ పెట్టి... నవ్వులపాలైన పోలీసులు!

లక్నో: కరోనా ప్రోటోకాల్ పాటించడం లేదనే విమర్శల నుంచి తప్పించుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పట్టుబడిన నిందితుడు, అతనిని పట్టుకున్న పోలీసు ఉన్నఫొటోకు ఫొటోషాప్ ద్వారా వారి ముఖాలకు మాస్క్ సృష్టించారు. దానిని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో పోలీసులు వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు. ఈ ఉదంతం యూపీలోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. జిల్లా పోలీసులు ముందుగా ఒక ఫొటోను ట్వట్టర్‌లో షేర్ చేశారు.


ఆ ఫొటోలో కానిస్టేబుల్ ఒక నిందితుడిని పట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. కరోనా ప్రోటోకాల్‌ను గుర్తించని పోలీసులు ఆ ఫోటోను వెంటనే షేర్ చేశారు. తరువాత నాలిక కరుచుకుని, దానిని డిలీట్ చేసి, ఆ ఫొటోలోని వారికి ఫొటోషాప్‌ సాయంతో మాస్క్ క్రియేట్ చేశారు. తిరిగి ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతకుముందు షేర్ చేసిన ఫొటోను, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు పోలీసులను ఒకటే ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనిని గమనించిన పోలీసులు ఆ ఫొటోను వెంటనే తొలగించారు. కాగా ఈ ఫొటోను చూసిన ఒక యూజర్... ఇది యూపీ పోలీసుల డిజిటల్ మాస్క్ అని రాయగా, మరొకరు దీనికి ఫొటోషాజ్ చేయాల్సిన అవసరం లేదు... ప్రభుత్వం మీదే కనుక మిమ్మల్ని ఎవరేం చేయగలరు? అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-01-12T17:56:10+05:30 IST