ఈ విషయంలో పోలీసులకు సెల్యూట్‌ చేయాల్సిందే..!

ABN , First Publish Date - 2021-05-14T04:25:53+05:30 IST

ఉన్నతాధికారి నుంచి..

ఈ విషయంలో పోలీసులకు సెల్యూట్‌ చేయాల్సిందే..!

కరోనా వేళ ఇంటిముఖం చూడని పోలీసులు

ఒంటరిగా లాడ్జీలు, గదుల్లో నివాసం

తమ ద్వారా కుటుంబానికి వైరస్‌ వ్యాపిస్తుందేమోనన్న భయం


పోలీస్‌ కమిషనరేట్‌లో ఆయన ఒక ఇన్‌స్పెక్టర్‌. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఆయన బలం. ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాల విధులు. ఒకపూట మాస్కుల ఎన్‌ఫోర్స్‌మెంట్‌, మరోపూట కర్ఫ్యూ విధులు. ఎక్కడ, ఎప్పుడు కరోనా బారిన పడతారో తెలియని పరిస్థితి. ఒకసారి వైరస్‌ వస్తే ఆయన ఒక్కడితోనే పోదు. ఈ పరిస్థితుల్లో ఇంటికి వెళ్లటం కంటే కుటుంబానికి దూరంగా ఉండటమే మంచిదనుకున్నారు. బయట ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచే  విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్‌ మాట్లాడుతూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.


తూర్పు మండలంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రాజు కొద్దిరోజుల క్రితం కొంతమంది సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశాడు. ఆ బృందంలో మరో కానిస్టేబుల్‌ కరోనా బారిన పడ్డాడు. దీంతో రాజు కూడా తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలనుకున్నాడు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇంటిని అద్దెకు తీసుకుని తలదాచుకున్నాడు. కరోనా తగ్గే వరకూ ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. 


కరోనా.. మానవ సంబంధాలనే కాదు.. బంధాలు, బంధుత్వాల మధ్య దూరాన్ని కూడా పెంచేస్తోంది. ఇందుకు పోలీసులేమీ మినహాయింపు కాదు. ఒక కుటుంబంలో ఒకరికి కరోనా సోకిందంటే, మరో ఇద్దరు, ముగ్గురు మహమ్మారి బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విధి నిర్వహణతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోవడానికి ఒంటరిగా జీవిస్తున్నారు. నిత్యం బిక్కుబిక్కుమంటూ ఉద్యోగాలు చేస్తున్న రక్షకభటులు కుటుంబ సభ్యుల రక్షణ కోసం అజ్ఞాతవాసం చేస్తున్నారు.


ఆంధ్రజ్యోతి, విజయవాడ: విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో దాదాపు 3వేలకు పైగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఉన్నతాధికారి నుంచి హోంగార్డు వరకు ప్రస్తుతం అందరి విధి కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేయడమే. ఉదయం నుంచి రాత్రి వరకు రహదారులపైనే తిరుగుతున్నారు. ఒకపక్క వాహనాల తనిఖీలు, మరోపక్క మాస్కులు లేని వారిపై కేసులు, ఇంకోపక్క శాంతిభద్రతల కోసం గస్తీల్లో పెట్రోలింగ్‌.. ఇలా మొత్తంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎటు నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో తెలియదు. కమిషనరేట్‌లో మొత్తం ఇప్పటివరకు 770 మంది కరోనా బారిన పడ్డారు. మొదటి దశలో 400 మందికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో ఇద్దరు చనిపోయారు. రెండో దశలో ఇప్పటివరకు 370 మందికి కరోనా సోకింది. వారిలో ఆరుగురు చనిపోయారు. స్టేషన్‌ మెట్లెక్కినా, వాట్సాప్‌ గ్రూపు చూసినా, విధినిర్వహణలో ఉన్నా ఏ విషాదకర సమాచారమో వినాల్సి వస్తోంది. 


ముందుచూపే మేలు

కమిషనరేట్‌లో పనిచేస్తున్న పోలీసుల్లో కొంతమంది అపార్ట్‌మెంటుల్లో ఉంటుండగా, మరికొంతమంది సొంతిళ్లలో, అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఇంకొంతమంది క్వార్టర్స్‌లో ఉంటున్నారు. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. లాడ్జీల్లోనూ, లేకపోతే స్టేషన్‌ పరిధిలో ఇళ్లు అద్దెకు తీసుకునో ఒంటరిగా జీవిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు, పైగా వారికుండే చిన్నచిన్న అనారోగ్య సమస్యలు.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇళ్లకు వెళ్లకపోవటమే మంచిది అనుకుంటున్నారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఈ దూరావాసం తప్పదనుకున్నారు. ఇంటిముఖం చూడలేమని కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తున్నారు. కుటుంబ అవసరాలను స్నేహితులు, సహాయకుల ద్వారా చేయించుకుంటున్నారు. వీడియో కాల్స్‌లోనే కుటుంబ సభ్యులను చూసుకుంటున్నారు. నిర్ణయం కఠినమైనదే అయినా కుటుంబ సభ్యులు, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటు న్నామని కొందరు పోలీసులు చెబుతున్నారు. కరోనా తమను తాకకపోతే మంచిదని, తాకినా తమతోనే పోతుందంటున్న పోలీసులకు సెల్యూట్‌ చేయాల్సిందే.




ముందస్తు జాగ్రత్తగా..

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలాగోలా వైరస్‌ సోకుతుంది. రెండు దశల్లో కమిషనరేట్‌లో మొత్తం 770 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 95శాతం రికవరీ అయ్యారు. చాలామంది కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా కొంతమంది బయట వేర్వేరు చోట్ల ఉంటున్నారు.

- బత్తిన శ్రీనివాసులు, పోలీస్‌ కమిషనర్‌



Updated Date - 2021-05-14T04:25:53+05:30 IST