జోహార్‌.. పోలీస్‌!

ABN , First Publish Date - 2021-10-21T04:13:27+05:30 IST

భారత్‌-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్‌చిన్‌ ప్రాంతంలో 16వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్య ఉన్న వేడినీటిబుగ్గ (హాట్‌ స్ర్పింగ్‌) అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా నిలిచింది.

జోహార్‌.. పోలీస్‌!
ఈ ఏడాది మృతి చెందిన పోలీసు అమరవీరులు

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

కొవిడ్‌లో ఖాకీల సేవలు మరువలేనివి

ఈ ఏడాది 12 మంది మృతి

నేడు అమరవీరుల సంస్మరణ దినం


నెల్లూరు (క్రైం) అక్టోబరు 20 : 

ఎర్రటి ఎండలోనూ... జోరున కురిసే వానలోనూ... వణికించే చలిలోనూ... పగలూ రాత్రి అన్న తేడా లేకుండా 24గంటలు ప్రజల కోసం బతికేవారే పోలీసులు. విధి నిర్వహణలో కుటుంబాలకు దూరంగా ఉంటున్నా, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ప్రజల సంరక్షణ, రక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించే వారు రక్షక భటులు. కరోన కష్టకాలంలో వారి సేవల భేష్‌. మహమ్మారి వైరస్‌ తమకు సోకుతుందని తెలిసినా ఆదర్శనీయమైన సేవలు అందించారు. ఈ సంవత్సరం 12 మంది పోలీసులు విధులు నిర్వహిస్తూ ప్రాణాలు విడిచారు. గురువారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం....


భారత్‌-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్‌చిన్‌ ప్రాంతంలో 16వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్య ఉన్న వేడినీటిబుగ్గ (హాట్‌ స్ర్పింగ్‌) అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా నిలిచింది. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దు ల్లోని భారత భూభాగాలైన లడక్‌, సియాచిన్‌ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీసు వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బృహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వ్‌ పోలీసు ఫోర్సు(సీఆర్‌పీఎఫ్‌) నిర్వహించేది. 1959 అక్టోబరు 21వతేదీన డీఎస్పీ కరమ్‌సింగ్‌ నేతృత్వంలో 21మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్‌ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్‌పీఎఫ్‌ దళం హాట్‌స్ర్పింగ్‌ ప్రాంతంలో ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసువీరుల రక్తంతో తడిసిన హాట్‌స్ర్పింగ్‌ నెత్తుటిబుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. నాటి నుంచి ప్రతి ఏడాది అన్ని రాష్ర్టాల పోలీసులతో కూడిన బృందం ఆ పవిత్ర స్థలాన్ని సందర్శించి అమరులకు నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది.


జిల్లాలో అమరవీరులు...


జిల్లాలో విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులెందరో ఉన్నారు. గత  ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో విధుల్లో ఉన్న 12 మంది పోలీసులు మృతి చెందారు. కరోనా బారిన పడి హెడ్‌కానిస్టేబుళ్లు పీవీ రమణయ్య, ఎం రవి, ఆర్‌ సత్యనారాయణ బాబు, షేక్‌ మజ్బూర్‌ రహ్మాన, ఎస్‌ కోటయ్య, కానిస్టేబుల్‌ ఎన రామబ్రహ్మం మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ డీ సద్గురుబాబు మృత్యువాత పడ్డారు. ఆరోగ్యకారణాల వల్ల హెడ్‌కానిస్టేబుళ్లు ఎస్‌డీ జమీర్‌ అహ్మద్‌, ఎస్‌ వేణుగోపాల్‌రెడ్డి, సీహెచ వెంకయ్య, ఏఆర్‌ ఎస్‌ఐ పీ శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ పీ శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ సుబ్రహ్యణ్యం  మృతి చెందారు. జాతీయ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం అమరవీరులకు గురువారం పోలీసు కవాతు మైదానంలో ఘనంగా నివాళులర్పించనుంది. 


పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం


విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటాం. మృతి చెందిన పోలీసు కుటుంబాలు ఎటువంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకు వస్తే పరిష్కారానికి కృషి చేస్తాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని ప్రయోజనాలను త్వరగతిన అందేలా చూస్తున్నాము. అర్హత కలిగిన వారికి కారుణ్య నియామకాల ద్వారా పోస్టింగ్‌ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము.

- సీహెచ విజయరావు, ఎస్పీ


Updated Date - 2021-10-21T04:13:27+05:30 IST