చట్టం.. వారి చుట్టంలా!

ABN , First Publish Date - 2021-10-24T04:27:59+05:30 IST

బ్రిటీష్‌ పాలన పోయి ఏడున్నర దశాబ్దాలు దాటుతోంది.

చట్టం.. వారి చుట్టంలా!

అధికార పార్టీ నేతల మాటలే వేదం

ఇష్టానుసారం కేసుల నమోదు

స్టేషన బెయిల్‌ కేసులూ కోర్టుకు..

పోలీసులపై న్యాయమూర్తుల అక్షింతలు

 

గిరీషం : ఏమోయ్‌. టైలరు... మనకు స్వాతంత్య్రం వచ్చేస్తోందోయ్‌...!

టైలర్‌ : అయితే మన ఊరి హెడ్డు కానిస్టేబుల్‌ మారిపోతాడా...!?

కన్యాశుల్కం నాటకంలో బ్రిటిష్‌ పాలనలో పోలీసుల  దాష్టీకం ఎలా ఉండేదో ఈ ఒక్క గీతతో చెప్పారు రచయిత వీరేశలింగం పంతులు. 

పోలీసు చెర వీడితే చాలు దానిని మించిన స్వాతంత్య్రం మరొకటి లేదని ప్రజలు భావించిన రోజులవి. 

బ్రిటీష్‌ పాలన పోయి ఏడున్నర దశాబ్దాలు దాటుతోంది. కానీ ఇంకా అక్కడక్కడ బ్రిటీష్‌ కాలం నాటి పోలీసు వ్యవస్థే కనిపిస్తోంది. స్వాతంత్య్ర భారతంలో పోలీసు వ్యవస్థ ప్రజలకు ఎంతో దగ్గరైనా ఇటీవల కాలంలో కొంతమంది పోలీసు అధికారుల తీరు ఆక్షేపణీయంగా తయారయ్యింది. అధికారంలో ఉన్న వారి మెప్పు కోసం సామాన్యులను హింసించే స్థాయికి దిగజారందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోలీసు అధికారి ఎప్పుడు బదిలీ అయి వెళ్లిపోతాడా అని ప్రజలు ఎదురుచూసే పరిస్థితి ఇప్పుడు పలు చోట్ల కనిపిస్తోంది. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొంతమంది పోలీసు అధికారుల వ్యవహారశైలి మారిపోయింది. అధికార పార్టీ నాయకుల ఆదేశాలే చట్టాలుగా చెలామణి చేస్తున్న పోలీసు స్టేషన్లు జిల్లాలో పెద్ద సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. 

టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఆ పార్టీ చేపట్టిన బంద్‌ కార్యక్రమంలో నెల్లూరు సిటీ, జలదంకి, చిట్టమూరు పరిధిలో ముగ్గురిపై కేసులు నమోదు చేసి మెజిసే్ట్రట్‌ ముందు హాజరుపరిచారు. అయితే వీరిపై నమోదైన అభియోగాలను పరిశీలించిన న్యాయమూర్తులు స్టేషన బెయిల్‌ ఇచ్చే కేసులను కోర్టు ముందుకు ఎలా తీసుకొస్తారని పోలీసులపై అక్షింతలు వేసి పంపారు. ఈ కేసులను కోర్టు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదనే విషయం తెలియక అలా చేశారని అనుకోలేము. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం నిందితులను కోర్టు మెట్లు ఎక్కించారని ప్రజలు భావిస్తున్నారు.  

అఽధికార పార్టీ నాయకుల మెప్పు కోసం కోర్టుకు తీసుకెళ్లడమే కాదు, స్టేషన్లలోనే చుక్కలు చూపించిన సంఘటనలు ఇటీవల కాలంలో చాలానే జరిగాయి. 


వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఒక నాయకుడు కరోనా సందర్భంగా ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ఆరంభించారు. ఇది ఆ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడికి ఇష్టం లేదు. ఇంకేముంది ప్రజలకు సాయపడిన నేరానికి ఆ నాయకుడిపై కేసు నమోదయ్యింది. ఈ విషయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

ఏడు నెలల క్రితం సూళ్లూరుపేటలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్త దాడి చేశాడు. తనకు న్యాయం చేయమని బాదితుడు పోలీసుస్టేషనకు వెళితే అప్పుడు అక్కడ పనిచేసిన ఓ పోలీసు అధికారి బాధితుడిపైనే కేసు నమోదు చేశాడు. అంతేకాదు రౌడీషీట్‌ ఓపెన చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ బాధితుడిపై అప్పటి వరకు ఎలాంటి కేసులు లేకపోవడంతో ఓపెన చేయలేకపోయాడు. 

విడవలూరులో భార్యాభర్తల కేసులో ఉద్దేశపూర్వకంగా టీడీపీ నాయకుడ్ని ఇరికించి కేసు నమోదు చేశారు. దీంతో అతను హైకోర్టుకు వెళ్లి యాన్టీస్పెక్టరీ బెయిల్‌ తెచ్చుకోవడంతో అరెస్టు చేయలేకపోయారనే ప్రచారం. 

మర్రిపాడు మండలంలోని ఒక గ్రామంలో విద్యాకమిటీ చైర్మన ఎన్నిక కోసం ఇద్దరు పోటీ పడ్డారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపు కోసం ప్రత్యర్థిని, అతనికి మద్దతుగా ఉన్న ఐదుగురిని పోలీసు స్టేషనకు పిలిపించి వారి స్టైల్‌లో హెచ్చరించారు. మరోసారి పోటీ, గీటీ అంటే... అని బెదిరించారు. దీంతో ఈ పాఠశాల విద్యాకమిటీ ఎన్నికే ఆగిపోయింది. మండలంలో అన్ని పాఠశాలలకు ఎన్నికలు పూర్తి అయినా ఈ పాఠశాలకు మాత్రం ఇంకా ఎన్నికలు జరగకపోవడమే నిదర్శనం. 

ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. గడచిన రెండేళ్ల కాలంలో ఇలాంటి ఘటనలు లెక్కకు మించి జరిగాయి. జరుగుతున్నాయి. జిల్లా మొత్తంపై ఈ పరిస్థితి ఉందని చెప్పలేము కానీ ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాల పరిధిలోని పోలీసు స్టేషన్లు మాత్రం అధికార పార్టీ నాయకులు చెప్పిందే చట్టంగా కేసులు కడుతున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా లాఠీలకు పని చెబుతున్నాయి. జిల్లా పరిధిలోని కొంతమంది పోలీసు అధికారుల వ్యవహార శైలి కారణంగా పోలీసు యంత్రాంగం పట్ల ప్రజల్లో నమ్మకం సడలుతోంది. పోలీసు ఉన్నతాధికారులు చొరవతీసుకొని పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. 

- నెల్లూరు (ఆంధ్రజ్యోతి)


Updated Date - 2021-10-24T04:27:59+05:30 IST