ఏటిఎం దొంగతనాలుచేసి కోట్లు కొల్లగొట్టాడు.. పోలీసులకి చుక్కలు చూపించాడు.. చివరికి ఒక గ్యాస్ బిల్లుతో అతని ఆటకట్టు.. అదెలాగంటే..

ABN , First Publish Date - 2021-12-06T07:10:37+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులకు గత కొన్ని నెలలుగా వివిధ బ్యాంకుల ఏటిఎంల నుంచి నగదు దొంగతనం జరిగినట్లు ఫిర్యాదులందుతున్నాయి. ఆ దొంగతనాలలో దుండగులు ఏటిఎం మెషీన్‌ని హ్యాక్ చేసి భారీ మొత్తంలో సొమ్ముని కాజేశారు. ఈ ఏటీఎం హ్యాకింగ్ హైటెక్ దొంగ పోలీసులని ముప్పుతిప్పలు పెట్టాడు. కానీ చివరికి ఒక సాధారణ వంట గ్యాస్ బిల్లు...

ఏటిఎం దొంగతనాలుచేసి కోట్లు కొల్లగొట్టాడు.. పోలీసులకి చుక్కలు చూపించాడు.. చివరికి ఒక గ్యాస్ బిల్లుతో అతని ఆటకట్టు.. అదెలాగంటే..

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులకు గత కొన్ని నెలలుగా వివిధ బ్యాంకుల ఏటిఎంల నుంచి నగదు దొంగతనం జరిగినట్లు ఫిర్యాదులందుతున్నాయి. ఆ దొంగతనాలలో దుండగులు ఏటిఎం మెషీన్‌ని హ్యాక్ చేసి భారీ మొత్తంలో సొమ్ముని కాజేశారు. ఈ ఏటీఎం హ్యాకింగ్ హైటెక్ దొంగ పోలీసులని ముప్పుతిప్పలు పెట్టాడు. కానీ చివరికి ఒక సాధారణ వంట గ్యాస్ బిల్లు కారణంగా పట్టుబడ్డాడు. వివరాలలోకి వెళితే..


ఢిల్లీ పోలీసులు ఒక ఏటిఎం హ్యాకింగ్ చేసే దొంగ కేసు విచారణ చేస్తుండగా.. నవంబర్ 12న ఒక బ్యాంక్‌కు చెందిన మూడు వేర్వేరు ఏటిఎంల నుంచి భారీ మొత్తంలో డబ్బు దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందింది. మూడు ఏటిఎంల నుంచి రూ.18,40,000, రూ.6,40,000 , రూ.4,80,000 దొంగలించబడ్డాయి. పోలీసులు ఆయా ఏటిఎంల సీసీటీవి వీడియోలను పరిశీలించగా.. ఇద్దరు దుండగులు ఏటీఎం నుంచి డబ్బులు తీసి బ్యాగులో పెట్టికున్నట్లు కనిపించింది. దీంతో ఆ ఇద్దరు చేసిన ట్రాన్స్‌యాక్షన్‌ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పుడు అక్కడ జరిగినది తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. 


ఆ ఇద్దరు దొంగలు ముందుగా.. ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ పరికరం సహాయంతో ఏటిఎంని హ్యాక్ చేశారు. ఆ తరువాత ఒక ఎక్స్‌పైర్ అయిన ఎటిఎం కార్డుతో రూ.20 వేలు చొప్పున చాలా సార్లు డబ్బులు తీశారు. దొంగతనం జరిగాక ఆ ఇద్దరు వేర్వేరు బైక్‌లపై వెళ్లిపోయారు. అందులో ఒక బైక్ నెంబర్ మాత్రమే పోలీసులకు కనిపించింది. దీంతో ఆ బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు ఇంటి అడ్రస్‌కు వెళ్లారు. కానీ అక్కడ ఎవరూ నివసించడం లేదని తెలిసింది. ఆ బైక్ కృష్ణ గోపాల్ అనే వ్యక్తి పేరుమీద ఉంది. పోలీసులు ఈ కేసుని లోతుగా విచారణ చేయగా.. ఆ బైక్ రిజిస్ట్రేషన్ దస్తావేజులలో ఒక ఫోన్ నెంబర్ దొరికింది. కానీ ఫోన్ నెంబర్ అప్పుడప్పుడు మాత్రమే వాడుకలోకి ఉన్నట్లు పోలీసులు గమనించారు. ఆ ఫోన్ నెంబర్‌తో వంట గ్యాస్ కనెక్షన్ ఉందిన పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసుల ఆ గ్యాస్ ఏజెన్సీ బిల్లు ఆధారంగా కృష్ణ గోపాల్ ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కనుగొన్నారు. ఒక్కసారిగా ఆ అడ్రస్‌కు వెళ్లి అతడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఏటిఎం హ్యాకింగ్ పరికరాలను, 8 లక్షల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణ గోపాల్‌తోపాటు దొంగతనాలు చేసే మరో దొంగ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Updated Date - 2021-12-06T07:10:37+05:30 IST