Abn logo
Sep 19 2021 @ 01:04AM

పోలీసులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి

ఎమ్మెల్యే గోరంట్ల
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 18: పోలీస్‌ వ్యవస్థ పనితీరుపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్యరస్తోగికి శనివారం లేఖ పంపారు. ప్రజలను, ప్రజా హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీస్‌ వ్యవస్థదేనని, రాగద్వేషాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా విధి నిర్వహణ  చేయాల్సిన పోలీస్‌ వ్యవస్థ అధికార పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై విచక్షణ రహితంగా కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని గోరంట్ల లేఖలో పేర్కొన్నారు. ఈనెల 16న రైతు బిడ్డగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న తనను పోలీసు అధికారులు అడ్డుకోవడంలో విజ్ఞత ఏమిటిని ప్రశ్నించారు. బారికేడ్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ట్రాఫిక్‌ను జామ్‌ చేయడం సమర్థనీయమా అని ప్రశ్నించారు.  తమపై కేసులు పెట్టడం, రైతులను అరెస్టు చేసి ట్రాక్టర్లను సీజ్‌ చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. ఈ మధ్య అధికార పార్టీ నిర్వహించిన పలు ర్యాలీలు భారీగా జరిగితే వాటికి మద్దతు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గుడా చైర్మన్‌ ప్రమాణ స్వీకారం, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి, టీటీడీ చైర్మన్‌ రాజ మహేంద్రవరం పర్యటనల సమయంలో అధికారులు దగ్గరుండి ర్యాలీలు నిర్వ హించడం, కాన్వాయ్‌లతో ట్రాఫిక్‌ను జామ్‌ చేయడం ఏమిటని, వారి పై కేసులు ఎందుకు పెట్టలేదని లేఖలో పేర్కొన్నారు.  ఎప్పుడైతే పోలీసులు అవినీతి రహితంగా, నిర్భీతితో నిక్కచ్చిగా పనిచేస్తారో ఆనాడే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుపడతాయని లేఖ ద్వారా  ఎస్పీకి విజ్ఞప్తి చేశారు