Online Gaming: కొత్త చట్టాన్ని పట్టించుకోని బెంగళూరు కంపెనీపై కేసు

ABN , First Publish Date - 2021-10-09T20:41:04+05:30 IST

ఆన్‌లైన్ గాంబ్లింగ్, గేమింగ్‌లను నిషేధిస్తూ సవరించిన చట్టం

Online Gaming: కొత్త చట్టాన్ని పట్టించుకోని బెంగళూరు కంపెనీపై కేసు

బెంగళూరు : ఆన్‌లైన్ గాంబ్లింగ్, గేమింగ్‌లను నిషేధిస్తూ సవరించిన చట్టం అమల్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే డ్రీమ్ 11 వెబ్‌సైట్‌పై పోలీసు కేసు నమోదైంది. ఈ వెబ్‌సైట్ నిర్వహిస్తున్న గేమ్‌ ఆడటానికి నైపుణ్యంతో సంబంధం లేదని, అదృష్టం మాత్రమే అవసరమని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ ఈ వెబ్‌సైట్ పని చేస్తోందని తెలిపారు. కర్ణాటక పోలీస్ చట్టంలోని సెక్షన్లు 79, 80 ప్రకారం ఈ కేసును గురువారం నమోదు చేసినట్లు అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ఫిర్యాదుపై డ్రీమ్ 11 స్పందించలేదు.


సెప్టెంబరు 13 నుంచి 24 వరకు జరిగిన కర్ణాటక శాసన సభ, విధాన మండలి వర్షాకాల సమావేశాల్లో కర్ణాటక పోలీస్ సవరణ బిల్లు, 2021కు ఆమోదం లభించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ, యాప్‌లపై గ్యాంబ్లింగ్‌ను స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లు వంటి టెక్నాలజీలు పెంచినట్లు తెలిపారు. సైబర్ స్పేస్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి పదాలను ఈ చట్టంలో చేర్చినట్లు తెలిపారు. 


ఇండియన్ ప్రీమియర్ లీగ్, దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ఆశించాయి. కానీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చట్టాన్ని త్వరగా అమల్లోకి తీసుకురావడంతో ఈ కంపెనీలు కంగుతిన్నాయి. తమ గేమింగ్ యాప్‌లను కర్ణాటకలోని యూజర్లు యాక్సెస్ చేయకుండా నిషేధించామని చెప్పాయి. తాము ఈ చట్టంపై కోర్టును ఆశ్రయిస్తామని ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్ ప్రతినిధి ఒకరు బుధవారం మీడియాకు చెప్పారు. 


Updated Date - 2021-10-09T20:41:04+05:30 IST