మళ్లీ ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-04-11T05:43:27+05:30 IST

శ్రీకాకుళం నగరం శాంతినగర్‌ కాలనీలో శనివారం సాయంత్రం అలజడి రేగింది. ప్రత్యేక వాహనాల నుంచి భారీ సంఖ్యలో పోలీసులు దిగి కాలనీలోని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

మళ్లీ ఉద్రిక్తత
రవికుమార్‌ ఇంటివద్ద మోహరించిన పోలీసు బలగాలు

 టీడీపీ నేత రవికుమార్‌ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

 లోపలకు వెళ్లి గాలింపు

 ఆయన లేకపోవడంతో వెనుదిరిగిన వైనం

 ఇదేమి తీరు అని కూన ప్రమీల ఆవేదన

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 10: శ్రీకాకుళం నగరం శాంతినగర్‌ కాలనీలో శనివారం సాయంత్రం అలజడి రేగింది. ప్రత్యేక వాహనాల నుంచి భారీ సంఖ్యలో పోలీసులు దిగి కాలనీలోని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. పొందూరు మండలం పెనుబర్తి గ్రామంలో ఈ నెల 8న (గురువారం రాత్రి) టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య కొట్లాట జరిగింది. అక్కడే ఉన్న డీఎస్పీ, పోలీసులను కూన రవికుమార్‌ దూషించినట్లు ఆయనపై అభియోగం. దీంతో పాటు మరో రెండు కేసులు కూడా రవికుమార్‌పై నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం ఒకటో పట్టణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అంబేద్కర్‌, ఎస్‌ఐల బృందం, సివిల్‌, మహిళా పోలీసులు, మహిళా హోంగార్డులు.. ప్రత్యేక వాహనాల్లో శాంతినగర్‌ కాలనీలోని రవికుమార్‌ ఇంటికి చేరుకున్నారు. ఇంటి లోపలకు వెళ్లి ఆయన కోసం గాలించారు. ఆచూకీ లేకపోవడంతో కొన్ని గంటలపాటు అక్కడే పోలీసు బలగాలు మోహరించాయి. ఆ తర్వాత మరోమారు మహిళా పోలీసులు ఇంటిలోకి వెళ్లి అంతా తనిఖీలు చేశారు. ఆయన  జాడ లేకపోవడంతో కాలనీ నుంచి వెనుదిరిగారు. రవికుమార్‌పై ఏయే కేసులు నమోదు చేశారు, ఇతరత్రా వివరాలు పోలీసులు వెల్లడించలేదు. 


ఎవరిది బాధ్యత? 

‘ఇంటిలో నేను, నా కుమార్తె మాత్రమే ఉన్నాం. సాయంత్రం ఒక్కసారిగా 80 మంది పోలీసులు వచ్చారు. ఇంటిముందున్న మా పనిమనిషిని పక్కకు నెట్టేసి లోపలకు వచ్చేశారు. చెప్పులు, బూట్లు తొలగించకుండానే ఇల్లంతా తిరిగేశారు. కనీసం కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. మాకేమైనా అయితే ఎవరిది బాధ్యత?. పెనుబర్తి ఎంపీటీసీ అభ్యర్థిగా నేను పోటీ చేశాను. పోలింగ్‌ అనంతరం అలమాజీపేట నుంచి పొన్నాడ కృష్ణ, ఆయన కుమారుడు వారి గ్రామానికి వెళ్లిపోతున్నారు. అదే సమయంలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి, పెనుబర్తి సర్పంచ్‌ భర్త రౌడీ మాదిరిగా ప్రవర్తించాడు. సైకిల్‌ చైన్‌తో కృష్ణను, అతని కుమారుడిని కొట్టాడు. ఈ విషయాన్ని వారు కూన రవికుమార్‌కు తెలియజేశారు. వెంటనే రవికుమార్‌, అతని సోదరుడితోపాటు, మరికొంతమంది పెనుబర్తి సర్పంచ్‌ భర్తను ప్రశ్నించేందుకు వెళ్లారు. ఆయన అక్కడ లేరు. పోలీసు బలగాలే ఉన్నాయి. ఇంతమంది పోలీసులున్నా దాడిని ఎందుకు అడ్డుకోలేదని, ఇదెంతవరకు న్యాయమని రవికుమార్‌ పోలీసులను ప్రశ్నించారు. మా బావ సత్యారావుతో పాటు మరో 60 మందిపై పోలీసులు కేసులు పెట్టి వారిని అరెస్టు చేశారు.  పొందూరు, రాజాం,  పాలకొండ స్టేషన్లకు తరలించారు. బెయిల్‌ లభించడంతో వారంతా ఇంటికి వచ్చారు. రవికుమార్‌ ఇంతవరకు ఇంటికి రాలేదు. ఆయనపైనా పోలీసులు కేసు నమోదు చేశారంట. ఏం తప్పు చేశామని  80 మంది పోలీసులు మా ఇంటిలోకి ప్రవేశిస్తారు?. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏది చెబితే పోలీసులు అదే చేస్తారా?. పెనుబర్తి సర్పంచ్‌కు, మాకూ జరిగిన గొడవ ఇది. 

- కూన ప్రమీల, రవికుమార్‌ భార్య

Updated Date - 2021-04-11T05:43:27+05:30 IST