అక్రమదందాలపై పోలీసుల నిఘా

ABN , First Publish Date - 2021-10-26T03:35:03+05:30 IST

మత్తు పదార్ధాల వినియోగం రోజురోజుకు పెరిగి పోతుండటంతో అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి దాడులు చేపడుతున్నారు. ప్రధానంగా నిషేధిత గుట్కా, గంజాయి, గుడుంబాపై దృష్టి కేంద్రీకరించారు. ఎవరు రవాణా చేస్తున్నారు..? ఎక్కడి నుంచి డంప్‌ చేస్తున్నారు అనే కోణంలో క్షేత్ర స్థాయిలో పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

అక్రమదందాలపై పోలీసుల నిఘా

-గంజాయి, గుట్కా, గుడుంబాపై క్షేత్ర స్థాయిలో ఆరా 

-మహారాష్ట్ర నుంచి డంపింగ్‌

-గుట్కా దందాపై స్పెషల్‌ టీం

-గంజాయి విషయంలోనూ ఫోకస్‌

-జిల్లా స్థాయిలో వాకబు చేస్తున్న అధికారులు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 25: మత్తు పదార్ధాల వినియోగం రోజురోజుకు పెరిగి పోతుండటంతో అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి దాడులు చేపడుతున్నారు. ప్రధానంగా నిషేధిత గుట్కా, గంజాయి, గుడుంబాపై దృష్టి కేంద్రీకరించారు. ఎవరు రవాణా చేస్తున్నారు..? ఎక్కడి నుంచి డంప్‌ చేస్తున్నారు అనే కోణంలో క్షేత్ర స్థాయిలో పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. గుట్కాను యఽథేచ్ఛగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీస్థాయిలో తీసుకొచ్చి ప్రాణహిత నది సమీపంలో చిన్నపాటి డంప్‌లు ఏర్పాటు చేసి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మరి కొంతమంది నేరుగా రైలు ద్వారా మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది నిత్యకృత్యమైంది. ఈ దందా ఎంచుకున్న వారు తక్కువ కాలంలోనే భారీగా డబ్బులు వెనుకేసుకున్నట్టు సమాచారం. కింది స్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల వరకు మాముళ్లు ముట్టుజెప్పుతున్నట్టు ఆరోపణలున్నాయి. అధికారులు దాడులు చేసినప్పుడుల్లా గుట్కాపై  నిఘా పెరిగిందని చెప్పి మరీ అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. గుట్కా ప్యాకెట్‌ రూ.10వరకు మార్కెట్‌లో దొరికితే బ్లాక్‌లో రూ.30 అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు అడపాదడపా దాడులు నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయిలో అరికట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇక గంజాయి విషయంలో కూడా ఇదే తంతు సాగుతోందన్న ఆరోపణలున్నాయి. కాగజ్‌నగర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో గంజాయి చెట్లు పెంచుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్సు సిబ్బంది, పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. 

రైళ్లలో రవాణా..

మహారాష్ట్ర కేంద్రంగా గంజాయి రవాణా సాగుతున్నట్టు సమాచారం. రైళ్ల ద్వారా, రోడ్డు మార్గం గుండా ఈ దందాను కొనసాగిస్తున్నట్టు తెలిసింది. గంజాయి తాగి కొంతమంది చెడిపోతున్నారు. వీరి విషయంలో కూడా ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో వాకాబు చేస్తున్నారు. అలాగే కాగజ్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో గుడుంబా అధికంగా తయారవుతోంది. గుడుంబా తయారీకి ఉపయోపడే స్పటిక, నల్లబెల్లం నేరుగా మహారాష్ట్ర నుంచి డంప్‌ చేస్తున్నారు. వారం రోజల క్రితం సిర్పూరు(టి) పోలీసులకు అధిక మొత్తంలో స్పటిక మహారాష్ట్ర నుంచి కాగజ్‌నగర్‌కు డంప్‌ చేస్తుండగా పట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి గత వారం రోజుల క్రితం గంజాయితో పాటు ఇతర వాటిపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల క్రితం కూడా కాగజ్‌నగర్‌లోని అన్ని పాన్‌షాపుల్లో ఎస్పీ వైవీఎస్‌ సుఽధీంద్రతో పాటు డీఎస్పీ కరుణాకర్‌, సీఐ రాజేంద్రప్రసాద్‌ తనిఖీ చేశారు. మత్తు పదార్ధాల రవాణా విషయంలో వివరాలు సేకరించారు. అయితే మహారాష్ట్ర నుంచి జిల్లాకు ఎలా అక్రమ రవాణా జరుగుతుందనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. కాగజ్‌నగర్‌ మీదుగా నేరుగా మహారాష్ట్రలోని బల్లార్షాకు వెళ్లేందుకు పలు రైళ్లు ఉండడంతో ఈ మార్గంలో గుట్కాను యథేచ్ఛగా తీసుకొస్తున్నారు. ప్రత్యేక టీంలతో పోలీసులు నిఘా పెడుతుండడంతో అక్రమ దందాల నివారణ జరిగే అవకాశాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

గట్టి నిఘా పెట్టాం..

-కరుణాకర్‌, డీఎస్పీ, కాగజ్‌నగర్‌

అక్రమ దందాలపై గట్టి నిఘా పెట్టాం. ప్రధానంగా గంజాయి సాగు, గుట్కా, గుడుంబా తయారీ అంశాలపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. ప్రభుత్వం మత్తుపదార్థాలపై సీరియస్‌గా ఉంది. మహారాష్ట్ర సరిహద్దు నుంచి కాగజ్‌నగర్‌, కౌటాల, సిర్పూరు, బెజ్జూరు ప్రాంతాలకు అనుసంధానంగా ఉండే రహదారులపై పూర్తిస్థాయిలో నిఘా పెడుతున్నాం. ఈ విషయంలో ప్రత్యేక టీంలతో వివరాలు సేకరిస్తున్నాం

Updated Date - 2021-10-26T03:35:03+05:30 IST