Abn logo
Jun 24 2021 @ 08:11AM

ఖాకీ కాదు.. కర్కోటకుడు!

 దండం పెట్టినా.. దండించేశాడు

 ఎస్‌ఐ దాడిలో రైతు మృతి

 అతడిపై కేసు నమోదు, డిస్మిస్‌

 బాధ్యులను వదిలే ప్రసక్తే లేదు

 అసెంబ్లీలో స్టాలిన్‌


ప్యారీస్‌(చెన్నై): అతను ఖాకీ దుస్తులేసుకున్న కర్కోటకుడు.. తన మాటకు ఎదురు చెప్పారన్న ఆగ్రహంతో.. ద్విచక్రవాహనంపై ముగ్గురు కూర్చున్నారన్న వంకతో ఓ రైతును చితకబాదాడు. ‘వదిలెయ్‌ దేవుడా..’ అంటూ దండం పెట్టినా పట్టించుకోకుండా లాఠీతో కొట్టడంతో ఆ రైతు తీవ్రంగా గాయపడి మరణిం చాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూడడంతో పరిస్థితిని గ్రహించిన పోలీసు అధికారులు ఆ ఎస్‌ఐపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదుచేయడంతోపాటు అతడిని డిస్మిస్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. సేలం జిల్లాలో సంచల నం రేపిన ఈ ఘటన వివరాలిలా... 


ఎడప్పాడి నియోజకవర్గం సమీపంలోని ఇడయపట్టికి చెందిన ఆర్ముగం కుమారుడు మురుగేశన్‌ (40)కి భార్య అనక్కిలి, కుమార్తెలు జయప్రియ, జయబృంద, కుమారుడు కవిప్రి యన్‌ ఉన్నారు. మురుగేశన్‌ ఇడయపట్టి- వాళప్పాడి రోడ్డులో కిరాణా, పండ్ల దుకాణాలు నిర్వహిస్తున్నాడు. కరోనా  వ్యాప్తి తగ్గని కారణంగా సేలం జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. టాస్మాక్‌ దుకాణాలు జిల్లావ్యాప్తంగా మూసివేశారు. మద్యం అలవాటున్న మురుగేశన్‌ కళ్లకుర్చి జిల్లా కల్వరా యన్‌మలైలోని మద్యం దుకాణానికి తన ఇద్దరు స్నేహితులతో కలసి మంగళవారం బైక్‌పై వెళ్లాడు. అక్కడ మద్యం తీసుకున్న అనంతరం కరు మందురై మీదుగా మురుగేశన్‌ బృందం ఇంటికి తిరిగొస్తుండగా కల్వరాయన్‌మలై పాపనాయ కన్‌పట్టి అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద  పోలీసులు వాహనతనిఖీలు చేపట్టారు. ఆసమయంలో ఒకే బైక్‌పై వచ్చిన మురుగేశన్‌, ఆయన మిత్రులను అడ్డుకున్నారు.


ఆ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతలో ఆవేశానికి గురైన స్పెషల్‌ ఎస్‌ఐ పెరియస్వామి లాఠీతో మురుగేశన్‌, ఆయన మిత్రులపై దాడిచేశాడు. బ్రతిమలాడినా పట్టించుకోకుండా చావగొట్టాడు. ఈ ఘటనలో మురుగేశన్‌ తలకు బలమైన గాయాలు కావడంతో తుంబల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా నికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ఆత్తూర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి కి తరలిం చారు. అక్కడ చికిత్స ఫలించక బుధవారం ఉద యం మురుగేశన్‌ మృతి చెందాడు. సమా చారం తెలిసి ఆస్పత్రి వద్దకు చేరుకున్న మురుగేశన్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ స్తులు.. అమానుషంగా ప్రవర్తించిన ఎస్సై పెరియ స్వామిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎత్తావూర్‌ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడిం చారు. అంతేకాకుండా, మురుగేశన్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారంగా రూ.కోటి, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించే వరకు మురుగేశన్‌కు అంత్యక్రియలు నిర్వహించ బోమని తేల్చిచెప్పారు. పెరియస్వామిని అరెస్టు చేయాలని ఫిర్యాదు అందజేశారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై సేలం జిల్లా ఎస్పీ శ్రీఅభినవ్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. మురుగేశన్‌ పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఎస్‌ఐ పెరియస్వామిపై 302 (హత్యానేరం) సెక్షన్‌ కింద కేసు నమోదుచేయగా పెరియస్వామిని డిస్మిస్‌ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.


రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

పోలీసుల దాడిలో మృతిచెందిన రైతు మురుగేశన్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం స్టాలిన్‌ తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో సీఎం హామీ ఇచ్చారు.


భారీ నష్టపరిహారమివ్వాలి: ఎడప్పాడి

అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్వహణలోని పోలీసు శాఖ ప్రజలకు రక్షణ కల్పించడంలో విమర్శలు ఎదుర్కొంటోందని వ్యాఖ్యా నించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎడప్పాడి నియోజకవర్గ పరిధిలో రైతు కుటుంబానికి చెందిన మురుగేశన్‌ పోలీసుల దాడిలో బలైపోయారని, ఆయన కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించి, ఆయన మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అందుకు సీఎం స్టాలిన్‌ బదులిస్తూ, మురుగేశన్‌ మృతి వ్యవహారంలో పోలీసులు చేపట్టిన దర్యాప్తు కొనసాగుతోందని, నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

జాతీయంమరిన్ని...