పోలీస్‌.. రాంగ్‌రూట్‌!

ABN , First Publish Date - 2020-12-02T06:06:08+05:30 IST

పోలీసు శాఖ ఏస్థాయిలో గాడితప్పిందో ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే తెలిసిపోతుంది.

పోలీస్‌.. రాంగ్‌రూట్‌!

ఇష్టారీతిగా కేసుల నమెదు

అమాయకులను వేధిస్తున్న వైనం

సివిల్‌ పంచాయితీల్లో ప్రమేయం

సీఐ, ఎస్సైలపై కేసులు నమోదు

వీఆర్‌కు పలువురు సబ్‌ఇన్‌స్పెక్టర్లు 

క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్న ఎస్పీ

ఒంగోలు(క్రైం) డిసెంబరు 1: పోలీసు శాఖ ఏస్థాయిలో గాడితప్పిందో ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే తెలిసిపోతుంది. సివిల్‌ పంచాయితీలో తలదూర్చి ఒక వ్వక్తి అత్మహత్యకు కారణమైన ఒంగోలు తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసిన సీఐ లక్ష్మ్‌ణ్‌ను సస్పెండ్‌ చేయడమే కాదు, కేసు నమోదు చేశారు. చీరాలలో ఓ యువకుడు మాస్కు పెట్టుకోలేదన్న కారణంగా అత్యుత్సాహం చూపి అతని మృతికి కారణమైన ఎస్సై విజయకుమార్‌పై కేసు నమోదుకావడంతో పాటు, సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇలా వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్నా పోలీసుల తీరు మారలేదు.  వేటపాలెం ఎస్సైగా పనిచేసిన అజయ్‌కుమార్‌ హత్యకేసును అనుమానాస్పద కేసుగా నమోదుచేయడంతో పాటు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయన్ను వీఆర్‌కు పిలిపించారు. గిద్దలూరులో పని చేసిన ఒక ఎస్సైను అవినీతి ఆరోపణలపై వీఆర్‌కు పిలిపించి ఆ తర్వాత పోస్టింగ్‌ ఇచ్చారు.  ఇంకా సివిల్‌ పంచాయితీలో పాల్గొంటున్న స్టేషన్‌ రైటర్లు, కొంతమంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. స్పెషల్‌ బ్రాంచ్‌ ద్వారా సమాచారం సేకరించి క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన అనేకమంది సిబ్బందిని ఎస్పీ బదిలీలు చేశారు. అయినప్పటికీ పోలీసు అధికారులు, సిబ్బందిలో మార్పు రాకపోవడం విచారకరం.


టంగుటూరు ఎస్‌ఐ అతి వ్యవహారం

ఇటీవల ఇరువురు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని రక్షణ కావాలని టంగుటూరు పోలీసు స్టేషన్‌కు వెళితే అక్కడ బలవంతంగా అమ్మాయిని తల్లిదండ్రుల వెంట పంపించారు. దీంతో అక్కడే ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే తిరిగి ఆ అమ్మాయిని పిలిపించి యువకుడి వెంట పంపారు. తాజాగా ఇద్దరు మేజర్లు ఇష్టపడి వివాహం చేసుకుంటే టంగుటూరు ఎస్సై అక్రమ కేసు బనాయించి యువకుడిని జైలుకు పంపించారు. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే అక్కడ పనిచేస్తున్న ఎస్సై శ్రీనివాసరావును వీఆర్‌కు పంపించారు. ఆగస్టులో కొమరోలులో పనిచేస్తున్న మల్లికార్జునరావు, దోర్నాలలో పనిచేస్తున్న అబ్దుల్‌ రెహమాన్‌పై వివిధ అవినీతి ఆరోపణలు రుజువుకావడంతోపాటుగా ప్రజలతో అనుచితంగా వ్యహరిస్తున్నారని విధుల నుంచి తొలగించారు. వారిని అప్పట్లో వీఆర్‌కు పంపించారు. ఇలా అనేక మందిపై వేటు పడినప్పటికీ మార్పురావడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.


వాట్సాప్‌కు సమాచారమివ్వండి: ఎస్పీ

పోలీసుల అవినీతి అక్రమాలపై ప్రజల దృష్టికి వచ్చిన సమాచారాన్ని పోలీస్‌ కంట్రోల్‌ రూం  వాట్సాప్‌ నంబరు 91211022266కు తెలియజేయాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కోరారు. ప్రజలు ఇచ్చే సమాచారంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి చిరునామా రహస్యంగా ఉంచుతామని తెలిపారు.  

Updated Date - 2020-12-02T06:06:08+05:30 IST