షో..డో

ABN , First Publish Date - 2020-12-04T06:24:47+05:30 IST

ఆయనో యువనేత. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు శాసనసభ్యుడికి మించి నియోజకవర్గంలో అధికారాన్ని అనుభవించాలని తహతహ లాడుతున్నారు.

షో..డో

రోజూ పంచాయితీలు

అధికారుల అవస్థలు 

ప్రజలకు తప్పని పాట్లు

ఎన్నికల ముందు అంతగా పరిచయం లేని వ్యక్తి

ఇప్పుడు అధికారమే అడ్డాగా దందా 

అధికార హోదాలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి) : 

ఆయనో యువనేత. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు శాసనసభ్యుడికి మించి నియోజకవర్గంలో అధికారాన్ని అనుభవించాలని తహతహ లాడుతున్నారు. ఆయన వెనుక ఎమ్మెల్యే ఉన్నారన్న ఉద్దేశంతో అధికారులు పెదవి విప్పే సాహసం చేయడం లేదు. యువనేత పేరుతో పోలీస్‌ స్టేషన్‌ కేంద్రంగా సెటిల్‌మెంట్‌ చేస్తున్నారనే విమర్శలు జోరందుకున్నాయి. అందుకు తగ్గట్టుగా ఆయనకు ఓ కోటరీ తయారైంది. సాయంత్రమైతే యువనేత వద్ద వాలిపోతుంది. ఇటీవల కాలంలో ఏదైనా వివాదం తలెత్తితే ముందుగా యువనేత వద్దకే చేరుకుంటున్నారు. తమకు అనుకూలంగా పనిజరిగేలా అధికారులపై ఒత్తిడి తెప్పిస్తున్నారు. తన వద్దకు ఎవరైనా వస్తే చాలు. తప్పొప్పులను పక్కన పెడుతూ యువనేత పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి తమ వారిపై చర్యలు తీసుకోరాదంటూ హుకుం జారీ చేయడం ఆనవాయితీగా మారింది. మరోవైపు ప్రతిపక్షం వారికైతే తక్షణమే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. యువనేత చర్యలను గమనిస్తున్న సొంత పార్టీ శ్రేణులే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నాయి. కొందరు పార్టీకి దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల ముందు అంతా తామై కష్టపడితే తమకు కనీస మర్యాద కూడా దక్కడం లేదన్న ఆవేదన నియోజకవర్గ కేడర్‌లో నెలకొంది. ఇదే విధానం కొనసాగితే జిల్లాలోని సదరు నియోజకవర్గంలో పార్టీ మరింత బలహీనమైపోవడం ఖాయమంటూ అధికార పార్టీ కార్యకర్తలు ఘొల్లుమంటు న్నారు. ఇప్పటికే సదరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధి తీసు కున్న కొన్ని చర్యలు పార్టీకి మేలు కంటే కీడే చేస్తున్నాయన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో యువనేత వాడుతున్న పదజాలం విమర్శలకు దారితీస్తోంది. ప్రతిపక్ష నేతలపైన అదే మాదిరి విరుచుకుపడుతున్నారు. పార్టీ శ్రేణులకంటే నియోజకవర్గంలో తండ్రితో సంక్రమించిన అధికారాన్ని అను భవించేందుకు యువనేత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అంతేతప్ప పార్టీ కోసం కష్టపడ్డశ్రేణులను పట్టించుకోవడం లేదన్న భావన కేడర్‌లో నెలకొంది. 

టీడీపీ హయాంలో..

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ విశాల సహకార పరపతి సంఘం నిర్మించిన భవనంలోనూ యువనేత వేలుపెట్టారు. అప్పట్లో జరిగిన నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని ప్రతిపక్ష నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిని సహకార సంఘ అధికారులు పెద్దగా పట్టించు కోలేదు. 

ఏడాదిపాటు ఆ ఫిర్యాదులను పక్కన పెట్టేశారు. ఫిర్యాదులో పసలేదన్న ఉద్దేశంతోనే అధికారులు మౌనంగా ఉన్నారు. ఫిర్యాదుదారులు యువనేతను ఆశ్రయించారు. అంతే జిల్లా అధికారులపై యువనేత ఒత్తిడి పెంచారు. దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. తక్షణమే సంబంధిత సహకార సంఘంలో భవన నిర్మాణంపై విచా రణకు ఆదేశాలు జారీ అయ్యాయి. తీరా ఇప్పుడు టీడీపీ హయాంలో పదవి చేపట్టి భవనాన్ని నిర్మించిన వారు హైకోర్టును ఆశ్రయించారు. తమకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇలా యువనేత ముందు వెనుకా చూడ కుండా అధికారులను ఆదేశిస్తుండడంతో ఒక్కోసారి రివర్స్‌గేర్‌ కొడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని సంస్కృతిని జిల్లాలోని ఓ నియోజకవర్గంలో అమలు జరుగుతోంది, యువనేత వెనుక ప్రజా ప్రతినిధి ఉన్నారన్న ఉద్దేశంతో అధికారులు, పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.


Updated Date - 2020-12-04T06:24:47+05:30 IST