తరిమేశాం!

ABN , First Publish Date - 2021-10-24T04:23:33+05:30 IST

పోలియో అంటే ఒకప్పుడు భయపడే రోజలవి. చిన్నారులు ఆ మహమ్మారి బారిన పడితే నడవలేని పరిస్థితి వచ్చేది.

తరిమేశాం!

సత్ఫలితాలిస్తున్న పోలియో నిర్మూలన ఉద్యమం

పోలియో రహిత జిల్లాగా గుర్తింపు

ఏటా 3.38 లక్షల మంది పిల్లలకు చుక్కల మందు

నేడు ప్రపంచ పోలియో దినం


నెల్లూరు (వైద్యం), అక్టోబరు 23 : పోలియో అంటే ఒకప్పుడు భయపడే రోజలవి. చిన్నారులు ఆ మహమ్మారి బారిన పడితే నడవలేని పరిస్థితి వచ్చేది. దీని నివారణకు మందులు అందుబాటులో లేకపోవడంతో బాధితులు మానసికంగా నలిగిపోయే వారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పోలియోపై చేసిన ప్రయోగాల ఫలితంగా నేడు ఆ మహమ్మారి తగ్గుతోంది. కేవలం ఒక్క శాతం కేసులు మాత్రమే నమోదు కావడం ఇందుకు నిదర్శనం. 1960 - 80 మధ్య కాలంలో ఈ పోలియో మహమ్మారి చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపింది. 1968లో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త జోనక్‌సాల్క్‌ చేసిన ప్రయోగాల ఫలితంగా పోలియో నిర్మూలన టీకాను కనుగొన్నారు. ఇది మంచి సత్ఫలితాలు ఇవ్వడంతో 1995లో దేశంలో పోలియో వ్యాక్సిన అందుబాటులోకి వచ్చింది. దీనికి అనుగుణంగా ఏడాదికి  రెండు సార్లు పోలియో చుక్కలను చిన్నారులకు వేస్తున్నారు. ప్రభుత్వంతోపాటు జిల్లా వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులు, ప్రజల సహకారంతో ఒక ఉద్యమంలా పోలియో నిర్మూలన కార్యక్రమాలు జరపడంతో పోలియో రహిత జిల్లాగా గుర్తింపు లభించింది.  ఈ వ్యాధిపై పూర్తిగా అవగాహన కలిగించే దిశగా రోటరీ క్లబ్‌ ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన చర్యలు, టీకా కనుగొన్న జోనక్‌సాల్క్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబరు 24న ప్రపంచ పోలియో దినం జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. 


ఏటా 3.38 లక్షల మందికి..


ఏటా జిల్లాలో 3.38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మారుమూల గ్రామాలలో సైతం 3వేలకుపైగా పోలియో బూత శిబిరాలను ఏర్పాటు చేసి 12వేల మంది సిబ్బంది సహకారంతో చుక్కల మందు వేస్తున్నారు. ప్రత్యేకించి సమస్యాత్మక ప్రాంతాలు, రైల్వే, ఆర్టీసీ, జనం రద్దీగా ఉండే ప్రాంతాలలోనూ మొబైల్‌ బూతల ద్వారా ఈ కార్యక్రమం ఏటా జోరుగా సాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖతోపాటు అంగనవాడీలు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు 


ఏటా 50 లక్షలు వెచ్చించి 


పల్స్‌ పోలియో నిర్వహణకు ఏటా ప్రభుత్వం రూ.50లక్షలు జిల్లాకు కేటాయిస్తోంది. 75 ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు, 477 ఉప ఆరోగ్య కేంద్రాల ద్వారా 4.5లక్షల పోలియో చుక్కలను పంపిణీ చేస్తున్నారు. కావలి, వింజమూరు, ఉదయగిరి, ఆత్మకూరు, పొదలకూరు, గూడూరు, నాయుడుపేట, కోట, వెంకటగిరి, సూళ్లూరుపేట, కొడవలూరులలో స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి చుక్కల మందు పంపిణీ చేస్తున్నారు. 


ఆధునికంగా..


పోలియో నివారణకు ట్రైవాలెంట్‌ వ్యాక్సిన గతంలో వాడేవారు. ఈ  ఏడాది ఏప్రిల్‌ నుంచి బైవాలెంట్‌ వ్యాక్సిన అందుబాటులోకి రావడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. గతంలో పీ1, పీ2, పీ3 వైర్‌సకు సంబంధించి ట్రైవాలెంట్‌ వ్యాక్సిన వాడేవారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాదిగా పీ2, వైరస్‌ నిర్మూలన కావడంతో కొత్త వ్యాక్సిన అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఐపీవీ వ్యాక్సిన ఇంజక్షన కూడా అందుబాటులోకి రావడంతో చిన్నారులకు పోలియో చుక్కలతోపాటు ఈ  సూదిమందు ఇస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ వ్యాక్సినను తప్పనిసరిగా వేయిస్తే పోలియో వ్యాధి దరిచేరదు. 


పోలియోను నివారించ గలిగాం 


జిల్లాలో పోలియోను నివారించగలిగాం. ఇప్పటివరకు ఎలాంటి పోలియో కేసు నమోదుకాలేదు. నిర్ధేశించిన లక్ష్యాలకు మించి జిల్లాస్థాయిలో చుక్కలమందు వేస్తున్నాం. 

- డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డీఎంహెచవో

Updated Date - 2021-10-24T04:23:33+05:30 IST