రాళ్ల దాడి వెనుక రాజకీయ కుట్ర

ABN , First Publish Date - 2021-04-14T09:11:45+05:30 IST

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడిపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర

రాళ్ల దాడి వెనుక రాజకీయ కుట్ర

ప్రేక్షకుల్లా చూస్తుండిన పోలీసులు.. జడ్‌ప్లస్‌ ఉన్న బాబుకు రక్షణ కరువు

తిరుపతి దాడిపై దర్యాప్తు జరపండి.. ఏపీకి కేంద్ర బలగాలను పంపండి

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం శాఖకు టీడీపీ ఎంపీల వినతి


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడిపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోం శాఖను టీడీపీ ఎంపీలు కోరారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉప ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థించారు. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్‌ మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లాను కలిసి వినతి పత్రం అందించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దారుణాలకు పాల్పడుతోందని ఆరోపించారు.


‘‘సోమవారం రాత్రి 7.45 నిమిషాల ప్రాంతంలో తిరుపతి పట్టణంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తుండగా... కొంతమంది గూండాలు రాళ్లు విసిరారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. దాడి సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం చూస్తే అధికార వైసీపీ పార్టీతో అంటకాగినట్లు అనుమానాలను కలుగుతున్నాయి. దీన్ని బట్టి స్థానిక పోలీసులు ఈ దాడిపై సరిగ్గా దర్యాప్తు చేయలేరని అర్థమవుతోంది, కాబట్టి దాడిపై దర్యాప్తు జరిపించి తగిన చర్యలు తీసుకోండి. ముందస్తు సమాచారం ఇవ్వడమే కాకుండా అనుమతులు తీసుకున్నప్పటికీ సంబంధిత అధికారులు, స్థానిక పోలీసులు జడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన చంద్రబాబుకు సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు’’ అని ఎన్నికల సంఘం, హోం శాఖ దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు. వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచీ తెలుగు దేశం పార్టీ నేతలపై దాడులు పెరిగాయని, వైసీపీ పార్టీ హింసకు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనమని తమ వినతిపత్రంలో  టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు.


ఓటర్లను బెదిరించిన జగన్‌

వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌ రెడ్డి నేరుగా ఓటర్లను బెదిరిస్తున్నారని టీడీపీ ఎంపీలు.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘‘ప్రభుత్వ పథకాల్లో భాగంగా అందుతున్న నగదు వివరాలతో ప్రజలకు ఆయన నేరుగా లేఖ రాశారు. అంటే.. వైసీపీకి ఓటు వేయని వారు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కోల్పోతారని బెదిరించినట్టే’’ అని ఫిర్యాదు చేశారు. గత రెండేళ్ల కాలంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ డూప్లికేట్‌ ఓట్లను నమోదు చేయించిందని టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. 


టీడీపీ ఎంపీల విజ్ఞప్తులు..

1) టీడీపీ అధినేత చంద్రబాబుపై జరిగిన దాడిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి. 2) నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకుగాను కేంద్ర బలగాలకు పంపించాలి. 3) అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలను ఏర్పాటు చేయాలి. 4) రెండు లక్షలకుపైగా నకిలీ ఓటరు కార్డులు ఉన్న నేపథ్యంలో ఓటు వేయడానికి ఓటరు కార్డుతో పాటు మరో గుర్తింపుకు కార్డును తప్పనిసరి చేయాలి. 5) అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలను పర్యవేక్షించడానికి మైక్రో అబ్జర్వర్లను నియమించాలి. 6) ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పర్యవేక్షకుడిని నియమించాలి. సాధ్యమైనంత మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వెలుపలివారిని నియమించండి. 7) ఎన్నికల ప్రక్రియలో గ్రామ వలంటీర్ల భాగస్వామ్యాన్ని నియంత్రించాలి. 8) ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకట్టవేయడానికి చర్యలు తీసుకోవాలి. 9) డూప్లికేట్‌ ఓట్లను ఏరివేయాలి. 10) ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నేతలకు తగినంత భద్రత కల్పించాలి.

Updated Date - 2021-04-14T09:11:45+05:30 IST