Abn logo
Mar 5 2021 @ 01:09AM

రాజకీయ వైరాగ్యం

తమిళనాడులో ‘చిన్నమ్మ’ శశికళ రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన ఏ మాత్రం ఊహకు అందనిది. తాను ఎప్పుడూ పదవుల కోసం ఆశపడలేదనీ, అధికారం కోసం వెంపర్లాడలేదనీ, నెచ్చెలి జయలలిత జీవించి ఉన్నకాలంలో ఒక సోదరిలాగా ఆమె పక్కన ఉంటూ ఆశయసాధనకు ఎలా తోడ్పడ్డానో, ఇప్పటికీ అదే రీతిన, అదే లక్ష్యంతో ఉన్నానని శశికళ ఆ ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ వైరాగ్యంతో పాటు, లేఖలో ఆమె ప్రస్తావించిన మరికొన్ని అంశాలు సైతం ఆశ్చర్యపరచేవే. రాజకీయాలనుంచి తప్పుకోదల్చుకున్న ఆమె ఆ ఒక్కముక్కా చెప్పి ఊరుకోలేదు. తమిళనాట అమ్మ స్వర్ణయుగ పాలన నూరేళ్ళూ సాగాలని ఆకాంక్షించడం ద్వారా ఇప్పుడు అధికారంలో ఉన్నవారిని దీవించారు. మళ్ళీ అమ్మపాలనే రావాలి, ఆమె ఆశయాలు నెరవేరాలి అనడం, అలా జరిగేట్టు ఆశీర్వదించమంటూ జయలలితనే ప్రార్థించడం ద్వారా పళని పన్నీరు ద్వయం పక్షాన అమ్మ ఆశీస్సులున్నాయన్న సంకేతాలు ఇచ్చారు. కొంతమంది కబంధహస్తాలనుంచి అన్నాడీఎంకెను విముక్తిచేస్తారనుకున్న శశికళ ఇలా చేశారేమిటని ఆమె మేనల్లుడు దినకరన్‌ వాపోయారు. శశికళ ప్రకటనలోని ప్రతీ అక్షరాన్నీ అన్నాడీఎంకె శ్రేణులు అర్థంచేసుకోవాలని బీజేపీ హితవు చెప్పింది. ఇక, వచ్చేనెలలో ఎన్నికలుండగా తమిళ రాజకీయాలను కీలకమలుపు తిప్పే ఈ హఠాత్‌ నిర్ణయం వెనుక ఇతరత్రా ఏవో పనిచేశాయనీ, ఎన్నో నడిచాయనీ ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. 


తనకు అధికారదాహం లేదని ఆమె ఇప్పుడు అనవచ్చునేమో కానీ, జైలుకు వెళ్ళేముందు, వచ్చిన తరువాతా ఆమె వ్యవహరించిన తీరు తదనుగుణంగా లేదు. జయలలిత స్థానంలో ముఖ్యమంత్రి కావడానికీ, పార్టీకి సారధ్యం వహించడానికీ అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాకే పరిస్థితులు తారుమారై ఆమె జైలుకు పోవలసివచ్చింది. తాత్కాలిక సీఎంగా ఉన్న పన్నీరు కన్నీరు పెట్టుకొని తిరుగుబాటు చేయడం, పళనిస్వామిని కూచోబెడితే ఆయనా ఎదురుతిరగడం, చివరకు ఇద్దరూ కలసి ఆమెను పార్టీనుంచి తప్పించడం తెలిసినవే. ఈ పరిణామాల వెనుక భారతీయ జనతాపార్టీ పెద్దలున్నారని కొందరంటారు. జైలుకు పోయేముందు జయలలిత సమాధిని ముమ్మారు బలంగా తట్టి ప్రతీకార శపథం చేసిన శశికళ, జైలులో ఉంటూ కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే ఉన్నారు. పార్టీని తిరిగి చేజిక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆమె ఉనికిని దినకరన్‌ ఎప్పటికప్పుడు నిలబెడుతూ వచ్చారు. జైలునుంచి విడుదలకాగానే అమ్మ పార్టీ జెండా ఉన్న కారులోనే ఆమె చెన్నై చేరుకొని, తన రాజకీయలక్ష్యాన్ని విస్పష్టంగా ప్రకటించారు. నాయకులతో భేటీలు, కూటముల ఏర్పాటు ప్రయత్నాల్లో ఆఖరునిముషం దాకా చురుకుగానే ఉన్నారు. 


ఈ కారణంగానే ఆమె రాజకీయ వైరాగ్యాన్ని ఎవరూ ఇచ్ఛాపూర్వకమైనదని అనుకోవడం లేదు. అన్నాడీఎంకెతో ఆమెను కలపడం అసాధ్యం కావడంతో, రాజకీయంగా ఆమె ఉనికి ప్రమాదమని తేలడంతో పక్కకు తప్పించేశారని అంటున్నారు. పళని పన్నీరు ద్వయానికి పాలనలో మంచిపేరు ఉన్నా, ఓటర్లను ఆకర్షించే శక్తి లేదనీ, శశితోడు లేనిదే తిరిగి ఆ పార్టీ అధికారంలోకి రాలేదని గురుమూర్తివంటి మేథావులు ఇప్పటికే అన్నారు. డీఎంకె మంచి మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నదని సర్వేలు తేల్చేసిన నేపథ్యంలో, శశికళ ఉనికి కచ్చితంగా అధికారపార్టీకి నష్టం చేకూర్చేదే. ఆమె జైలునుంచి విడుదలవుతున్న సందర్భంలోనూ, కాస్తముందూ వేలాదికోట్ల రూపాయల ఆస్తులపై జరిగిన ఐటీదాడులను కొందరు గుర్తుచేస్తున్నారు. రాజకీయ వివాదాల పరిష్కారానికి కేంద్రంలోని అధికారపక్షం ఈ మార్గాన్నే అనుసరిస్తున్నదనీ, అధికారమా, ఆస్తులా అన్న ప్రశ్నకు ఆమె ఆస్తుల రక్షణనే ఎంపికచేసుకున్నారన్నది వారి విశ్లేషణ. తాత్కాలికమా, శాశ్వతమా అన్నది అటుంచితే, ఆమె రాజకీయ నిష్క్రమణ మిగిలిన ఆస్తిపాస్తులను కాపాడవచ్చు, ఓటమి అంచుల్లో ఉన్నదంటున్న అధికారపక్షం తేరుకొనేందుకు ఉపకరించవచ్చు. అంతిమంగా, అమ్మ ఓట్లు చీలకూడదన్న అందరి ప్రయత్నం స్టాలిన్ దూకుడుకు ఏమేరకు కళ్ళెం వేయగలదో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement