పొలిటికల్‌ జీవో!

ABN , First Publish Date - 2021-01-08T07:33:42+05:30 IST

‘పాలసీ పెరాలసిస్‌’... అంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని అసహాయత, అసమర్థత అని అర్థం! అధికారంలో ఉన్న వారిని విమర్శించేందుకు విపక్షాలు వాడే పదాలివి..

పొలిటికల్‌ జీవో!

  • మత సామరస్యంపై కమిటీల ఏర్పాటు
  • ప్రభుత్వ ఉత్తర్వుల్లో రాజకీయ వ్యాఖ్యలు
  • గత ప్రభుత్వంపై విమర్శలు
  • నాడు అన్యాయంగా రాష్ట్ర విభజన
  • 2014-19లో ‘పాలసీ పెరాలసిస్‌’
  • కీలక రంగాల్లో ప్రగతి లేదు
  • మేమొచ్చాక బలమైన మార్పులు
  • అందరికీ ఇల్లుతో ఆర్థికానికి ఊతం
  • ఇదే సమయంలో ‘మత’ దాడులు
  • ఆ వ్యాఖ్యలపై బ్యూరోక్రాట్ల విస్మయం


అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ‘పాలసీ పెరాలసిస్‌’... అంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని అసహాయత, అసమర్థత అని అర్థం! అధికారంలో ఉన్న వారిని విమర్శించేందుకు విపక్షాలు వాడే పదాలివి! లేదా... ఇప్పుడు అధికారంలో ఉన్న వారు గత ప్రభుత్వాన్ని రాజకీయంగా విమర్శించేందుకు ఇలాంటి పదాలు వాడుతుంటారు. కానీ... ఇప్పుడు ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలతో ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులే వెలువడ్డాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెలువరించేందుకు, అవసరమైతే ఉద్దేశాన్ని వివరించేందుకు మాత్రమే పరిమితం కావాల్సిన జీవోను కూడా ‘రాజకీయం’ చేసేశారు. ఇలాంటి జీవోలను తమ సర్వీసులో ఎప్పుడూ చూడలేదని సీనియర్‌ బ్యూరోక్రాట్లు పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ జీవో ఏమిటంటే... రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు మత సామరస్యాన్ని కాపాడేందుకు కమిటీలు ఏర్పాటు చేయడం! దీనిని గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ జారీ చేశారు. ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్ర ఉందని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు అధికారిక కమిటీలు ఏర్పాటు చేయడం మంచిదే. కానీ... ఈ జీవోలో చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వమే దానికి రాజకీయ రంగు పులిమినట్లయింది. ‘‘గత కొన్నేళ్లుగా నవ్యాంధ్ర ప్రజలు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. అసంబద్ధంగా, అన్యాయంగా రాష్ట్ర విభజన జరిగింది. దీనివల్ల రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడింది. 2014-19 మధ్యకాలంలో గతంలో ఎన్నడూలేని స్థాయిలో ‘పాలసీ పెరాలసిస్‌’ కనిపించింది. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో సరైన ప్రగతి సాధించలేకపోయారు.


దీనిని చక్కదిద్దేందుకు ప్రస్తుత ప్రభుత్వం బలమైన చర్యలు చేపట్టింది. ప్రజలందరి జీవితాలు బాగుపడేందుకు పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వ్యవసాయం, వైద్యం, విద్య, మహిళా సాధికారత తదితర రంగాల్లో అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు జాతీయ స్థాయిలో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి’’ అని ఈ జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రం కోలుకుంటోందని భావిస్తుండగానే... కొవిడ్‌ మహమ్మారి వచ్చి పడిందని తెలిపారు. ఇంతటి సంక్షోభంలోనూ ఆసరా, చేయూత వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని.. ఇప్పుడు ‘పేదలందరికీ ఇల్లు’ పథకాన్ని ప్రారంభించామని వివరించారు. ఇంటి నిర్మాణాలతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ‘‘సరిగ్గా ఇదే సమయంలో కొన్ని స్వార్థపూరిత శక్తులు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతను, ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవడమే వీరి లక్ష్యం’’ అని తెలిపారు. అందుకే... మత సామరస్య కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని, విధానాలను పొగుడుకోవడం బాగానే ఉన్నా... 2014-19 మధ్యకాలంలో ‘పాలసీ పెరాలిసి్‌స’తో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందనడం ఫక్తు రాజకీయ వ్యాఖ్యలే అని బ్యూరోక్రసీ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయ విమర్శలనే జీవోలో పేర్కొనడం చిత్రంగా ఉందని పేర్కొంటున్నాయి.



మత సామరస్య కమిటీలు...

మత సామరస్యం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయి కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. డీజీపీ డిప్యూటీ చైర్మన్‌గా ఉంటారు. హోం, దేవదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీకి జీఏడీ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్‌) కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా, ఎస్పీ డిప్యూటీ చైర్మన్‌గా ఉంటారు. దేవదాయ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ ఏడీలతోపాటు వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా, రెవెన్యూ) సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. మత విద్వేషాలు తలెత్తినప్పుడు  తీసుకోవాల్సిన చర్యలను రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ నిర్దేశిస్తుంది. చిన్నారుల్లో మత సామరస్య భావన పెంచేందుకు చర్యలు చేపడుతుంది. జిల్లా స్థాయి కమిటీలు కూడా ఇవే బాధ్యతలు నిర్వహిస్తాయి. మత విద్వేషాలకు సంబంధించిన కేసుల విచారణను పర్యవేక్షిస్తాయి.

Updated Date - 2021-01-08T07:33:42+05:30 IST