తిరుపతిలో రాజకీయ వేడి

ABN , First Publish Date - 2021-01-21T06:37:17+05:30 IST

తిరుపతి కేంద్రంగా ప్రధాన పార్టీల రాజకీయాలు ఊపందుకున్నాయి. త్వరలో ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపధ్యంలో పార్టీల హడావిడి బాగా పెరుగుతోంది.

తిరుపతిలో రాజకీయ వేడి

ఉప ఎన్నికల నేపథ్యంలో 

జోరందుకున్న విపక్షాల కార్యకలాపాలు

టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్రకు నేడు శ్రీకారం

అచ్చెన్న నేతృత్వంలో అలిపిరి నుంచీ ర్యాలీ.... ఎన్టీఆర్‌ కూడలిలో  సభ

జనసేన పీఏసీ సమావేశానికి నేడు

పవన్‌ కల్యాణ్‌,నాదెండ్ల మనోహర్‌ రాక

తిరుపతి అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశం


తిరుపతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి కేంద్రంగా ప్రధాన పార్టీల రాజకీయాలు ఊపందుకున్నాయి. త్వరలో ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపధ్యంలో పార్టీల హడావిడి బాగా పెరుగుతోంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ గతేడాది అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఎప్పుడైనా ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశమున్నందున ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. దీంతో సహజంగానే అందరి దృష్టీ తిరుపతిపై పడింది. ప్రధాన పార్టీలు కూడా తిరుపతి కేంద్రంగా ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ఈ ప్రాంతంలో కార్యకలాపాల పేరిట శ్రేణులను సన్నద్ధం చేయడానికి, ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో చాలా ముందస్తుగా స్పందించింది. గతేడాదిలోనే అభ్యర్థిని ప్రకటించేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని భావిస్తున్న సమయం కంటే కనీసం నాలుగు నెలల ముందే టీడీపీ అధినేత ఈ సాహసం చేశారు. దానికి తోడు ఋధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతి చేరుకుని పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా పార్టీ అధినేత పిలుపునిచ్చిన ధర్మ పరిరక్షణ యాత్రను గురువారం తిరుపతిలోనే ప్రారంభిస్తున్నారు. దీనికి కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న స్వయంగా పాల్గొంటున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు అలిపిరి కూడలి నుంచీ ర్యాలీగా బయల్దేరి ఎన్టీఆర్‌ కూడలికి చేరుకుని, అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికోసం తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నేతలు, శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలిరానున్నారు. జన సమీకరణ కోసం ఈ మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల ఇంఛార్జులు రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వర్గాలకు ఊపు, ఉత్తేజం తెప్పించేందుకు స్థానిక నేతలు శ్రమిస్తున్నారు.ఇక జనసేన విషయానికొస్తే తిరుపతి ఉప ఎన్నికల నేపధ్యంలోనే నివర్‌ తుఫాను సందర్భంగా గతేడాది ఆఖరులో తిరుపతి వచ్చారు. పార్టీ నేతలను కలిసి సమీక్షించారు. అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పంట నష్టాలను పరిశీలించి వెళ్ళారు. ఇపుడు గురువారం తిరుపతిలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ హాజరు కానున్నారు.తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.వాస్తవానికి జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని జనసేన నుంచే బరిలోకి దింపాలని పార్టీ వర్గాల నుంచీ అధినేతపై తీవ్ర ఒత్తిళ్ళు వస్తున్నాయి. బీజేపీ అభ్యర్థికి జనసేన అభిమానులు, సానుభూతిపరులు పూర్తిస్థాయిలో సహకరించే పరిస్థితులు లేవన్నది వారి వాదన.అయితే బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రయోజనాలు, విస్త్రృత స్థాయిలో పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరాన్ని బట్టే అధినేత నిర్ణయం వుంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆ కారణంగా అధినేత తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థి విషయమై పట్టుదలకు పోయే అవకాశాలు తక్కువగా వున్నాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికీ ఈ విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు పవన్‌ కళ్యాణ్‌ శుక్రవారం నిర్వహించే మీడియా సమావేశంలో తెర దించడంతో పాటు, శ్రేణులకు స్పష్టత ఇచ్చే అవకాశముంది.ఇక బీజేపీ విషయానికొస్తే గత కొంతకాలంగా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు తరచూ తిరుపతి వచ్చి వెళుతున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనూ పర్యటిస్తున్నారు. పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదునైన విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో తిరుపతిలో బీజేపీ అనుబంధ విభాగాల కార్యకలాపాలు కూడా పెరిగాయి. ఇక వామపక్షాలు సైతం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తరచూ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అధికార పక్షమైన వైసీపీలో మాత్రం  అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచీ ఇతరత్రా అంశాల వరకూ బాహాటంగా  ఎలాంటి కార్యకలాపాలూ జరుగుతున్నట్టు కనిపించడం లేదు. కాకపోతే తెలంగాణలో దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ఆ పార్టీ నేతలు అంతర్గతంగా తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదన్నర నుంచీ దళితులపై దాడులు, వేధింపులు మొదలుకుని, రాజకీయ ప్రత్యర్థులపైన, హిందూ దేవాలయాలపైన దాడుల వరకూ పలు పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి, ఽఅధికార పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత పెంచుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తిరుపతి ఉప ఎన్నికల్లో గతంలో కంటే వైసీపీ అభ్యర్థికి మెజారిటీ తగ్గినా, లేక ఫలితం తారుమారైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార పక్షం తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ప్రమాదాన్ని గ్రహించినందునే వైసీపీ జిల్లా నేతలు కూడా పరిస్థితులను చక్కదిద్దుకునే దిశగా చాపకింద నీరులా పనిచేసుకెళుతున్నారని సమాచారం. 

Updated Date - 2021-01-21T06:37:17+05:30 IST