రాజకీయ కక్షసాధింపే!

ABN , First Publish Date - 2021-07-20T05:56:04+05:30 IST

జిల్లాలో ఉపాధి పథకం పెండింగ్‌ బిల్లులు పెద్దమొత్తంలోనే ఉన్నాయి.

రాజకీయ కక్షసాధింపే!
ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు స్వామి, ఏలూరి, పార్టీ నేతలు

జిల్లాలో రూ.262 కోట్ల బకాయిలు

పనులు చేసిన వారు  రెండేళ్లుగా ఎదురు చూపులు  

విజిలెన్స్‌ తనిఖీలు పూర్తిచేసినా చెల్లింపుల ఊసే కరువు 

ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ ఆందోళన

దీర్ఘకాలం బిల్లుల పెండింగ్‌పై హైకోర్టు సీరియస్‌

అయినా.. స్పందించని సర్కారు 


ఉపాధి పనుల బిల్లుల బకాయిల చెల్లింపు విషయంలో కదలిక కన్పించడం లేదు. హైకోర్టు మొట్టికాయలు వేసినా సర్కారులో స్పందన కరువైంది. అధికారులు అదే తీరును ప్రదర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం ద్వారా రికార్డు స్థాయిలో కూలీలకు పనులు కల్పించారు. తాద్వారా లభించిన మెటీరియల్‌ నిఽఽధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రగతికి దారులు పడ్డాయి. అయితే ఆ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో జాప్యం చోటుచేసుకుంది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు ఆ పనులు చేసిన వారిపై కక్షసాధింపునకు దిగింది. బిల్లులు చెల్లించకపోగా ఒకటికి రెండు సార్లు పనులపై విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించింది. లోపాలు తక్కువగానే ఉన్నట్లు తేలినా బిల్లుల చెల్లింపు ఊసేత్తడం లేదు. తాజాగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో బాధితులలో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. అయినా కూడా తగినవిధంగా అడుగులు పడుతున్నట్లు కనిపించడం లేదు.


ఒంగోలు, జూలై 19 (ఆంధ్రజ్యోతి)  : జిల్లాలో ఉపాధి పథకం పెండింగ్‌ బిల్లులు పెద్దమొత్తంలోనే ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.2వేల కోట్ల మేర జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా అటు కూలీలకు వేతనాలు, ఇటు మెటీరియల్‌ కోటా కింద పనులకు అందాయి. గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రైన్లు, పాఠశాలలు, శ్మశానాలలో అభివృద్ధి పనులు, అంగన్‌వాడీ, పంచాయతీ, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలు పెద్ద ఎత్తున చేశారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా పనులు అప్పటి వరకు చేసిన వారి బిల్లులను నిలిపివేసింది. టీడీపీ కాలంలోని ఐదేళ్లలో చివరి ఏడాది అయిన 2018-19లోనే అధికంగా ఇలా మెటీరియల్‌ కోటా పనులు జరిగాయి. ఆ ఏడాది జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల మేర ఉపాధి పథకం కింద వెచ్చించారు. అందులో రూ.590 కోట్లు కూలీలకు వేతనాలుగా అందగా, ఇంచుమించు రూ.397కోట్ల మేర మెటీరియల్‌ కోటా కింద ఖర్చు చేశారు. అప్పటికి పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసినప్పటికీ మాజీలు అయిన సర్పంచ్‌లు, ఇతర నేతలు అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఒత్తిడితో గ్రామాభివృద్ధి పనులు భారీగా చేశారు.


అప్పులు తెచ్చి మరీ..

అనేక మంది లక్షలు అప్పులు తెచ్చి పనులు చేయగా 2018 నవంబరు ఆఖరు నుంచి బిల్లుల చెల్లింపు నిలిచిపోయాయి. అనంతరం 2019 మార్చి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకావడంతో పూర్తిగా ఆగిపోయాయి. అలా 2018-19లో చేసిన పనులకు సంబంధించి జిల్లాలో రూ.210 కోట్ల మేర బిల్లులు నిలిచిపోగా, 2019-20 ఆర్థిక సంవత్పరంలో పాత పనులకు సంబంధించి మరో రూ.52 కోట్ల మేర బిల్లులను అధికారులు అప్‌లోడ్‌ చేశారు. అలా మొత్తంగా రూ.262 కోట్ల వరకు పెండింగ్‌ ఉండగా ఒక్క పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షణలోనివి దాదాపు రూ.197 కోట్లు అందులో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆ బిల్లుల చెల్లింపును నిలిపివేయడమే కాక ఏడాది క్రితం విజిలెన్స్‌ తనిఖీలు చేయించి లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేసింది.


తనిఖీలు పూర్తయినా..

కొన్నిచోట్ల 10శాతం నుంచి 20శాతం వరకు లోపాలు ఉన్నట్లు తనిఖీ బృందాలు గుర్తించినట్లు సమాచారం. కాగా ఆ మేరకు మినహాయించి మిగిలిన మొత్తాలను అయినా ఇస్తారని ఆ పనులు చేసిన వారు ఆశించారు. అయితే ప్రత్యర్థి పక్షాల నేతలను వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం పాత బకాయిలను అలాగే ఉంచింది. హైకోర్టుకు ఈ వ్యవహారం చేరగా పలుమార్లు చెల్లింపులు చేయాలని గతంలో కోర్టు అదేశించినా తగుస్థాయిలో ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో వారం క్రితం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలు నిర్వహించింది. జిల్లాలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి  నేతృత్వంలో ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. తాజాగా గత గురువారం దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి అరూప్‌కుమార్‌ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి ప్రభుత్వ తీరుపై సీరియస్‌ కావడమేకాక ఆగస్టు 1 నాటికి పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయాలని ఆదేశించింది. 


భారీగా పెండింగ్‌ బిల్లులు

జిల్లాలో ఉపాధి పథకం పెండింగ్‌ బిల్లులు పెద్దమొత్తంలోనే ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.2వేల కోట్ల మేర జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా అటు కూలీలకు వేతనాలు, ఇటు మెటీరియల్‌ కోటా కింద పనులకు అందాయి. గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రైన్లు, పాఠశాలలు, శ్మశానాలలో అభివృద్ధి పనులు, అంగన్‌వాడీ, పంచాయతీ, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలు పెద్ద ఎత్తున చేశారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా పనులు అప్పటి వరకు చేసిన వారి బిల్లులను నిలిపివేసింది. టీడీపీ కాలంలోని ఐదేళ్లలో చివరి ఏడాది అయిన 2018-19లోనే అధికంగా ఇలా మెటీరియల్‌ కోటా పనులు జరిగాయి. ఆ ఏడాది జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల మేర ఉపాధి పథకం కింద వెచ్చించారు. అందులో రూ.590 కోట్లు కూలీలకు వేతనాలుగా అందగా, ఇంచుమించు రూ.397కోట్ల మేర మెటీరియల్‌ కోటా కింద ఖర్చు చేశారు. అప్పటికి పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసినప్పటికీ మాజీలు అయిన సర్పంచ్‌లు, ఇతర నేతలు అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఒత్తిడితో గ్రామాభివృద్ధి పనులు భారీగా చేశారు.


ఇప్పటికైనా చెల్లింపులు చేయాలి

డాక్టర్‌ స్వామి, ఎమ్మెల్యే, కొండపి

గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి అభివృద్ధి పనులు గత ప్రభుత్వ కాలంలో గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు చేశారు. కేవలం వారు వైసీపీకి చెందిన వారు కాదన్న కారణంతోనే ఈ ప్రభుత్వం ఆ బిల్లులను ఆపేసింది. రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరించింది. దాని వల్ల సదరు పనులు చేసిన అనేకమంది అప్పులపాలై అల్లాడుతున్నారు. హైకోర్టు గురువారం చేసిన వ్యాఖ్యలు, తీవ్ర హెచ్చరికలతోనైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా పెండింగ్‌ బిల్లులను చెల్లించాలి. 


Updated Date - 2021-07-20T05:56:04+05:30 IST