Abn logo
Oct 22 2021 @ 12:35PM

HYD : ఈ ఏరియాలో ఖాళీ స్థలాలు కనిపిస్తే ఖతం.. రాత్రికి రాత్రే నిర్మాణాలు.. లెక్కల్లేవ్‌..!

  • అక్రమార్కుల చేతుల్లోకి పార్కు స్థలాలు
  • ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రాత్రే నిర్మాణాలు
  • ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ : మేడిపల్లి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 103లో సుమారు వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఫీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధి వివేకానందనగర్‌ కాలనీ మధ్యలో ఉన్న ఈ స్థలాన్ని స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ రాజకీయ నేత చెరబట్టాడు. ప్రభుత్వ స్థలమనే బోర్డును సైతం తొలగించి రాత్రికి రాత్రే నిర్మాణాలు మొదలుపెట్టాడు. కొద్ది రోజులుగా నిర్మాణ పనులు జరుగుతున్నా రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. టీఎస్‌ బీపాస్‌ అందుబాటులోకి వచ్చాక అనుమతుల్లేకుండా ఏ ఒక్క నిర్మాణం జరగదని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఫీర్జాదిగూడలో అందుకు విరుద్ధంగా ఏకంగా ప్రభుత్వం స్థలంలోనే నిర్మాణం జరుగుతున్నా పాలకమండలి స్పందించడం లేదు.


ప్రగతినగర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న సందర్భంలో అక్కడి పాలకవర్గాలు లే అవుట్లలో పార్కులకు, ఖాళీ స్థలాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఖాళీ స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేశారు. ఒక్కో పార్కుకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టి అప్పటి పంచాయతీ అధీనంలో నిర్వహించారు. పంచాయతీ కార్పొరేషన్‌ పరిధిలో విలీనమైన తర్వాత పార్కులను అక్రమార్కులు చెరబడుతున్నారు. గతంలో పార్కులు, ఖాళీ స్థలాలు 52 ఉండగా, ప్రస్తుతం 18 పార్కులు మాత్రమే మిగిలాయి. తాజాగా సాయినగర్‌ ప్రాంతంలోని పార్కులో పాగా వేసేందుకు కొందరు యత్నిస్తున్నారు.

ఫీర్జాదిగూడ, నిజాంపేట కార్పొరేషన్‌ పరిధుల్లో మాత్రమే కాదు.. నగర శివారులోని బడంగ్‌పేట, మీర్‌పేట, జవహర్‌నగర్‌, బండ్లగూడ జాగీర్‌, బోడుప్పల్‌ కార్పొరేషన్ల పరిధిలోని ఖాళీ స్థలాలు మాయమవుతున్నాయి. రాత్రికి రాత్రే నిర్మాణాలు వెలుస్తున్నాయి.  ప్రభుత్వ భూములతో దందా చేస్తున్న పలువురు కార్పొరేటర్లపై జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో కేసులు సైతం నమోదవ్వడం గమనార్హం.


లెక్కల్లేవ్‌..

నగర శివారులో కార్పొరేషన్లు ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికార యంత్రాంగం వద్ద పార్కులు, ఖాళీ స్థలాలకు సంబంధించిన లెక్కలు లేవు. స్థానిక కాలనీ అసోసియేషన్ల అధీనంలో పార్కులు, ఖాళీ స్థలాలు ఉండగా, కబ్జాదారులు చెరపడుతున్నారు. ఖాళీ స్థలాలు, పార్కుల వివరాలను అందిస్తే అభివృద్ధి చేస్తామని హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు అధికారులు గతంలో కార్పొరేషన్ల అధికారులకు తెలిపినా ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడ పార్కులు ఉన్నాయో, ఏ స్థితిలో ఉన్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.


డ్రాఫ్ట్‌ కాపీల్లో మాత్రమే స్థలాలు 

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పడిన లేఅవుట్లలో పార్కులు, ఖాళీ స్థలాలను స్థానిక సంస్థలకు రిజిస్ర్టేషన్‌ చేసి అప్పగిస్తారు. ఆ స్థలాలు కబ్జాకాకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదే. శివారులోని కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్‌ చేసిన డెవలపర్లు మొదట్లో పార్కులు, ఖాళీ స్థలాలను చూపించారు. మౌలిక సదుపాయాలు మెరుగ్గా కల్పించామంటూ లేఅవుట్‌లో ప్లాట్లను విక్రయించారు. లే అవుట్‌ కాపీల్లో ఉన్న స్థలాలను డెవలపర్లే కబ్జా చేస్తున్నారు. కేవలం కాగితాలపైనే పార్కు, ఖాళీ స్థలమంటూ చూపిస్తున్నారు. నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, మల్లంపేట, బోడుప్పల్‌ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్‌లలో ఈ తంతు కొనసాగుతోంది. 


కనిపించని కట్టడి

టీఎస్‌బీపాస్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలను కట్టడి చేయడానికి కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో స్థానిక మున్సిపల్‌ అధికారులతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్‌, ఇతర విభాగాలకు చెందిన అధికారులను నియమించుకునే అధికారం కలెక్టర్‌కు అప్పగించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడా అక్రమ నిర్మాణాలను కట్టడి చేసినట్లు కనిపించడం లేదు. పటిష్టమైన మున్సిపల్‌ చట్టం-2019, టీఎస్‌బీపాస్‌ ఇవేమీ శివారు కార్పొరేషన్లలో పార్కు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను ఆపలేకపోతున్నాయి.


ప్రభుత్వ స్థలాలతో దందా..

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రభుత్వ భూములతో పెద్దఎత్తున దందా సాగుతోంది. కార్పొరేషన్‌ పరిధిలో అత్యధికంగా ప్రభుత్వ, హెచ్‌ఎండీఏ భూములున్నాయి. కబ్జాదారులు వాటిలో లేఅవుట్లు చేసి తక్కువ ధర అంటూ పేదలకు అంటకడుతున్నారు. నోటరీలతో విక్రయిస్తున్నారు. నిర్మాణాలకు అండగా ఉంటామని కొంత మంది కార్పొరేటర్లు భరోసాగా నిలుస్తున్నారు. ఫిర్యాదులు అందినప్పుడు రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు కాస్త హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్నారు.


రెవెన్యూ అధికారులకు లేఖ రాస్తాం

ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న విషయం మా దృష్టికి రాలేదు. ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాస్తాం. - ఫీర్జాదిగూడ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రీనివాస్‌

రూ.5 కోట్ల విలువైన స్థలం కబ్జాకు యత్నం

రెండు కాలనీల మధ్య ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన రూ.5 కోట్ల విలువైన స్థలాన్ని కొందరు వ్యక్తులు అధికార పార్టీ నేతల అండదండలతో కబ్జాకు యత్నిస్తున్నారని కాలనీవాసులు టౌన్‌ప్లానింగ్‌, పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని తాము కొనుగోలు చేశామంటూ నిర్మాణాలకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో కాలనీవాసులు ప్రజాప్రతినిధులతో పాటు మీడియాను ఆశ్రయించారు. 


వివరాల్లోకి వెళ్తే.. హఫీజ్‌పేట గ్రామ సర్వేనెంబర్‌ 78 గోకుల్‌ప్లాట్స్‌, హైదర్‌నగర్‌ గ్రామసర్వేనెంబర్‌ 145లోని భగత్‌సింగ్‌కాలనీల మధ్య 500 గజాల స్థలం ఉంది. తమ కాలనీ నుంచి బయటకు వెళ్లడానికి రోడ్డు కోసం కేటాయించామని గోకుల్‌ప్లాట్స్‌ వాసులు చెబుతుండగా, భగత్‌సింగ్‌కాలనీ వాసులు స్థలాన్ని స్కూల్‌ నిర్మాణం కోసం కేటాయించామని చెబుతున్నారు. రెండుకాలనీల మధ్య ఉన్న వివాదాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అధికారపార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో రూ.5కోట్ల విలువైన 500 గజాల స్థలాన్ని కబ్జాచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ గదులు కూడా నిర్మించారు. కాలనీవాసులు ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గదులను కూల్చివేశారు. ఆ స్థలాన్ని కాపాడాలని భగత్‌సింగ్‌నగర్‌ వాసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉండగానే కొందరు వ్యక్తులు అక్కడ గుడిసెలు వేసేందుకు ప్రయత్నిస్తుండడంతో రెండుకాలనీ వాసులు మీడియా ముందుకు వచ్చారు. ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడాలని అధికారులను కోరారు.

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...