నేతలు.. ఎక్కడో?

ABN , First Publish Date - 2021-05-18T06:24:23+05:30 IST

ప్రజల కోసం.. ప్రజా సేవ కోసమే మేము పదవులు పొందాం. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునేందుకు ముందుంటాం. వారిని ఆదుకుంటాం. సాయం చేస్తాం. అని చిన్న కార్యకర్త నుంచి పెద్ద నేత వరకు ప్రకటిస్తూ ఉంటారు.

నేతలు.. ఎక్కడో?

కరోనా కష్టకాలంలో కనపడని నేతలు 

నేనున్నానని భరోసా ఇవ్వని నాయకులు

నాడు వైరస్‌ విస్తృతంగా ఉన్నా ఎన్నికల ప్రచారం

ప్రస్తుతం ముంచేస్తోన్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు


(ఆంధ్రజ్యోతి - గుంటూరు)

ప్రజల కోసం.. ప్రజా సేవ కోసమే మేము పదవులు పొందాం. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునేందుకు ముందుంటాం. వారిని ఆదుకుంటాం. సాయం చేస్తాం. అని చిన్న కార్యకర్త నుంచి పెద్ద నేత వరకు ప్రకటిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి ముంచేస్తున్నా.. ప్రజలు ప్రాణాభీతితో అల్లాడుతున్నా.. కరోనా కర్ఫ్యూతో కష్టాలు పడుతున్నా.. సామాన్యులు, పేదల గోడు ఆలకించే నాథుడే కానరావడంలేదు. నేనున్నాను అని ముందుకు వచ్చే నేతలే కనిపించడంలేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి కోల్పోయిన పేదలకు అండగా ఉండాల్సిన  ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఎక్కడా కానరావడం లేదు. ఇప్పట్లో ఎటువంటి ఎన్నికలు లేవని అందువల్లే సహాయ కార్యక్రమాలను విమర్మిస్తున్నారని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. గతేడాది దాతలు స్వచ్ఛందంగా పండ్లు, కూరగాయాలు, నిత్యావసర సరుకులు, మాస్క్‌లను సైతం అందజేశారు. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూతో పేద, మధ్యతరగతి వర్గాలు, కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.  

నాడు వద్దన్నా పరుగులు..  

సరిగ్గా ఏడాది క్రితం కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదువుతున్న సమయంలో నగరంలోని వివిధ పార్టీల నేతలు కాలనీ, బస్తీ అన్న తేడా లేకుండా ఇంటింటికి తిరిగారు. తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ వివిధ సేవ కార్యక్రమాలను పోటీ పడి మరీ నిర్వహించారు. నాడు కార్పొరేటర్‌గా బరిలో నిలిచిన, కార్పొరేటర్‌ టిక్కెట్లు ఆశించిన నాయకులను మా కాలనీలకు రావొద్దు మహాప్రభో అని పలు ప్రాంతాల్లో పౌరులు  విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సేవా కార్యక్రమాల పేరుతో పెద్దఎత్తున గుమికూడుతున్నారని ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. చివరికి తాము పంపిణీ చేయదలుచుకున్న సరుకులను జిల్లా అధికారులకు అందిస్తే వారు ఇస్తారంటూ ప్రభుత్వం నిబంధన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికలు అయిపోయాయి.

నేడు ఎదురుచూస్తున్నా స్పందన కరువు

ప్రమాణ స్వీకారం ముగిసింది.. ప్రస్తుతం ప్రజలు కరోనాతో, దానిని నియంత్రించటంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో చాలా మంది ఉపాధి కోల్పొయి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అలాంటి వారివైపు చూసే నేతలే కరువయ్యారు. పది నెలల క్రితం అన్నీ మరిచి ప్రజల ఇళ్ల చుట్టూ తిరిగిన నేతలు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని పలువురు విమర్శిస్తున్నారు. అంటే అప్పుడు ఓట్లు అవసరం కాబట్టి తిరిగారని ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు కాబట్టి పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటేశాక మేమింతే అన్నట్లుగా నగరంలో మెజార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని నగరవాసులు అంటున్నారు. మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ, విపత్తుల్లో సహాయక చర్యల విషయంలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌  పాత్ర కీలకం. జీఎంసీకి ఎన్నికైన  సభ్యులుగా ఉన్న కార్పొరేటర్లకు మరింత బాధ్యత ఉంటుంది. కానీ నగరంలోని మెజార్టీ కార్పొరేటర్లు వైరస్‌ విజృంభణ వేళ ప్రజలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్న దాఖలాలు లేవు. లక్షణాలున్న వారికి టెస్టులు చేయించడం, బాధితుల పరిస్థితిని బట్టి ఆసుత్రుల్లో బెడ్‌ సమకూర్చడం, వైరస్‌ బారిన పడిన పేదలకు బలవర్థక ఆహారం అందేలా చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి.  చాలా ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు, మానవతా ధృక్పథం కలిగిన వ్యక్తులు ఆపత్కాలంలో ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ మెజార్టీ నేతలు మాత్రం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండటలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.  

Updated Date - 2021-05-18T06:24:23+05:30 IST