Abn logo
Sep 17 2021 @ 00:38AM

జిల్లాలో పార్టీల సందడి

 - టీఆర్‌ఎస్‌లో సంస్థాగత కమిటీల ఏర్పాటు

- కాంగ్రెస్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలు 

- బీజేపీలో అమిత్‌షా జోష్‌

జగిత్యాల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): శాసనసభ సాధారణ ఎన్నికలకు రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ ముందుగానే జగిత్యాల జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. రాజకీయ పార్టీల్లో ఎన్నికల కోలాహలం మురిపించే విధంగా పరిస్థితి మారింది. టీఆర్‌ఎస్‌లో వార్డు, గ్రామ, మండల, డివిజన్‌, జిల్లా కమిటీల నియామకంతో సందడి నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభల సందడి చోటుచేసుకుంది. బీజేపీలో కేంద్ర అగ్రనేత, హోం శాఖ మంత్రి అమిత్‌ షా నిర్మల్‌ పర్యటనకు రానుండడంతో సభకు జనసమీకరణలో కమలనాథులు బిజీబిజీగా ఉన్నారు. దీంతో జిల్లాలోని ప్రధాన పార్టీలైన  టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ కనిపిస్తోంది.

సంస్థాగతంపై గులాబీ దళం దృష్టి

జిల్లాలోని 380 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలు. 18 మండలాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. గులాబీ నేతలు పావులు కదుపుతూ పదవులు దక్కించుకోవడంపై దృష్టి సారించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ దాదాపుగా ఆరేళ్ల తదుపరి వార్డు, గ్రామ, మండల, జిల్లా కమిటీలను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తుండడంతో టీఆర్‌ఎస్‌లో రాజకీయాలు వేడెకుతున్నాయి. వచ్చే విజయ దశమి నాటికి టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుని నియామకం పూర్తి చేయాలన్న సంకల్పంతో పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. పలు చోట్ల గ్రామ, మండల, పట్టణ, డివిజన్‌ కమిటీ నియా మకాలు చేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లో పదవుల పందేరం హడావిడి కనిపిస్తోంది. ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పదవుల పంపకాలపై బిజీబిజీగా ఉన్నారు. ఈ నెల 20వ తేదీలోగా మండల కమిటీలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ నేతలు పనిచేస్తున్నారు. జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవిపై పలువురు నేతలు దృష్టి సారించారు. జిల్లా అధ్యక్ష పదవి రేసులో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలతో పాటు చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన పలువురి పేర్లు చర్చల్లోకి వస్తున్నాయి. అయితే మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆశీస్సులున్న వారికే పదవిదక్కుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

బీజేపీలో అమిత్‌ ‘షో’ జోష్‌

నిర్మల్‌కు కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ఈనెల 17వ తేదీన రానున్న నేపథ్యంలో కమలనాథుల్లో కొత్త జోష్‌ నెలకొంది. అమిత్‌ షా పర్యటనను విజయవంతం చేయడంలో భాగంగా జిల్లాలో భారీ సంఖ్యలో జన సమీకరణ చేయడంపై కమలనాథులు దృష్టి సారించారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఆదేశాల మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ నిర్మల్‌ అమిత్‌ షా సభకు జన సమీకరణ చేసే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి సుమారు 20 వేల మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనాన్ని సమీకరించే పనుల్లో బీజేపీ శ్రేణులు మునిగాయి.  

కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం

జిల్లాలోని పలు గ్రామాల్లో దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభలను నిర్వహిస్తూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోర సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాలతో పాటు చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, వెల్గటూరు, వేములవాడ నియోజక వర్గంలోని కథలాపూర్‌, మేడిపల్లి మండలాల నుంచి జనాన్ని తరలిం చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ నేతృత్వంలో ఇప్పటికే గ్రామ, మండల స్థాయిల్లో పలు ప్రాంతాల్లో దళిత, గిరిజన ఆత్మవ గౌరవ దండోర సభలు నిర్వహిం చారు. పల్లెనిద్ర కార్యక్రమాలను చేపడుతున్నారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర సభలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త జోష్‌ వచ్చింది. ఆయా నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు దండోరా సభల్లో పాల్గొంటూ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు.