కార్యకర్తలకు ‘ఉపాధి’

ABN , First Publish Date - 2021-08-02T06:13:10+05:30 IST

రాజకీయ సిఫారసు ఉన్నవారికే ఉపాధి ‘హామీ’ లభిస్తోంది.

కార్యకర్తలకు ‘ఉపాధి’

రాజకీయ సిఫారసులతో జాబ్‌కార్డులు

ఫీల్డ్‌ అసిస్టెంట్లతో లాలూచీ..  

పనిచేయకపోయినా మస్తర్‌ 

ప్రతిగా కూలిలో సగం ఫీల్డ్‌ అసిస్టెంట్లకు 

పనులు చేసేవారిపై ఒత్తిళ్లు.. 


రాజకీయ సిఫారసు ఉన్నవారికే ఉపాధి ‘హామీ’ లభిస్తోంది. ప్రజాప్రతినిధుల రికమండేషన్‌తో అధికార పార్టీ కార్యకర్తలు కొందరు జాబ్‌ కార్డులను సొంతం చేసుకుంటున్నారు. పనిచేయకపోయినా వీరికి ఫీల్డ్‌ అసిస్టెంట్లు మస్తరు వేస్తారు. ఇంటికెళ్లి మరీ వేతనం ఇస్తారు. అయితే ఇందుకు గాను ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ వాటాగా అందులో సగం అందుకుంటారు. జిల్లాలో ఇటువంటి ‘ఉపాధి’ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వీరి కారణంగా అర్హులైన వారు ఈ పథకానికి దూరం అవుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉపాధి హామీ పథకం క్షేత్ర స్థాయులో నీరుగారిపోతోంది. నిరుపేద, అల్పాదాయ వర్గాలకు ఉపాధి పనులు చూపించాల్సింది పోయి.. బినామీల నుంచి అందినకాడికి దండుకునే పథకంగా మారిపోయింది. జిల్లాలో పనులు చేయించాల్సిన ఫీల్ట్‌ అసిస్టెంట్లు అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు. పలు చోట్ల జాబ్‌కార్డులను కలిగిన వారి నుంచి కూలీని పంచుకుంటున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లలో అవినీతి పెరిగిపోవడానికి కొంతకాలంగా అధికార పార్టీ సిఫార్సుల కనుగుణంగా కార్యకర్తలు జాబ్‌ కార్డులను పొందటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాజకీయ సిఫార్సులతో జాబ్‌కార్డులు పొందిన వారు ఉపాధి పనులకు వెళ్లటం లేదు. ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో ఉపాధి పనులను పర్యవేక్షించాల్సిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు రాజకీయ సిఫార్సులతో వచ్చిన వారికి పనులకు రాకపోయినా మస్తరు ఇస్తున్నారు. మస్తరు ఇవ్వకపోతే స్థానిక ప్రజాప్రతినిధులకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే నెల మొత్తం పనికి రాకపోయినా వచ్చినట్టు మస్తరు ఇచ్చేస్తున్నారు. నెల పూర్తికాగానే పని చేసినట్టు వారింటికి వెళ్లి సంతకాల్లాంటి ఫార్మాలిటీస్‌ పూర్తి చేస్తున్నారు. ఇందుకు ప్రతిగా వచ్చిన కూలిలో సగం తాము తీసుకుని, మిగిలిన సగం జాబ్‌ కార్డులున్న వారికి చెల్లిస్తున్నారు.. జాబ్‌కార్డు ఉంటే పర్మినెంట్‌ ఆదాయ వనరుగా ఉంటుంది కాబట్టి వారు కూడా ఫీల్డ్‌ అసిస్టెంట్లతో మిలాఖత్‌ అవుతున్నారు. ఇలాంటి వ్యవహారాలు గన్నవరం మండలంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనులకు రాని జాబ్‌కార్డుదారుల ఇంటి దగ్గరకు వెళ్లి మస్తరు ఇచ్చి, వారి నుంచి సగం వేతనం తీసుకుంటున్నారు. కంకిపాడు, ఆగిరిపల్లి, పెనమలూరు, మైలవరం, ఉయ్యూరు, కోడూరు, చల్లపల్లి, జగ్గయ్యపేట, నూజివీడు, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాల పరిధిలో ఈ తరహా బినామీ కేసులు చాలా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులు రాజకీయ కార్యకర్తలకు అందటంతో అర్హులైన ఎంతో మంది పేదలకు ఈ పథకం అందటం లేదు. కరోనా మొదటి, రెండు దశల తర్వాత పేద , మధ్యతరగతి వర్గాల జీవనం భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పనులు దొరకటం దుర్లభంగా మారింది. ఉపాధి హామీ పథకం కింద పనులు దొరుకుతాయనుకుంటే రాజకీయ సిఫార్సులు ఉంటేనే అధికారులు జాబ్‌కార్డులను జారీ చేస్తున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల అవినీతి దాహానికి  సహకరించేవారికే పథకం అన్నట్టు మారింది. చివరికి నిరంతరం ఉపాధి పనులకు వచే ్చ జాబ్‌కార్డుదారులపైనా ఫీల్డ్‌ అసిస్టెంట్ల కన్ను పడింది. వారిపై ఒత్తిళ్లు పెంచుతూ పొమ్మనకుండా పొగబెట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వీరిని సాగనంపితే ఆ స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించి, వారి నుంచి సగం కూలీ వసూలు చేసుకోవచ్చుననే ఆలోచనలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉండటం గమనార్హం. 

Updated Date - 2021-08-02T06:13:10+05:30 IST