Abn logo
Sep 23 2021 @ 01:33AM

బడుల్లోనూ రాజకీయ రగడ

గణపవరంలో పోలీసుల సమక్షంలో ఘర్షణ పడుతున్న ఎస్‌పీఎంసీ సభ్యులు

రసవత్తరంగా తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు

పలుచోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతలు

పలువురికి గాయాలు, పోలీసుల రంగప్రవేశం

202 పాఠశాలల్లో నిలిచిన ప్రక్రియ 

850 చోట్ల  ఏకగ్రీవాలు 

9 మండలాల్లో మాత్రమే పూర్తి 

త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్నికల సందర్భంగా వైసీపీలోని రెండువర్గాలు ఘర్షణపడి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని పికెట్‌ ఏర్పాటు చేశారు. గణపవరంలో జడ్పీ పాఠశాలలో ఇరువర్గాలు తలపడ్డాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసినా ఉద్రిక్తత తగ్గకపోవడంతో ఎన్నికలను వాయిదా వేశారు.

జె.పంగులూరు మండలం కొండముంజులూరులో పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక విషయంలో ఉద్రిక్తత నెలకొంది. జడ్పీ హైస్కూల్‌లో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.  

మార్టూరు మండలం కోలలపూడిలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా విజయం కోసం ప్రయత్నాలు చేశారు. ఓటుకు రూ.5వేల దాకా రేటు కట్టి కొన్ని ఓట్లను రెండు గ్రూపుల వారు కొనుగోలు చేసినట్లు సమాచారం. 

హెచ్‌ఎం పాడులో ఎస్‌ఎంసీ ఎన్నికల్లో గొడవలు జరిగాయి. ప్రాథమిక పాఠశాలలో అఽధికార పార్టీ వారికి మద్దతు లేకపోవడంతో గొడవకు దిగారు. ఈ సమయంలో ఇరువర్గాలు ఎన్నిక ప్రాంగణంలోకి రావడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. వాలిచర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

ఇదీ జిల్లాలో బుధవారం జరిగిన పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల రగడ.  ప్రభుత్వం పాఠశాలల ద్వారా భావిపౌరులను తీర్చిదిద్దాల్సి ఉండగా  అక్కడ కూడా రాజకీయ రంగు పులిమింది. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఎస్‌పీఎంసీ ఎన్నికలు జరిగేలా వ్యవహరించింది. ఒకట్రెండు చోట్ల ఓటుకు నోటు కూడా ఇచ్చారు. పలుచోట్ల అధికారపార్టీ దౌర్జన్యం కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. 

ఒంగోలు విద్య, సెప్టెంబరు 22: తల్లిదండ్రుల కమిటీల ఎన్నికల్లోనూ వైసీపీ నేతల దాష్టీకం కొనసాగింది. అనేక చోట్ల దౌర్జన్యాలకు దిగారు. వైసీపీయేతర పార్టీల అభిమానులు గెలిచే అవకాశం ఉన్న చోట్ల ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలు నిలిపివేయించారు. కొన్నిచోట్ల అధికార పార్టీలోని వైరివర్గాల వారు ఘర్షణ  పడ్డారు. మొత్తంమీద  202 విద్యాసంస్థల్లో ఎన్నికలను ఉపాధ్యాయులు వాయిదా వేశారు. తొమ్మిది మండలాల్లో మాత్రమే నూరుశాతం పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని ఎయిడెడ్‌ పాఠశాలల్లో నిర్వహించేందుకు కరస్పాండెంట్లు ఆసక్తి చూపకపోవడంతో అక్కడ జరగలేదు. చీరాలలో అత్యధికంగా 13 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించలేదు.  


3,291 స్కూళ్లకు ఎన్నికల నోటిఫికేషన్‌ 

జిల్లాలో వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3,291 పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి తరగతికి ముగ్గురు చొప్పున, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో 15 మంది సభ్యులు చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 28మంది సభ్యులను ఎన్నుకుంటారు. వీరిలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకుంటారు. మిగిలిన వారు సభ్యులుగా వ్యవహరిస్తారు. 15 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. 850 పాఠశాలల్లో  తల్లిదండ్రుల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోరం లేని కారణంగా 202 పాఠశాలల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. 


నాడు-నేడుతో ప్రతిష్టాత్మకం 

తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలను ఈసారి గ్రామాల్లోని పార్టీలు, వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం కింద భారీవ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పనులను తల్లిదండ్రుల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న  నేపథ్యంలో ఈసారి ఈ కమిటీల ఎన్నికలకు డిమాండ్‌ పెరిగింది. ఎయిడెడ్‌ పాఠశాలల విషయంలో వాటిని ప్రభుత్వలో విలీనం చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పాఠశాలల కరస్పాండెంట్లు ఎన్నికల నిర్వహణకు ముందుకు రాకపోవడంతో ఆ  వాటిలో ఎన్నిక నిలిచింది. మొత్తం 202 పాఠశాలల్లో ఎన్నికలు నిలిచిపోగా వీటిలో 161 ప్రభుత్వ పాఠశాలు కాగా 41 ఎయిడెడ్‌ స్కూళ్లు. చీరాల మండలంలో అత్యధికంగా 13, వైపాలెం, హెచ్‌ఎంపాడు మండలాల్లో 11 చొప్పున, గిద్దలూరు, పుల్లలచెరువు మండలాల్లో 10  చొప్పున ఉన్నాయి. త్రిపురాంతకంలో 9, ముండ్లమూరు, పెద్దారవీడులో 7, అర్థవీడు, బల్లికువర, బేస్తవారిపేట, పర్చూరు, మర్రిపూడిల్లో 6 పాఠశాలలు చొప్పున నిలిచిపోయాయి. అలాగే కంభం, దర్శి, దొనకొండ, వీవీపాలెం, సింగరాయకొండలో 5 చొప్పున, టంగుటూరులో 4, అద్దంకి, సీఎస్‌పురం మండలాల్లో 3 చొప్పున, మరికొన్ని మండలాల్లో 1, 2, 3 పాఠశాలల్లో ఎన్నికలు ఆగిపోయాయి. 


ఊళ్లపాలెంలో ఉద్రిక్తత

శింగరాయకొండ మండలం ఊళ్లపాలెం హైస్కూల్లో వైసీపీలోని ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. కర్రలు, రాళ్లతో సరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాల య్యాయి. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నా అదుపు చేయలేక ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.


ఊళ్లపాలెం ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న్ల రామిరెడ్డి