నడిరోడ్డుపై ‘షో’

ABN , First Publish Date - 2021-01-21T07:04:29+05:30 IST

నగరంలోని వాహనదారులు బుధవారం ఐదు గంటలపాటు రహదారులపై ప్రత్యక్ష నరకం చూశారు.

నడిరోడ్డుపై ‘షో’
రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్‌ పొడవునా బుధవారం రాత్రి స్తంభించిన ట్రాఫిక్‌

నగరవాసులకు నరకం!

నేడు బెంజ్‌సర్కిల్‌ వద్ద రేషన్‌ వాహనాల ప్రారంభం

నగరంలో ఐదు గంటలపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

ముందుగానే బందర్‌ రోడ్డు బంద్‌

ఒక రోజు ముందే నరకం చూసిన నగరవాసులు

నగరం నడిబొడ్డున రాజకీయ ‘షో’లు 

గత ప్రభుత్వం నుంచీ ఇదే తంతు


బెంజ్‌సర్కిల్‌.. విజయవాడలో అతి ప్రధానమైన కూడలి. ఇక్కడ ట్రాఫిక్‌కు బ్రేక్‌ పడితే నగరమంతటా వాహనదారులు నరకం చూస్తారు. ఈ ప్రభావం జాతీయరహదారిపై కూడా పడుతుంది. ఇది తెలిసి కూడా రాజకీయ పార్టీలు తమ ‘షో’లకు బెంజ్‌సర్కిల్‌నే వేదికగా చేసుకుంటుండటంతో నగరవాసులకు ట్రాఫిక్‌ కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. 


విజయవాడ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని వాహనదారులు బుధవారం ఐదు గంటలపాటు రహదారులపై ప్రత్యక్ష నరకం చూశారు. ఈ నరకం గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెడుతున్న రేషన్‌ పంపిణీ వాహనాలను గురువారం ఉదయం ముఖ్యమంత్రి జగన్‌ ఇక్కడి నుంచి ప్రారంభించనుండడమే ఇందుకు కారణం.


వేదికలెన్ని ఉన్నా..

విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఎన్నో వేదికలున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, స్వరాజ్యమైదానం వంటి సువిశాల స్థలాలున్నా, అక్కడ కాకుండా అటు జాతీయరహదారికి.. ఇటు నగరంలోని ప్రధాన రహదారులకు కూడలి అయిన బెంజ్‌సర్కిల్‌ను తమ రాజకీయ ‘షో’లకు వేదికగా చేసుకోవడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనూ నవనిర్మాణదీక్ష పేరుతో ఇక్కడే కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా వైసీపీ సర్కార్‌ సైతం పెద్ద కార్యక్రమాలకు తరచూ బెంజ్‌సర్కిల్‌నే వేదికగా చేసుకుంటోంది. కొద్ది నెలల క్రితం 108, 104 వాహనాలను ఇక్కడి నుంచే సీఎం జగన్‌ ప్రారంభించారు. తాజాగా రేషన్‌ పంపిణీ వాహనాలను కూడా గురువారం ఉదయం ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. 


సీఎం వంటి వీఐపీలు హాజరవుతున్న కార్యక్రమాలను ఇంత రద్దీ కూడలిలో ఏర్పాటు చేస్తుండటంతో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ, సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ కూడలి మీదుగా రెండు జాతీయ రహదారులు వెళుతున్నాయి. దీనికి తోడు అంతర్గతంగా నగరంలోనే రద్దీ కూడళ్లలో మొదటిది. ఈ కూడలి మీదుగా నిత్యం 30 నుంచి 40వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అలాంటి కీలకమైన కూడలిలో ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో రాజకీయ పార్టీలు ‘షో’లు చేయడం విమర్శలకు తావిస్తోంది. 


ట్రాఫిక్‌ ఆంక్షలతో పెరగనున్న కష్టాలు

తాజాగా సీఎం కార్యక్రమం నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచే ఎంజీరోడ్డులో ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. పైగా వేదిక ఏర్పాటు, ట్రయల్‌ రన్‌ పేరుతో బుధవారం పోలీసుల హడావిడితో సుమారు ఐదు గంటలకుపైగా నగరవాసులు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంజ్‌సర్కిల్‌ వద్ద కార్యక్రమం కారణంగా ఎంజీ రోడ్డు పొడవునా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. ఫలితంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాలి. జాతీయ రహదారి మీదుగా వచ్చే భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తుండటంతో అక్కడ ట్రాఫిక్‌ స్తంభించిపోతుంది. ఫలితంగా గురువారం నగరవాసులకు రోడ్డుపై ప్రత్యక్ష నరకం కనిపించనుంది. నగరంలో ఇప్పటికే ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని చెబుతున్న పోలీసులు అందుకు తగిన ప్రణాళికలను తయారు చేసుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-01-21T07:04:29+05:30 IST