రాజకీయ దుమారం

ABN , First Publish Date - 2021-01-11T05:07:34+05:30 IST

పరిగి పురపాలక సంఘంలో పాలక, విపక్ష కౌన్సిల్‌ సభ్యుల మధ్య ఆరోపణలు,

రాజకీయ దుమారం

  • పరిగి మునిసిపాలిటీలో పాలక, విపక్ష సభ్యుల మధ్య రగడ

పరిగి: పరిగి పురపాలక సంఘంలో పాలక, విపక్ష కౌన్సిల్‌ సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ యుద్ధంగా మారింది. పరిగి మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగి దాదాపుగా ఏడాది కావొస్తుంది. మునిసిపాలిటీలోని పాలనకు సంబంధించిన అంశా లపై టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ కౌన్సిలర్ల మధ్య ఒకరిపైఒకరు చోటుచేసుకుంటున్న ఆరోపణలు తారాస్థాయికి చేరు కున్నాయి. పరిగి మునిసిపాలిటీలో 15వార్డులుండగా.. ఇందులో తొమ్మిది మంది టీఆర్‌ఎస్‌, ఆరుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు విజయం సాధించిన సంగతి విధితమే. అనంతరం ఇద్దరు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరగా కాంగ్రెస్‌లో నలుగురు సభ్యులుగా మాత్రమే మిగిలారు. మునిసిపల్‌ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల కేటాయింపులో విపక్ష సభ్యులపై వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్‌ సభ్యులు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధుల మాట అటుంచితే.. అన్నిపార్టీల సభ్యులకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన కమిషనర్‌ కూడా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యులు జిల్లా కలెక్టర్‌, మునిసిపల్‌ శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల పరిగికి వచ్చిన జిల్లా కలెక్టర్‌ ఎదుటే కమిషనర్‌ వ్యవహారం తీరుపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. మునిసిపల్‌లో రచ్చరెక్కిన రాజకీయాలు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేసుకునే స్థాయికి చేరాయి. ప్రెస్‌మీట్లు పెట్టి ఒకరిపైఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో పట్టణ రాజకీయాలు వేడెక్కాయి. వీరు ఏకంగా బూతులు తిట్టుకునే స్థాయికి చేరడంతో పట్టణ ప్రజలు విస్తుపోతున్నారు. అభివృద్ధి చేసి, సమస్యలు పరిష్కరిస్తారని ఓట్లు వేసి గెలిపిస్తే.. వీరేమో కొట్టుకోవడమే సరిపోతుందని గుసగులలాడుకుంటున్నారు. పత్రికల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా అసభ్యకరంగా పోస్టింగ్‌లు చేసుకోవడంతో ఇవేం రాజకీయాలు అని చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా నేరుగా ఫోన్‌లలో బూతుపురాణాలతో దాడులు చేస్తూ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఏదిఏమైనా ఇరు పార్టీల కౌన్సిలర్లు, నాయకులు ప్రజల సమస్యలను గాలికొదిలి వ్యక్తిగత ప్రయోజనాల కోసం దూషణలు చేసుకోవడం ఏమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ రాజకీయ యుద్ధం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.

Updated Date - 2021-01-11T05:07:34+05:30 IST