రాజకీయ వికృత ‘క్రీడ’

ABN , First Publish Date - 2021-08-13T07:28:04+05:30 IST

పుంగనూరు నియోజకవర్గంలో..

రాజకీయ వికృత ‘క్రీడ’
క్రికెట్‌ పోటీలను నిలిపివేయాలంటూ క్రీడాకారులకు నచ్చజెబుతున్న రామచంద్రయాదవ్‌

పెద్దపంజాణిలో క్రికెట్‌ పోటీలు స్పాన్సర్‌ చేసిన రామచంద్ర యాదవ్‌

ప్రారంభించిన పోలీసు అధికారికి తలంటిన ఉన్నతాధికారులు

కేసులు పెడతామంటూ క్రీడాకారులకు బెదిరింపులు

యువతను ఇబ్బంది పెట్టలేక అర్థాంతరంగా పోటీలు ఆపేసిన యాదవ్‌


తిరుపతి(ఆంధ్రజ్యోతి): పుంగనూరు నియోజకవర్గంలో ఇంతకాలం సాగిన రాజకీయ వికృత క్రీడ ఇపుడు పొరుగు నియోజకవర్గానికీ పాకింది. జనసేన పార్టీ మాజీ నేత, పారిశ్రామికవేత్త బి.రామచంద్రయాదవ్‌ పుంగనూరు నియోజకవర్గంలో తన సేవా కార్యక్రమాలకు రాజకీయ అడ్డంకులు ఎదురవుతుండడంతో పక్క నియోజకర్గమైన పలమనేరు పరిధిలో క్రికెట్‌ పోటీలు స్పాన్సర్‌ చేయగా అక్కడా అదే పరిస్థితులు ఎదురయ్యాయి. పుంగనూరు నుంచీ కిందటి ఎన్నికల్లో జనసేన తరపున అసెంబ్లీకి పోటీ చేసిన రామచంద్రయాదవ్‌ పేరిట ఏర్పాటైన యువసేన పెద్దపంజాణి మండలం బట్టందొడ్డి గ్రామంలో టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. బుధవారం నుంచీ శనివారం వరకూ ఈ టోర్నమెంట్‌ జరగాల్సి వుండగా పోటీలు కేవలం పెద్దపంజాణి మండలంలోని క్రీడాకారులకు మాత్రమేనంటూ పరిమితి కూడా విధించుకున్నారు. ప్రథమ బహుమతి కింద రూ. 50 వేలు, ద్వితీయ బహుమతి కింద రూ. 30 వేలు ప్రకటించారు.


పలమనేరు డీఎస్పీ, రూరల్‌ సీఐలకు సమాచారం ఇవ్వడంతో పాటు వారిని కూడా పోటీల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. భారీగా నగదు బహుమతులు వుండడంతో 11న బుధవారం యువత ఉత్సాహంగా పోటీలకు హాజరైంది. ఆ చిన్న మండలం నుంచీ ఏకంగా 45 క్రికెట్‌ టీములు పోటీల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేయించుకున్నాయి. పోటీలను కొత్తగా వచ్చిన ఓ కిందిస్థాయి అధికారి ప్రారంభించారు. రాజకీయ రంగు పులుముతారనే ఆలోచనతో రామచంద్రయాదవ్‌ ఈ కార్యక్రమానికి దూరంగా వుండిపోయారు. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచీ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. పోటీలను ప్రారంభించిన పోలీసు అధికారికి ఉన్నతాధికారుల నుంచీ తీవ్రస్థాయిలో మందలింపులు ఎదురయ్యాయి. అక్కడి పరిస్థితులూ, స్పాన్సర్‌ చేసిన వారి నేపధ్యం తెలియని ఆ అధికారి తలపట్టుకున్నారు. మరోవైపు కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా పోటీలు ఎలా నిర్వహిస్తారంటూ నిర్వాహకులను, పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన యువతను పోలీసులు బెదిరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.


పోటీలు తక్షణం ఆపేయాలని, లేదంటే కొవిడ్‌ నిబంధనల కింద క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్టు చేస్తామంటూ బెదిరింపులు రావడంతో సమాచారం తెలుసుకున్న రామచంద్రయాదవ్‌ గురువారం బట్టందొడ్డికి చేరుకున్నారు. తన కారణంగా యువత ఇబ్బందుల పాలు కావడం ఇష్టం లేదని వారికి నచ్చజెప్పి పోటీలను అర్ధాంతరంగా ఆపేయించారు. క్రీడాకారులు నిరుత్సాహానికి గురి కాకుండా పోటీల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేయించుకున్న ప్రతి జట్టుకూ నగదు, టీ షర్టులు, క్రికెట్‌ కిట్లను అందజేశారు. ఈ పరిణామాలు పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.


గతంలోనూ యాదవ్‌ సేవలకు అడ్డంకులు

గత ఎన్నికల్లో పుంగనూరు నుంచీ ఓటమి చెందినప్పటికీ రామచంద్రయాదవ్‌ ఆ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు మాత్రం కొనసాగిస్తూనే వున్నారు. అయితే ఆయన వాటిని చేపట్టిన ప్రతి సందర్భంలోనూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళతో పోలీసుల నుంచీ అడ్డంకులు ఎదురవుతుండడం గమనార్హం. గతేడాది సంక్రాంతి సందర్భంగా అన్ని మండలాల్లో బట్టల పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నారు. బెంగుళూరు నుంచీ వాహనాల్లో కొత్త బట్టలు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకుని వాటిని సీజ్‌ చేయడంతో పాటు కేసులు కూడా పెట్టారు. కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీసులు, వైద్య శాఖ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు నగదు, సాధారణ ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు వంటివి పంపిణీ చేసేందుకు యత్నించగా అప్పుడు కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. చివరికి రక్తదాన శిబిరాన్ని కూడా అడ్డుకోవడం విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామాలతో విసిగివేసారిపోయిన రామచంద్రయాదవ్‌ క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరమయ్యారు.


ఈ పరిస్థితుల్లో పొరుగు నియోజకవర్గంలో తాను చేపట్టే సేవా కార్యక్రమాలను కూడా అడ్డుకుంటున్నారని రామచంద్రయాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆయన ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో మాట్లాడుతూ యువతను క్రీడలవైపు ప్రోత్సహించే ఉద్దేశంతో క్రికెట్‌ పోటీల నిర్వహణకు ప్రయత్నించామన్నారు. రాజకీయాలు అంటగడతారనే ఉద్దేశంతోనే తాను పోటీలకూ దూరంగా వున్నానని, ప్రారంభోత్సవానికి కూడా హాజరు కాలేదని వివరించారు. పోటీల విషయాన్ని యువత పోలీసు అధికారులకు సమాచారమివ్వడంతో పాటు వారిని కూడా ఆహ్వానించారని వివరించారు. కొవిడ్‌ నిబంధనల గురించి అప్పుడేమీ అభ్యంతరపెట్టని అధికారులు తీరా పోటీలు నిర్వహిస్తున్నది తానని తెలిశాక అడ్డుకోవడం దారుణమన్నారు. క్రీడలకు రాజకీయాలతో ముడిపెట్టడం దుర్మార్గమన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారనే విషయం మరచిపోవద్దంటూ ఆయన హెచ్చరించారు.

Updated Date - 2021-08-13T07:28:04+05:30 IST