వెంకటగిరిలో వేడెక్కిన రాజకీయం

ABN , First Publish Date - 2021-03-01T04:07:33+05:30 IST

వెంకటగిరి పురపాలక సంఘం ఎన్నికలు ఆ ఇద్దరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వెంకటగిరిలోని 25 టీడీపీ, వైసీపీ పార్టీ అభ్యర్ధులతోపాటు కొన్నిటిలో జనసేన, బీజేపీ, సిపిఐ పార్టీల చెందిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్దులు కూడా నామినేషన్లు వేశారు.

వెంకటగిరిలో వేడెక్కిన రాజకీయం

  • టీడీపీ అభ్యర్ధులకు వైసీపీ ఎర 
  • ఏకగ్రీవాలకు వ్యూహం
  • క్యాంపునకు తరలిన టీడీపీ అభ్యర్థులు

వెంకటగిరి, పిబ్రవరి 28 వెంకటగిరి పురపాలక సంఘం ఎన్నికలు ఆ ఇద్దరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.  వెంకటగిరిలోని 25 టీడీపీ, వైసీపీ పార్టీ అభ్యర్ధులతోపాటు కొన్నిటిలో జనసేన, బీజేపీ, సిపిఐ పార్టీల చెందిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్దులు కూడా నామినేషన్లు వేశారు. దీంతో మార్చి 2,3 తేదీల్లోగా టీడీపీ అభ్యర్థ్దులను ఎలాగైనా పోటీలోంచి తప్పించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో టీడీపీ అభ్యర్థులతోపాటు, వారి ప్రతిపాదకులను మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల ఆదివారం క్యాంపునకు తరలించినట్లు తెలిసింది. అయితే ఒకటి రెండు వార్డుల్లోని అభ్యర్థులు క్యాంపునకు వెళ్లేందుకు అంగీకరించలేదని తెలిసింది. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం వెంకటగిరికి విచ్చేసి ముఖ్యమైన నేతలతో సమాలోచనలు చేశారు.  20 వార్డులో వైసీపీ అభ్యర్ధి నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో ఆ వార్డు వైసీపీకి ఏకగ్రీవం కానుంది. ఇక ఎమ్మెల్యే, ఎంఎల్‌సి ఓట్లతో కలిపి ఇప్పటికే మూడు ఓట్లు వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. 


చైర్‌పర్సన్‌ అభ్యర్ధిపై తొలగని ఉత్కంఠ

వైసీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎవరన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ చైర్‌పర్సన్‌ దొంతు శారదకు ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా హామీ ఇవ్వడంతో ఈ పదవి ఆమెనే వరిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఆనం మాత్రం అభ్యర్థి ఎవరన్నది వెల్లడించక పోవడంతో అటు పార్టీలోనూ ఇటు పట్టణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అందరూ ముందు గెలవండి తర్వాత చైర్‌పర్సన్‌ ఎవన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని ఎమ్మెల్యే చెప్పడంతో ఈ పదవిపై పలువురికి ఆశలు చిగురిస్తున్నాయి. 


టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మల్లీశ్వరేనా ? 

ఈ ఎన్నికల్లో టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా 15వ వార్డునుంచి పోటీచేస్తున్న మల్లీశ్వరి పేరును మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఉపసంహరణ తేదీ దగ్గర పడే కొద్దీ పుర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.


Updated Date - 2021-03-01T04:07:33+05:30 IST