వేడెక్కనున్న రాజకీయం

ABN , First Publish Date - 2022-10-01T04:40:45+05:30 IST

జిల్లాలో దసరా పండుగ తర్వాత రాజకీయం కార్యక్రమాల జోరు పెంచేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శాసనసభ నియోజకవర్గాల కేంద్రంగా అన్ని గ్రామాలను చుడుతూ పర్యటనలు చేసేందుకు సిద్ద్ధమవుతున్నారు.

వేడెక్కనున్న రాజకీయం

జిల్లాలో దసరా తర్వాత ఊపందుకోనున్న రాజకీయం

నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు

బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు 

పాదయాత్రలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో దసరా పండుగ తర్వాత రాజకీయం కార్యక్రమాల జోరు పెంచేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శాసనసభ నియోజకవర్గాల కేంద్రంగా అన్ని గ్రామాలను చుడుతూ పర్యటనలు చేసేందుకు సిద్ద్ధమవుతున్నారు. తమ మద్దతుదారులను కూడగడుతూనే పార్టీ క్యాడర్‌లతో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మరింత ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ప్రతిపక్ష పార్టీల నేతలు సమస్యలను అంశాలుగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు తామున్న పార్టీల టికెట్‌లు వస్తాయని ధీమాతో నియోజకవర్గాల్లో రెండు నుంచి మూడు నెలల వరకు ఉండేవిధంగా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పోటీ చేసేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

వనరుల సద్వినియోగానికి ఏర్పాట్లు

జిల్లాలో దసరా తర్వాత రాజకీయ కార్యక్రమాలు పెరగనున్నాయి. ఇప్పటికే గత కొన్ని నెలలుగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేతలు ఈ దఫా పోటీకి సిద్ధమై పూర్తిస్థాయిలో అన్ని వనరులను సద్వినియోగం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమకు సన్నిహితంగా ఉన్న నేతలు, సీనియర్‌ల సలహాలు స్వీకరిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన సంవత్సరకాలంగా నియోజకవర్గాల్లో తమకు దగ్గరగా ఉన్న ఏజెన్సీల ద్వారా సర్వేలు నిర్వహిస్తున్న పలు పార్టీల నేతలు దానిని బేస్‌గా చేసుకుని మరింత ముందుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు. తమకు పోటీగా ఉన్న నేతలను టార్గెట్‌గా చేస్తూ నియోజకవర్గంలో దూసుకువెళ్లే ప్రయత్నాలను మొదలుపెడుతున్నారు. రెండు నుంచి మూడు నెలల పాటు అన్ని గ్రామాలు కలియతిరుగుతూ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ దఫా మిస్‌ అయితే వచ్చే ఐదేళ్లలోపు మళ్లీ అవకాశం ఉండదని భావిస్తున్న నేతలంతా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తామున్న పార్టీల నుంచి టికెట్‌ దక్కకుంటే ఇతర పార్టీల నుంచి అయిన తెచ్చుకుని పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

నియోజకవర్గంపైనే దృష్టి

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కీలకం కావడంతో ఎమ్మెల్యేలంతా నియోజకవర్గంపైనే దృష్టిపెట్టి పనిచేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఆరు నియోజకవర్గాల పరిధిలో స్పీకర్‌, మంత్రి, ఎమ్మెల్యే లు కలియతిరుగుతున్నారు. నెలలో పదిహేను నుంచి 20 రోజుల పాటు నియోజకవర్గంలో ఉండేవిధంగా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు అన్ని రకాల సహాయ సహకారాలను తాము ఉంటే నియోజకవర్గ ప్రజలకు అందేవిధంగా చూస్తున్నారు. తాము నియోజకవర్గాల్లో లేకున్నా ఫోన్‌లలో అందుబాటులో ఉంటూ తమకున్న స్టాఫ్‌, నేతల ద్వారా కార్యాలయాలకు వచ్చేవారి పనులను చేసేవిధంగా చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులతో పాటు కొత్తగా మంజూరైన పింఛన్‌లను కూడా గ్రామాలు, మండలాల వారీగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి అందజేస్తున్నారు. దళితబంధు కూడా నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలో కొద్దిమందికి వచ్చేవిధంగా ఎంపికలకు సిద్ధమవుతున్నారు. ఈ నాలుగేళ్లలో మంజూరైన పనులన్నీ త్వరగా పూర్తిచేయడంతో పాటు కొత్త పనులకు అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాల వారీగా పరిశీలిస్తూ పెండింగ్‌ పనులను పూర్తిచేస్తున్నారు. వచ్చే ఎన్నికలు కీలకం కావడం, పోటీ ఎక్కువగా ప్రతిపక్షాల నుంచి ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎక్కడైనా అసంతృప్తులు ఉంటే ముందే గుర్తించి వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అధికార పార్టీకి దీటుగా..

జిల్లాలో అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నుంచేకాకుండా ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు గ్రామస్థాయి వరకు క్యాడర్‌ ఉండడంతో తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తునే ముందస్తుగా నియోజకవర్గాల్లో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో తమకు కొంతమేర ఓటు బ్యాంకు ఉండేవిధంగా చూసుకోవడంతో పాటు తమను బలపర్చే వారిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. జాతీయ పార్టీల నుంచి పోటీచేయనున్న ఈ నేతలు రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలతో టచ్‌లో ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఎదుర్కొనేందుకు కావాల్సిన అర్ధ అంగబలాలను సమకూర్చుకుంటూనే దసరా తర్వా త నియోజకవర్గాల్లో ఉండేవిధంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది నేతలు గ్రామాల వారీగా పాదయాత్రలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకునేలా మరికొంతమంది నేతలు సమస్యలపై కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ తమకు తామున్న కాంగ్రెస్‌, బీజేపీ నుంచి టికెట్‌లు చివరి నిమిషంలో మిస్‌ అయినా ఇతర పార్టీల నుం చి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా ఈ సంవత్సకాలంలో బలం పెంచుకునే ప్రయత్నాంలో ఉన్నారు. ఇప్పటికే ఆర్థిక వనరులను సమకూర్చుకున్న వీరు నియోజకవర్గంలో బలం పెంచుకునే కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. పలు కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2022-10-01T04:40:45+05:30 IST