పోలింగ్‌ డే

ABN , First Publish Date - 2021-04-06T08:49:18+05:30 IST

భారీ ర్యాలీలు, పెద్దఎత్తున రోడ్‌షోలు.. విమర్శలు, ప్రతి విమర్శలతో కొద్ది వారాలుగా వేడెక్కిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసొంలో

పోలింగ్‌ డే

  • తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు నేడే
  • అసోంలో చివరి దశ..  బెంగాల్‌లో మూడో దశకూ
  • అన్నాడీఎంకే, డీఎంకే హోరాహోరీ
  • 234 స్థానాలకు ఒకే విడతలో..
  • హ్యాట్రిక్‌ కొట్టాలని జయ పార్టీ
  • విజయం తమదేనని స్టాలిన్‌ ధీమా
  • కేరళలో 2 కూటములదే హవా
  • గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ
  • రెండు దక్షిణ రాష్ట్రాల్లోనూ మోదీ, అమిత్‌షా విస్తృత ప్రచారం


చెన్నై-ఆంధ్రజ్యోతి, తిరువనంతపురం/గువాహటి, కోల్‌కతా, ఏప్రిల్‌ 5: భారీ ర్యాలీలు, పెద్దఎత్తున రోడ్‌షోలు.. విమర్శలు, ప్రతి విమర్శలతో కొద్ది వారాలుగా వేడెక్కిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసొంలో మంగళవారం కీలకమైన పోలింగ్‌ ఘట్టం జరుగనుంది. పశ్చిమ బెంగాల్లోనూ మూడో దశ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధానంగా తమిళనాడు, కేరళ పోరు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తమిళనాట కరుణానిధి, జయలలితవంటి సినీ, రాజకీయ దిగ్గజాలు లేకుండా తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. కేరళలో 44 ఏళ్లుగా ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాలు మారే ఆనవాయితీని బద్దలు కొట్టాలని సీఎం పినరయి విజయన్‌ సారథ్యంలోని ఎల్డీఎఫ్‌ భావిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది.


తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. 3,998 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌ సాయంత్రం 7 వరకు కొనసాగనుంది. మొత్తం 6.29 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని  ఉవ్విళ్లూరుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసిన తమకే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పట్టం కడతారని డీఎంకే ఆశిస్తోంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర ప్రచారం నిర్వహించారు.


ఇక అన్నాడీఎంకే కూటమికి ప్రధాని మోదీ, అమిత్‌ షా తదితర బీజేపీ జాతీయ నేతలు అండగా నిలవగా.. డీఎంకే కూటమికి మద్దతుగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారం చేశారు. మక్కల్‌నీదిమయ్యం అధ్యక్షుడు, సీనియర్‌ నటుడు కమల్‌ హాసన్‌ సైతం గత డిసెంబరు 13వ తేదీ నుంచి ప్రచారం నిర్వహించారు. ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీ నేత టీటీవీ దినకరన్‌.. అన్నాడీఎంకే ఓట్లను చీల్చడమే లక్ష్యంగా ప్రచారం చేపట్టారు. 


ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ?

ఎన్డీయే కూటమిలో 10 పార్టీలు ఉన్నాయి. అందులో పీఎంకే(23), బీజేపీ(20) తప్ప మిగిలిన పార్టీలన్నీ అన్నాడీఎంకే చిహ్నంపైనే పోటీచేస్తున్నాయి. అన్నాడీఎంకే 179 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మిత్రపక్షాలతో కలిపి ఆ పార్టీ గుర్తుపై 191 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డీఎంకే కూటమిలో 13 పార్టీలు ఉండగా ఆ పార్టీ 173 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ (25 స్థానాలు), సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఎండీఎంకే తలా ఆరేసి స్థానాల్లో, ఐయూఎంఎల్‌ 3 స్థానాల్లో బరిలో నిలిచాయి. కమల్‌ పార్టీ ఎంఎన్‌ఎం 157 స్థానాల్లో, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం 165 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కన్నియాకుమారి లోక్‌సభ స్థానానికి కూడా మంగళవారమే ఉప ఎన్నిక జరుగనుంది.



పుదుచ్చేరిలో సర్వం సిద్ధం 

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభకు కూడా మంగళవారం పోలింగ్‌ జరుగనుంది. 30 అసెంబ్లీ స్థానాలకు 324 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం 10,04,507 మంది ఓటర్లు ఉన్నారు. డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి, ఎన్‌ఆర్‌ కాంగ్రె్‌స-బీజేపీ-అన్నాడీఎంకే కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి.



కేరళలో విజయన్‌ వర్సెస్‌ చాందీ

140 స్థానాల కేరళ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో 957 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవిష్యత్‌ను 2.74 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో సీపీఎం అగ్ర నేత, సీఎం పినరయి విజయన్‌, ఆయన కేబినెట్‌ మంత్రులు కేకే శైలజ, కె.సురేంద్రన్‌, ఎం.ఎం.మణి, కేకే జలీల్‌ తదితరులు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ సీఎం ఊమెన్‌ చాందీ, ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితల, కె.మురళీధరన్‌.. బీజేపీ నుంచి మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ తదితరులు బరిలో ఉన్నారు.


సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ జరుగుతోంది. సీఎం పినరయి విజయన్‌, మాజీ సీఎం ఊమెన్‌ చాందీ తమ కూటముల తరఫున ప్రచారంలో ముని గారు. రాష్ట్రంలో గత 44 ఏళ్లలో ఒకే పార్టీ లేదా కూటమి వరుసగా రెండు సార్లు విజయం సాఽధించలేదు. ఆ ఆనవాయుతీని బద్దలు కొట్టాలని పినరయి భావిస్తున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూడా గట్టి సవాలే విసురుతోంది.



అసోంలో తుది దశ..

126 మంది సభ్యుల అసోం అసెంబ్లీకి 3 విడతల్లో పోలింగ్‌ జరుగుతోంది. మంగళవారం తుది దశలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్డీయేకు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమికి మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది.




బెంగాల్లో 31 స్థానాలకు..

294 మంది సభ్యుల పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి 8 దశలుగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలు ముగిశాయి. మంగళవారం మూడో దశలో 31 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పాలక టీఎంసీకి కంచుకోటలైన హౌరా, హుగ్లీ, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఈ సీట్లు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రె్‌స-లె్‌ఫ్ట-ఐఎ్‌సఎఫ్‌ కూడా బరిలో ఉండడంతో త్రిముఖ పోటీ జరుగుతోంది. 




అసోంలో అవకతవకలు


ఓటర్లు 90 మంది.. పోలైన ఓట్లు171 

ఓ పోలింగ్‌ బూత్‌ పరిధిలో 90 మంది ఓటర్లు ఉంటే 171 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్‌ రోజు అవకతవకలు జరిగాయని గుర్తించిన అధికారులు రీపోలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. అసోంలో ఏప్రిల్‌ 1న జరిగిన పోలింగ్‌ సందర్భంగా డిమా హాసావో జిల్లా హాఫ్లాంగ్‌ నియోజకవర్గం ఖోట్లిర్‌ ఎల్పీ స్కూల్‌లోని ఓ బూత్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


Updated Date - 2021-04-06T08:49:18+05:30 IST