కాలుష్య రాజధాని.. ఢిల్లీ

ABN , First Publish Date - 2022-03-23T06:57:18+05:30 IST

కాలుష్యంతో కునారిల్లే రాజధానుల జాబితాలో ఢిల్లీ వరుసగా నాలుగో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లోని 6475 నగరాలు....

కాలుష్య రాజధాని.. ఢిల్లీ

అత్యధిక కాలుష్యం ఉన్న రాజధాని నగరాల్లో టాప్‌

‘ప్రపంచ వాయు నాణ్యత నివేదిక’లో వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా 6475 నగరాల్లో కాలుష్య గణన

టాప్‌-100లో 63 మనవే.. ఉత్తరాదిలోనే ఎక్కువ

232వ స్థానంలో హైదరాబాద్‌.. తెలంగాణలో ఒక్కటే

155వ స్థానంలో విశాఖ.. 354వ స్థానంలో తోగుమ్మి

అమరావతి ర్యాంకు 487.. తిరుపతి స్థానం 516

వరుసగా నాలుగో ఏడాది ఢిల్లీకి అదే ర్యాంకు


న్యూఢిల్లీ, మార్చి 22: కాలుష్యంతో కునారిల్లే రాజధానుల జాబితాలో ఢిల్లీ వరుసగా నాలుగో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లోని 6475 నగరాలు/పట్టణాలు/ప్రాంతాల్లో వాయునాణ్యతను పరిశీలించిన స్విస్‌ పొల్యూషన్‌ టెక్నాలజీ కంపెనీ ‘ఐక్యూ ఎయిర్‌’ మంగళవారం ‘ప్రపంచ వాయునాణ్యత నివేదిక’ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2021లో మొదటి 5 స్థానాల్లో ఉన్న అత్యంత కాలుష్య దేశాలు వరుసగా.. బంగ్లాదేశ్‌, చాద్‌, పాకిస్థాన్‌, తజికిస్థాన్‌, భారత్‌. సాధారణంగా వాహనాలు, పరిశ్రమలు తదితరాల వల్ల వాతావరణంలో రకరకాల కాలుష్య ఉద్గారాలు వెలువడతాయి. వాటిలో పీఎం 10, పీఎం 2.5 (అతి సూక్ష్మ ధూళి కణాలు) అత్యంత ప్రమాదకరమైనవి. 


అస్తమా, స్ట్రోక్‌, హృద్రోగాలు, ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమై ఏటా ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నాయి. అవి వాతావరణంలో ఎంతవరకూ ఉండొచ్చనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిరుడు సెప్టెంబరులో విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ ప్రకా రం ఏ ప్రాంతంలోనైనా పీఎం 2.5 స్థాయుల వార్షిక సగటు ఘనపు మీటరుకు 5 మైక్రోగ్రాములకు మించి ఉండకూడదు. అంతకు మించి పీఎం 2.5 స్థాయులు ఎంత ఎక్కువ ఉంటే అక్కడి ప్రజలు అస్తమా, హృద్రోగాలు, ఊపిరితిత్తుల వ్యాధుల వంటివాటి బారినపడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రపంచంలో ఏ దేశమూ డబ్ల్యూహెచ్‌వో సూచించిన ప్రమాణాలను అందుకోలేదని ఐక్యూ ఎయిర్‌ పరిశీలనలో వెల్లడైంది. వాయునాణ్యత ఘోరంగా ఉండి, కాలుష్య కాసారాలుగా మారిన టాప్‌-100 ప్రాంతాల్లో 63 భారతీయ నగరాలు/పట్టణా లు ఉన్నట్టు తేలింది. ఆ 63 నగరాల్లో సగానికన్నా ఎక్కువ హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోనివే కావడం గమనార్హం. వాటిలో టాప్‌-3లో ఉన్న నగరాలు భివాడీ(రాజస్థాన్‌), ఘజియాబాద్‌ (ఉత్తరప్రదేశ్‌), ఢిల్లీ. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఈ జాబితాలో 5 నగరాలు/పట్టణాలు ఉన్నా యి.


ఏపీలోని విశాఖపట్నం అగ్రస్థానంలో.. మొత్తం 6475 నగరాల జాబితాలో 155వ స్థానంలో నిలిచింది. విశాఖలో పీఎం 2.5 స్థాయుల వార్షిక సగటు 44.3 మైక్రోగ్రాములు/ఘనపు మీటరుగా నమోదు కావడం గమనార్హం. తెలంగాణలోని హైదరాబాద్‌ 39.4 సగటుతో 232వ స్థానంలో నిలవగా.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, రాజమండ్రికి సమీపంలోని తోగుమ్మి 33.9 సగటుతో 354వ స్థానంలో నిలిచింది. 29.5 వార్షిక సగటుతో అమరావతి (రాజధాని కాదు.. పంచారామ క్షేత్రం) 487వ స్థానంలో, తిరుపతి 28.8 వార్షిక సగటుతో 516వ స్థానంలో నిలిచాయి. దేశంలోని 6 మెట్రో నగరాల్లో చెన్నై మినహా మిగతా 5 నగరాల్లో వాయు కాలుష్య స్థాయులు 2020 కన్నా 2021లో పెరిగాయి. 


భారత్‌లో నానాటికీ తీసికట్టు..

భారత్‌లో 2021లో పీఎం 2.5 స్థాయుల సగటు.. కొవిడ్‌ పూర్వపు స్థాయులకు చేరుకుందని ఐక్యూ ఎయిర్‌ తన నివేదికలో పేర్కొంది. 2021లో మనదేశంలో పీఎం 2.5 స్థాయుల వార్షిక సగటు.. ఘనపుటడుగుకు 58.1 మైక్రోగ్రాములకు చేరుకుంది. ఇక.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఢిల్లీలో అతి సూక్ష్మ ధూళి కణాల తీవ్రత 14.6% మేర పెరిగింది.


‘‘భారత్‌లో ప్రజల ఆరోగ్యంపై వాయు కాలు ష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండో అతిపెద్ద వ్యాధికారకంగా నిలుస్తోంది. భారత్‌లో వాయు కాలుష్యం వల్ల కలిగే ఆర్థిక నష్టం విలువ రూ.11.4 లక్షల కోట్లుగా ఉంది. భారత్‌లో కాలుష్య ముప్పు పెరగడానికి 38 ప్రధాన కారణాలున్నాయి’’ అని ఐక్యూ ఎయిర్‌ పేర్కొంది. గత ఏడాది కూడా ఢిల్లీని కాలుష్య రాజధానిగా ప్రకటించడాన్ని కేంద్రం తోసిపుచ్చింది. ఉపగ్రహ సమాచారం ఆధారంగా సేకరించిన సమాచారంతోనే ఈ నివేదిక ఇచ్చారని, క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించలేదని పేర్కొంది. దానికి స్పందించిన ఐక్యూ ఎయిర్‌.. తాము శాటిలైట్‌ డేటాతోపాటు, ప్రపంచవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన గ్రౌండ్‌ సెన్సర్ల సమాచారాన్ని కూడా తీసుకుంటామని, వాటిలో సగానికి పైగా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవేనని తెలిపింది.


మరికొన్ని ముఖ్యాంశాలు..

గత ఏడాది గణాంకాలతో పోలిస్తే భారత్‌లోని పలు ప్రాం తాల్లో వాయు నాణ్యత మరింత దిగజారగా, చైనాలో మాత్రం చాలా చోట్ల గతం కన్నా పరిస్థితి మెరుగైంది.


కర్బన ఉద్గారాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, బొగ్గుతో నడిచే విద్యుత్‌ కేంద్రాలు, ఇతర పరిశ్రమల్లో కార్యకలాపాల తగ్గింపు వంటి చర్యల వల్ల చైనా రాజధాని బీజింగ్‌లో వాయు నాణ్యత వరుసగా ఐదో ఏడాది మెరుగుపడింది.


మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతాల్లోని నగరాల్లో అత్యధిక కాలుష్యం ఉంది. ప్రపంచంలోని టాప్‌-50 కాలుష్య బాధిత నగరాల్లో 46 ఈ ప్రాంతాలవే కావడం ఇందుకు నిదర్శనం. అందులో 11 నగరాలు మనదేశంలోనే ఉన్నాయి.


మొత్తం 6,475 నగరాల్లో డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు లోబడి పీఎం 2.5 స్థాయులు ఉన్న నగరాలు కేవలం 222. దేశాలైతే మూడే. అవి.. ప్యూర్టోరికో (4.8), యూఎస్‌ వర్జిన్‌ ఐలండ్స్‌(4.5), న్యూకాలిడోనియా (3.8.. ఆస్ట్రేలియాకు సమీపంలో ఉండే ఫ్రెంచ్‌ టెరిటరీ).


ఈ నివేదికలోని 1887 ఆసియా నగరాల్లో నాలుగు (0.2ు) మాత్రమే డబ్ల్యూహెచ్‌వో పీఎం 2.5 మార్గదర్శకాలను అందుకున్నాయి.



Updated Date - 2022-03-23T06:57:18+05:30 IST