తగ్గిన బాణసంచా కాలుష్యం

ABN , First Publish Date - 2020-11-17T06:04:57+05:30 IST

ఏటా దీపావళి రోజున విశాఖ బాణసంచా మోతతో దద్దరిల్లేది. అదేస్థాయిలో వాయు కాలుష్యం కమ్మేసేది. నగరవాసులు రెండు, మూడు రోజలపాటు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ప్రజల అవగాహనకు తోడు, ప్రభుత్వ ఆంక్షల కారణంగా బాణసంచా పేలుళ్లు...దాంతోపాటే కాలుష్యం తగ్గాయి.

తగ్గిన బాణసంచా కాలుష్యం

పీఎం 2.5...సాధారణం కంటే  1.72 నుంచి 25 శాతం వరకు పెరుగుదల

పీఎం 10...5.3 నుంచి 24.54 శాతం పెరుగుదల

 గత ఏడాదితో పోల్చితే తగ్గిన ధూళి

 ఒక్క కురుపాం మార్కెట్‌ వద్ద మాత్రం శబ్ద కాలుష్యం కాస్త ఎక్కువగా నమోదు

 కాలుష్య నియంత్రణ మండలి వెల్లడి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఏటా దీపావళి రోజున విశాఖ బాణసంచా మోతతో దద్దరిల్లేది. అదేస్థాయిలో వాయు కాలుష్యం కమ్మేసేది. నగరవాసులు రెండు, మూడు రోజలపాటు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ప్రజల అవగాహనకు తోడు, ప్రభుత్వ ఆంక్షల కారణంగా బాణసంచా పేలుళ్లు...దాంతోపాటే కాలుష్యం తగ్గాయి. 

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పీఎం (పార్టిక్యులేట్‌ మేటర్‌) 2.5 (అత్యంత సూక్ష్మమైన ఽధూళి కణాలు...మిల్లీమీటరులో 400వ వంతు ఉంటాయి. దీనిని ఫైన్‌ డస్ట్‌ అని అంటారు. ఇవి అత్యంత హానికరం.) రోజువారీ సగటు 60, ఏడాది సగటు 40కు ఉండాలి. దీపావళి నాడు నగరంలో సాధారణ రోజుల్లో కంటే 1.72 నుంచి 25 శాతం వరకూ పెరిగాయి. ఏటా దీపావళి రోజున కాలుష్య తీవ్రతను తెలుసుకునేందుకు కాలుష్య నియంత్రణ మండలి నగరంలోని పలుచోట్ల యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ యంత్రాలు ఏర్పాటుచేస్తుంటుంది. పండుగ నాడు, అంతకు ఐదారు రోజుల ముందు నమోదైన వివరాలను పరిశీలించి...రెండింటికీ మధ్య తేడాను లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న నగరం, శివారు ప్రాంతాల్లో తొమ్మిదిచోట్ల యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ, ఆరుచోట్ల శబ్ద తీవ్రతను నమోదుచేసింది. పీఎం 2.5...మిందిలో 60, పోలీస్‌ బ్యారెక్స్‌ వద్ద 62, ఏకేసీ కాలనీలో 74, సీతమ్మధారలో 45, పెదగంట్యాడలో 51, ఆటోనగర్‌లో 55, జ్ఞానాపురంలో 52, రాంకీ ఫార్మా వద్ద 58, ఎంవీపీ రైతుబజార్‌లో 38 నమోదైంది. అంటే...కొన్నిచోట్ల సగటు ప్రామాణికం కంటే తక్కువగా, కొన్నిచోట్ల అదేస్థాయిలోనూ, రెండుచోట్ల మాత్రం ఎక్కువగా నమోదైంది.

పీఎం 10 (పీఎం 2.5 కంటే కొంచెం పెద్ద సైజులో వుండే ధూళి కణాలు. ఇవి ఒకవేళ పీల్చినా తరువాత తుమ్మితే బయటకు వచ్చేస్తాయి) సాధారణంగా పీఎం 10 రోజువారీ సగటు 100, ఏడాది సగటు 60గా ఉండాలి.  ఇవి శనివారం మిందిలో 133, పోలీస్‌ బ్యారెక్స్‌ వద్ద 126, ఏకేసీ కాలనీలో 163, సీతమ్మధారలో 97, ఆటోనగర్‌లో 130, పెదగంట్యాడలో 111, రాంకీ ఫార్మాలో 132, జ్ఞానాపురంలో 121, ఎంవీపీ రైతుబజారులో 82గా నమోదైంది. 


కురుపాం మార్కెట్‌ వద్ద శబ్ద కాలుష్యం

దీపావళి రోజున సాయంత్రం ఆరు నుంచి రాత్రి 11 గంటల వరకు నగరంలో ఆరుచోట్ల శబ్ద కాలుష్యం నమోదుచేశారు. సాధారణంగా 60 డెసిబుల్స్‌ను భరించవచ్చు. అదే 80గా నమోదైతే మాత్రం భరించలేం సరికదా.. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి 11 వరకు కేజీహెచ్‌ ప్రాంతంలో 59.3 నుంచి 73.9 వరకు, పాండురంగాపురంలో 67.4 నుంచి 68.2, సెయింట్‌ అలోసిస్‌ పాఠశాల వద్ద 66.1 నుంచి 74, కురుపాం మార్కెట్‌లో 58 నుంచి88.7, జగదాంబ జంక్షన్‌లో 63.9 నుంచి 75.6, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద 64.7 నుంచి 70.8 డెసిబుల్స్‌ నమోదైంది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం దీపావళి రోజున అన్నిరకాల కాలుష్యాలు తక్కువగా నమోదైనట్టు ఏపీపీసీబీ ఇన్‌చార్జి ఈఈ సుభాన్‌ షేక్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతోపాటు కరోనాను దృష్టిలో పెట్టుకుని ప్రజలు గ్రీన్‌ బాణసంచా...అది కూడా తక్కువ మోతాదులో కాల్చారని పేర్కొన్నారు.

Updated Date - 2020-11-17T06:04:57+05:30 IST