ఆగమైపోయారు..

ABN , First Publish Date - 2021-06-12T05:38:37+05:30 IST

ఆగమైపోయారు..

ఆగమైపోయారు..
శాయంపేట శివారులో సాగు చేస్తున్న చామంతి పూలతోట

హరిత పందిళ్ల సాగుకు గట్టిదెబ్బ

లాక్‌డౌన్‌తో కోలుకోని నష్టం 

పాలిహౌస్‌ రైతుల విలవిల

ఐదు మండలాల్లో పాలిహౌస్‌ సాగు..

నిండా ముంచిన చామంతి

కూరగాయలు.. ఆకు కూరల లాభాలూ అంతంతే..

 

పరకాల, జూన్‌ 11 : వ్యవసాయంలో నూతన ఒరవడిని సృష్టించేందుకు.. ఆదాయాన్నిచ్చే పంటల సాగు వైపు రైతులను మళ్లించాలని ప్రభు త్వం  భావించింది. ఇందులో భాగంగా హరిత పందిళ్ల సాగుపై ఆసక్తిగల రైతులకు భారీ సబ్సిడీ అందజేసింది. ఆదిలోనే హంసపాదు అన్నచందంగా కరోనా దెబ్బకు రైతులు తీవ్ర నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో బాధిత రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఐదు మండలాల్లో సాగు.. 

ప్రభుత్వం, అధికారుల మాటలు నమ్మి నూతన ఒరవడిని సృష్టిద్దామని హరిత పందిళ్ల సాగుకు నర్సంపేట, గీసుకొండ, పరకాల, వర్ధన్న పేట, శాయంపేట మండలాల్లో పలువురు రైతులు ముందుకొచ్చారు. హరిత పందిళ్లు (పాలీహౌస్‌) కింద క్యాప్సికం, కీర, టమాటా, బీన్స్‌, క్యారెట్‌, కూరగా యలు, ఆకు కూరలతోపాటు పూల మొక్కలసాగు చేయా ల్సి ఉంటుంది. ఐదు మండలాల్లో మొత్తం 23ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. కొంతమందికి పెట్టుబడిపోను అరకొర లాభాలు రాగా మరి కొంతమంది నిండా మునిగారు.


నష్టపరిచిన చామంతి 

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చునని ఎక్కువ మంది రైతులు చామంతి సాగుకు ఆసక్తి చూపారు. పంట చేతికొచ్చే సమయానికి పెళ్లిళ్ల సీజన్‌ రావడంతో చామంతి పూవ్వులను అధిక డిమాండ్‌ ఉండడంతో లాభాలు పొందవచ్చని రైతులు భావించారు. ఉత్సాహంగా హరిత పందిళ్లలో సాగు చేసి అనుకున్న దిగుబడి సాధించారు. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లిళ్లు, శుభాకార్యాలయాలు తగ్గడం, రవాణా సౌకర్యం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.


పాలిహౌస్‌కు భారీ సబ్సిడీ...

పాలిహౌస్‌ సాగున విస్తరించేందుకు ప్రభుత్వం రైతులకు భారీగా సబ్సిడీలను అందించింది. ఎకరా విస్తీర్ణంలో హరిత పందిరిని నిర్మించుకోవడానికి రూ.34 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో బీసీలకు 75శాతం, ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం రాయితీ వర్తింప జేసింది. మిగతా మొత్తాన్ని రైతులు డీడీ రూపంలో చెల్లించారు. కాగా, పందిళ్ల కింద సాగుచేసే కూరగాయాలకు ఎకరా కు రూ.4.20లక్షలు, పూల తోటలకు రూ.6లక్షల వరకు పెట్టుబడి అవుతుంది.  ఇప్పటివరకు నర్సంపేటలో రెండు, గీసుకొండలో రెండు, పరకాలలో మూడు, వర్ధన్నపేటలో రెండు యూనిట్లలో పంట సాగు చేశారు. 


లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌..

హరిత పందిరి కింద సాగుచేసిన చామంతి, టమాటా, కీరదోస వంటి పంటలను సాగుచేసిన రైతులను కరోనా నిండా ముంచింది. కరోనా విపత్క ర పరిస్థితుల మూలంగా రైతులు ఎగుమతి చేసుకునే సౌకర్యం లేకపోయిం ది. శుభకార్యాలు కూడా జరగకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో పండిన ఉత్పత్తులను సరైన ధరకు అమ్ముకోలేక నష్టాలను చవిచూ డాల్సి వచ్చింది. చేసేదేమీలేక సమీప మార్కెట్లకు తమ ఉత్పత్తులను తీసుకెళ్లినా కూడా కొనేవారు లేకపోవడంతో భారీగానే నష్టం వాటిల్లింది. 


కాలాన్ని తట్టుకునే పాలిహౌస్‌ సాగు..

హరిత పందిళ్ల కింద ఎలాంటి కాలంలోనైనా క్యాప్సికం, కీర, టమాటా, బీన్స్‌, క్యారెట్‌ తదితర కూరగాయలతోపాటు ఆకుకూరలను సాగు చేయొచ్చు. కుండపోత వర్షాలకైనా తట్టుకొని కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసే వెసులుబాటు హరిత పందిళ్ల ద్వారా కలుగుతుంది. పైగా వా తావరణ పరిస్థితులను అధిగమించి సాగైన కూరగాయలు, ఆకుకూరలకు మంచి గిరాకీ ఉంటుంది. హరితపందిళ్ల కింద సాగు అయిన కూరగాయలు, ఆకుకూరలు భవిష్యత్తులో విదేశాలకు ఎక్కువ మొత్తంలో దిగుమతులు అవుతూ మంచి లాభాలను సాధించే అవకాశం ఉంటుంది. 


కూలీల డబ్బులు కూడా మిగల లేదు : జి. సత్యనారాయణరెడ్డి రైతు, శాయంపేట

వేలకువేలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన చామంతి పంటకు కనీసం కూలి డబ్బులు కూడా మిగల లేదు. ప్రస్తుతం పంటను తొలగించి టమాటా సాగు చేస్తున్నా. అధికారుల మాటలు విని ఆగమైపోయిన. పంటల సాగుకు సంబంధించిన అనుకూల, ప్రతికూల పరిస్థితలను కూడా చెప్పలేదు. నష్టపోయిన నాలాంటి రైతులను ఆదుకోవాలి.

Updated Date - 2021-06-12T05:38:37+05:30 IST