Abn logo
Mar 28 2020 @ 03:42AM

కరుణామయి

ఒక్కొక్క రేకు రాలుతున్న పూవులా

భూమి సన్నగా వణుకుతుంది

అమ్మోరు పోసిన బాలింత శిశువులా

ప్రపంచం ఒళ్లు కాలిపోతున్నా

తన చన్నుని పిల్లోడి నోట్లోంచి తీయని తల్లిలా

భూమి మూలుగుతుంది

అమ్మకి జ్వరం వచ్చిందంటే

ఇళ్లంతటికి జ్వరం వచ్చినట్టే

మనుషులకి ఫ్లూ వచ్చిందని 

భూమికీ ఒళ్ళు సలపరిస్తున్నట్టుంది

కరోనా కౌగలింతలో 

కన్నీరులా కరిగిపోతున్న ప్రపంచానికి

భూమి ఇప్పుడు స్వస్థత జలని తవ్వుతుంది

నదులూ సముద్రాలను తోసిపుచ్చి

శుభ్రంగా ఉన్న చేతులకోసం వెదుకుతుంది

కలుషితం కాని పెదాల కోసం వెదుకుతుంది

కడగబడ్డ చేతులూ

మౌనంగా ఉంటూ ధ్యానించే పెదాల పవిత్ర కోసం వెదుకుతుంది

ఏదైతేనేం కొంత కాలం

మనల్ని మనం మౌనంలోకి నెట్టేసుకుని

వేరుపడదాం

అక్కడ పాలపుంతల సంఘర్షణమధ్య

భూమి స్వస్థత కోసం కలకందాం

భూమి తనని తాను మళ్లీ 

కొత్తగా చిగురింప చేసుకునేప్పుడు

తన దృష్టినుంచి మనం దాక్కుని

కళ్ళు మూసుకుందాం

మరో అద్భుతాన్ని 

ఆవిష్కరించుకునే తల్లిలా

ధరణి మళ్లీ మనల్ని 

ప్రేమగా హత్తుకుంటుంది

– మెర్సీ మార్గరెట్

Advertisement
Advertisement
Advertisement