పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

ABN , First Publish Date - 2021-11-30T04:54:27+05:30 IST

మండలంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
మొగళ్లూరు వీధుల్లో ప్రవహిస్తున్న వర్షపు నీరు

స్తంభించిన జన జీవనం


పొదలకూరు రూరల్‌, నవంబరు 29 : మండలంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎటుచూసినా వరద నీళ్లే కనిపిస్తున్నాయి. మండలంలోని 30 పంచాయతీల పరిధిలో చిన్న, పెద్ద చెరువులు ప్రమాదకర స్థాయిలో నిండి, కలుజులు పొంగుతున్నాయి. నావూరు పెద్దవాగు, తాటిపర్తి లుడుంవాగు ఉధృతంగా  ప్రవహిస్తున్నాయి. ఇక పెన్నా పరివాహక ప్రాంత గ్రామాలైన సూరాయపాళెం, విరువూరు, మహమ్మదాపురం గ్రామాల్లోని పంట పొలాలను వరద నీరు చుట్టుముట్టింది. కండలేరు ఎడమ కాలువకు తోడేరు, మరువూరు మధ్య చిన్న చిన్న గండ్లు పడ్డాయని గ్రామస్థులు తెలిపారు. డేగపూడి సమీపంలోని కండలేరు వాగు పొంగుతోంది. ఇక చెరువుల విషయానికొస్తే ఆల్తూర్థి, కనుపర్తి, మొగళ్లూరు, బిరదవోలు, మరుపూరు, నావూరు చెరువులు కలుజులు పారుతున్నాయి. పొదలకూరు నుంచి భోగసముద్రం, చెన్నారెడ్డిపల్లి, నావూరు గ్రామాల మీదుగా  రెండు మార్గాలు ఉంటే రెండింటినీ మూసివేశారు. దీంతో పై గ్రామాల ప్రజలు పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షం మరో రెండు రోజులు కొనసాగితే నిమ్మ చెట్లు కూడా ప్రమాదంలో పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.  


ఎడతెరపి లేని వర్షాలతో తీవ్ర ఇబ్బందులు

ముత్తుకూరు : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోమవారం ఉదయం 8 గంటల వరకు 124మి.మీ వర్షపాతం నమోదయ్యింది. గతంలో కురిసిన వర్షాల కారణంగా పొలాల్లో నిండిన నీరు బయటకు వెళ్లకముందే మళ్లీ వర్షాలు పడుతుండడంతో నారుమళ్లు నీటమునిగాయి. మండలంలో దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా నారుమళ్లు నష్టపోయినట్లు అధికారుల అంచనా. రైతులకు 80శాతం సబ్సిడీ కింద వరి విత్తనాలు అందజేస్తున్నామని వ్యవసాయాధికారి హరికరుణాకర్‌రెడ్డి తెలిపారు. తహసీల్దారు సోమ్లానాయక్‌, ఎంపీడీవో ప్రత్యూష, సీఐ వేమారెడ్డి తీరగ్రామాల్లో పర్యటిస్తూ, పరిస్థితులను పరిశీలిస్తున్నారు. తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అసౌకర్యం కలిగినా తమకు సమాచారం అందిస్తే, తక్షణ సహాయ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వర్షాలకు దళితవాడలు, గిరిజన కాలనీల్లో వర్షపునీరు నిలిచిపోయింది. పలుచోట్ల కాలనీల్లో రహదారులు జలమయమయ్యాయి.  మురుగుకాలువలు నిండిపోయి, నీరు రోడ్లపైకి రావడంతో వాహన చోదకులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆగకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 

Updated Date - 2021-11-30T04:54:27+05:30 IST