పండగ పేరుతో వ్యాపారుల నిలువుదోపిడీ

ABN , First Publish Date - 2021-10-14T21:21:26+05:30 IST

సద్దుల బతుకమ్మ, విజయదశమి పండగలు కలిసి రావడం కొందరు వ్యాపారుల పంటపండుతోంది. ముఖ్యంగా మార్కెట్‌లో పూజాసామగ్రి ధరలు భారీగా పెంచేస్తున్నారు.

పండగ పేరుతో వ్యాపారుల నిలువుదోపిడీ

హైదరాబాద్‌: సద్దుల బతుకమ్మ, విజయదశమి పండగలు కలిసి రావడం కొందరు వ్యాపారుల పంటపండుతోంది. ముఖ్యంగా మార్కెట్‌లో పూజాసామగ్రి ధరలు భారీగా పెంచేస్తున్నారు. గత తొమ్మిది రోజులుగా దేవీ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పూలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీంతో కొరత పేరుతో పూల వ్యాపారులు అధిక ధరలతో కొనుగోలు దారులను దోచేస్తున్నారు. దేవీ నవత్రుల సందర్భంగా చాలా ప్రాంతాల్లో బస్తీలు, కాలనీల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక చామంతి, గులాబీ, లిల్లి వంటి పూలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. చామంతి, లిల్లి, గులాబీ వంటి పూలను 50 గ్రాములకు 20 నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఆయా పూల ధర కిలోకు 400 నుంచి 600 రూపాయలకు విక్రయిస్తున్నారు. 


ఇక పూల దండలు కూడా సాధారణ దండ అయితే 100 రూపాయలకు తక్కువకు రావడం లేదు. అమ్మవార్లకు వేసే దండలు ఒక్కటి 200 నుంచి 300 రూపాయలకు అమ్ముతున్నారు. సద్దుల బతుకమ్మ పండగ కూడా రావడంతో సామాన్య ప్రజలు పూలు కొనే పరిస్థితి లేకుండా పోయింది. బతుకమ్మలను తయారుచేసేందుకు వినియోగించే గుణుగు పూలు, బంతి వంటి పూలు ధరలు పెంచి అమ్ముతున్నారు. బంతి పూలు కిలో 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఆయుధ పూజకు వినియోగించే అరటి కొమ్మల ధర విపరీతంగా పెంచి అమ్ముతునారు. కాస్త చిన్నవి అయితే 300 రూపాయలుకు రెండు అమ్ముతుండగా షాపులు, వ్యాపారసంస్థలు, ఫ్యాక్టరీలు, కార్ఖానాల వద్ద ఏర్పాటుచేసే అరటి చెట్లు 400 నుంచి 500 రూపాయలకు ఒకటి చొప్పున అమ్ముతున్నారు. 


ఇక గుమ్మడి కాయల ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. చిన్నసైజు గుమ్మడి కాయ 100 రూపాయలకు అమ్ముతుండగా, కాస్త పెద్దవి అయితే 200 నుంచి 300 రూపాయలకు ఒకటి అమ్ముతున్నారు. హైదరాబాద్‌ నగరంలో దసరా, సద్దుల బతుకమ్మ పండగల నేపధ్యంలో కొందరు వ్యాపారులు పూజా సామ్రగి ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వర్షాలకు పంట కొట్టుకు పోయిందని, దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్నారు. మొత్తానికి దసరా, బతుకమ్మ పండగల పేరుతో చాలా మంది వ్యాపారులు కొనుగోలు దారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తప్పని సరై కొనాల్సి వస్తోందని కొనుగోలు దారులు వాపోతున్నారు.

 

Updated Date - 2021-10-14T21:21:26+05:30 IST