కథల కొలను

ABN , First Publish Date - 2020-08-31T06:42:49+05:30 IST

చెరువు వున్న చోటే వున్నా దాని తూము ద్వారా నీళ్లు ఆ చుట్టుపక్కల పొలాలను తడుపుతూ సస్య శ్యామలం చేస్తూంటుంది... సరిగ్గా నిండు చెరువు లాంటి రచయిత మా కలువకొలను సదానంద...

కథల కొలను

సదానంద గొప్పలు చెప్పుకోకపోతే మానె... కొన్ని నిజాలను కూడా దాచేసే మనిషి అనిపిస్తారు. ఆయన ‘గందరగోళం’ నవలకు కొడవటిగంటి ముందుమాట రాశాడని, ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త అమరరాజా అధినేత గల్లా రామచంద్రరావు తన క్లాస్‌మేట్‌ అని, ‘బంగారు నడచిన బాట’ అనే పుస్తకానికి బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనీ ఆ నోటా ఈ నోటా వినిందే తప్ప ఆయన చెప్పింది లేదు. 


చెరువు వున్న చోటే వున్నా దాని తూము ద్వారా నీళ్లు ఆ చుట్టుపక్కల పొలాలను తడుపుతూ సస్య శ్యామలం చేస్తూంటుంది... సరిగ్గా నిండు చెరువు లాంటి రచయిత మా కలువకొలను సదానంద. 1965 ప్రాంతంలో మా పాకాల ఇలాకాలో మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద రచయితలుగా హేమాహేమీలు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. విద్యార్థి దశలో మాకు హీరోలు వీళ్లే. సాహిత్యం పట్ల అభిలాష కలగడానికి కారకులైనారు. 


సదానందం జీవితం బతకలేక బడిపంతులు కథే. భార్య, ముగ్గురు కొడుకులూ, వొక కూతురు... గంపెడు సంసారాన్ని భరించడంలో ఆర్థికంగా కుదురుగా ఏ రోజూ లేదు. కథల మీద వచ్చే పారితోషికం వేణ్ణీళ్లకు చన్నీళ్లు మాదిరిగా. దీంతో పత్రికల్లో ఉద్యోగంచేస్తే బాగుంటుందేమో అని భ్రమపడి... మద్రాసు దాకా వెళ్లి కొ.కు. ముందు ‘చందమామ’ పత్రికకు ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అన్నీ తెలిసిన కొ.కు. ‘‘హాయిగా బడిపంతులు ఉద్యోగం చేసుకోక ఈ పత్రికల్లో ఎందుకు’’ అని సదానందను వెనక్కు పంపాడు. సదానందకు జరిగిన మహోపకారం అది. 


సదానంద జీవితమంతా పాకాల చుట్టూ తిరిగింది. ఉద్యోగానికి కూడా ఆ మండలం దాటి వెళ్ళింది లేదు. బయట ప్రపంచాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. పేరు ప్రఖ్యాతులకు వెంపర్లాడలేదు. తానేమో తన బతుకేమో అన్నట్టు గుట్టుగ కాలం గడిపేశాడు. రాయలసీమ తొలితరం రచయితల్లో సుస్థిర స్థానమే ఆయన ఆస్తి. 


సదానంద హెచ్చుతక్కువగా ఆరడుగుల అందగాడు. ఇస్త్రీ చేసిన తెల్లచొక్కా, తెల్లప్యాంటూ ఆయనకో పెద్ద లగ్జరీ. ఏడెనిమిదేళ్ళ ముందు తిరుపతి మహతి సభా మందిరంలో దివాకర్ల వెంకటావధాని శత జయంతి సభను నిర్వహించి నప్పుడు ఆయనకు సత్కారం తలపెట్టాము. పిలిస్తే మన్నించి వచ్చారు. అప్పుడు కూడా గుంపులో గోవిందంలా ఒకడుగా వున్నారే తప్ప పటాటోపం ప్రదర్శించలేదు. వేదికపైనా కిందా ఆయన అభిమానులు ఆయనతో మాట్లాడి సంతోషించారు. 


మృదు స్వభావం, తగని మొహమాటం వల్లో ఏమో ఒకసారి మనసు ఫౌండేషన్‌ రాయుడు చెప్తే నేను వెళ్ళి సదానందను కలిశాను. ‘‘మీ సమగ్ర సాహిత్యాన్ని రాయుడు వేస్తానంటున్నారు,’’ అని చెప్తే ఆయనేమీ ఆతురత కనబరచ లేదు. ఆ రోజు సమ్మతించి వుంటే సదానంద జీవిత కాలం లోనే ఆయన సంపూర్ణ రచనలు వెలుగు చూసి వుండేవి. 


సదానంద ‘పరాగ భూమి’ కథాసంపుటి ఆవిష్కరణ సభ చిత్తూరు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరగాలని ఆయన కోరిన కోరిక. చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య (పలమనేరు బాలాజీ, సాకం నాగరాజ - కన్వీనర్లు) సభ జరిపి సదానందకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశాము. జిల్లా నలుమూలల నుండి వచ్చిన కవులు, రచయితలు నిండు అభిమానంతో సదానంద దంపతులకు వీడ్కోలు చెప్పారు. 


సదానంద గొప్పలు చెప్పుకోకపోతే మానె... కొన్ని నిజా లను కూడా దాచేసే మనిషి అనిపిస్తారు. ఆయన ‘గందర గోళం’ నవలకు కొడవటిగంటి ముందుమాట రాశాడని, ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త అమరరాజా అధినేత గల్లా రామచంద్ర రావు తన క్లాస్‌మేట్‌ అని, ‘బంగారు నడచిన బాట’ అనే పుస్తకానికి బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనీ ఆ నోటా ఈ నోటా వినిందే తప్ప ఆయన చెప్పింది లేదు. 


సదానంద సాహిత్యపరంగా ఓ నిండు చెరువు. ఎన్నో ప్రక్రియల్లో అక్షర సంపదను పోగేశాడు. ఆయన గొప్ప మానవతావాది. ఆచంద్రతారార్కం మానవ జాతిని మంచి దారిలో నడిపించే ఉత్తమోత్తమ కథ తన ‘అడవితల్లి’ నవల అని సగర్వంగా ప్రకటించాడు. మనిషి బందీగా మిగిలి పోయిన ఈ కరోనా కాలంలో వెళ్ళి వస్తాను నాయినా... అని తలవంచుకుని ధవళ కాంతిలో కలిసిపోయాడు.

సాకం నాగరాజ


Updated Date - 2020-08-31T06:42:49+05:30 IST