భారత్‌లో కరోనా మరణాలు ఎందుకు తక్కువో కారణం తెలిసింది!

ABN , First Publish Date - 2020-10-27T01:12:22+05:30 IST

కరోనా కేసులు, మరణాలతో ప్రపంచం అల్లాడిపోతుంటే భారత్‌లో మాత్రం కరోనా మరణాలు అంతంత మాత్రంగా ఉండడానికి గల కారణం తెలిసింది.

భారత్‌లో కరోనా మరణాలు ఎందుకు తక్కువో కారణం తెలిసింది!

న్యూఢిల్లీ: కరోనా కేసులు, మరణాలతో ప్రపంచం అల్లాడిపోతుంటే భారత్‌లో మాత్రం కరోనా మరణాలు అంతంత మాత్రంగా ఉండడానికి గల కారణం తెలిసింది. మంచి పరిశుభ్ర పరిస్థితులు, పారిశుధ్యం, పరిశుభ్రమైన తాగు నీరు అందే సంపన్న దేశాలతో పోలిస్తే అవి అంతంత మాత్రంగానే లభ్యమయ్యే భారత్‌లాంటి దేశాల్లో కరోనా మరణాలు తక్కువగా ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అత్యధిక స్థాయిలో కేసులు ఉన్న ప్రాంతాలు, దేశాల్లో కొవిడ్ మరణాలు తక్కువగా ఉన్నట్టు భారత శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 


శుక్రవారం ఉదయం నాటికి దేశంలో 1,17,306 కొవిడ్ మరణాలు సంభవించాయి. అదే సమయంలో కేసులు మాత్రం 77,61,312గా ఉన్నాయి. అంటే దేశంలో మరణాల శాతం 1.5 శాతంగా ఉంది. ప్రపంచంలోనే ఇది అత్యల్పం. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీహార్‌లో మరణాల రేటు 0.5 శాతంగా నమోదైంది. దేశ సగటులో ఇది మూడోవంతు. అలాగే, కేరళ, అసోంలలో 0.4, తెలంగాణలో 0.5, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలో 0.9 శాతంగా కొవిడ్ మరణాల రేటు (సీఎఫ్ఆర్) నమోదైంది.


అయితే, అన్ని రంగాల్లోనూ పైన పేర్కొన్న రాష్ట్రాలతో ముందున్న మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్‌లలో మాత్రం సీఎఫ్ఆర్ రేటు 2, అంతకంటే ఎక్కువ ఉండడం గమనార్హం. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సీఎస్ఐఆర్, పూణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, చెన్నైలోని మ్యాథమెటికల్ ఇనిస్టిట్యూట్‌లలో ప్రచురితం అయ్యాయి. 


అధ్యయనకారులు తమ పరిశోధనలో భాగంగా పారిశుద్ధ్యం, నీరు తదితర అభివృద్ధి ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకున్నారు. అలాగే, వంద దేశాలకు పైగా ప్రతీ 10 లక్షల మందికి ఎన్ని మరణాలు నమోదయ్యాయన్న వివరాలను సేకరించి విశ్లేషించారు. పరిశుభ్రమైన తాగు నీటి లభ్యత, పారిశుద్ధ్యం అంతంత మాత్రంగానే ఉన్న ప్రాంతాలు, దేశాల్లో మరణాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. పారిశుద్ధ్య ప్రమాణాలు మెరుగ్గా ఉన్న దేశాల్లో రోగ నిరోధక వ్యవస్థ మందగించడం, తగినంత లేకపోవడం కారణంగానే ఆయా దేశాల్లో ప్రతీ మిలియన్‌కు అత్యధిక స్థాయిలో మరణాలు నమోదైనట్టు తేలిందని అధ్యయనకారులు వెల్లడించారు. 


గతంలో నిర్వహించిన పలు ఇమ్యునోలాజికల్ స్టడీస్ (రోగనిరోధక అధ్యయనాలు) కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. బ్యాక్టీరియల్, పారాసెటిక్ (పరాన్నజీవి) అంటువ్యాధులు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి, భవిష్యత్తులో అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని పేర్కొన్నాయి. అపరిశుభ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరణాల రేటు తక్కువగా ఉన్నట్టు గుర్తించామని, దీనిని ‘ఇమ్యూన్ ట్రైనింగ్’గా పిలుస్తామని కంగ్రాలోని రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎపిడెమాలజిస్ట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.  


వాతావరణంలోని సూక్ష్మక్రిములు ఎక్కువగా బహిర్గతం కావడం, ముఖ్యంగా ఉష్ణమండల పరిస్థితుల్లో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి మరింత బలోపేతమవుతుందని ఇమ్యునాలజిస్ట్ దీప్యామన్ గంగూలీ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-27T01:12:22+05:30 IST